గూడచారి, మేజర్ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు శశికిరణ్ తిక్క. అలాంటి ఆయన కథా స్క్రీన్ ప్లే అందిస్తూ కాజల్ హీరోయిన్గా ఒక సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాతో సుమన్ చిక్కాల దర్శకుడిగా పరిచయమయ్యారు. శశికిరణ్ తిక్క సోదరుడు బాబి తన స్నేహితుడు శ్రీనివాసరావుతో కలిసి నిర్మాతగా మారుతూ ఈ సినిమాని తెరకెక్కించారు. కాజల్ మొట్టమొదటిసారి ఒక పోలీస్ అధికారి పాత్రలో నటించిన ఈ సినిమా మీద టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే మీడియా కోసం ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉంది? కాజల్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
సత్యభామ కథ:
సత్యభామ(కాజల్ అగర్వాల్) ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిణి. సైబరాబాద్ సర్కిల్లో ఏసీపీగా పని చేసే ఆమె షీ టీమ్స్ కి హెడ్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఆట కట్టించిన ఆమె షీ సేఫ్ ఆప్ గురించి అమ్మాయిలకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఒకరోజు ఆమెను కలిసేందుకు హసీనా (నేహా పఠాన్) వస్తుంది. తాను యదు అనే ఒక టాటూ ఆర్టిస్ట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, అయితే అతను ఇప్పుడు తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తుంది. దీంతో సత్యభామ యదుకి ఫోన్ చేసి మరోసారి హసీనా జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. అయితే డ్రగ్స్ మత్తులో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న యదు హసీనాను సత్యభామ కళ్ళముందే చంపేస్తాడు. ఎలా అయినా నిన్ను రక్షిస్తానని చెప్పిన సత్యభామ తన కళ్ళముందే హసీనా చనిపోవడంతో మానసిక వేదన అనుభవిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తమ్ముడు ఇక్బాల్ మిస్సవుతాడు. దానికి కారణం ఎంపీ అన్న కొడుకు (అంకిత్) అని భావించి సత్యభామ అతన్ని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. దీంతో అసలు సత్యభామ ఏం చేసింది? ఈ ఇక్బాల్ ఏమయ్యాడు? అసలు హసీనాను చంపిన వ్యక్తిని సత్యభామ ఏం చేసింది అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ: సత్యభామ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. మనం తెలుగులో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న క్రైమ్ థ్రిల్లర్స్ లాగానే ఈ సినిమా కూడా మొదలవుతుంది.. మొదటి సీన్ నుంచి కాజల్ ను ఎలివేట్ చేయడానికి డైరెక్టర్ ప్రయత్నించినట్లు అనిపించింది. ఒక ఐపీఎస్ అధికారిని చూసి ఐపీఎస్ అధికారి అయిన కాజల్ ఎలాంటి కేసుని అయినా సాల్వ్ చేసేలా తన తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెను షీ టీమ్స్ హెడ్గా నియమిస్తారు. అమ్మాయిల అందరికీ తానున్నానని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్న ఆమెను ఊహించని విధంగా ఒక అమ్మాయి ఆశ్రయిస్తుంది. ఆమెకు భరోసా కల్పించి కాపాడదాం అనుకున్న సమయంలో కళ్ళముందే చనిపోవడంతో చాలా డిస్టర్బ్ అవుతుంది. ఆమెను చంపిన వ్యక్తిని వెతికే పనిలో పడ్డ సత్యభామ ఈ క్రమంలో ఎన్నో సరికొత్త విషయాలను తెలుసుకుంటుంది. హసీనా చనిపోతున్నప్పుడు తన తమ్ముడిని బాగా చూసుకోమని కోరడంతో ఆమెకు మాట ఇచ్చి అందుకు మరింత కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి క్రైమ్ థ్రిల్లర్స్ విషయానికి వస్తే ఏదో ఒక కేసు చుట్టూనే కథ తిరుగుతుంది కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఒక కేసుతో లింకప్ చేస్తూ అనేక లేయర్స్ ని టచ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అది కొంతవరకు ఎంగేజింగ్ అనిపించినా కొన్నిసార్లు మాత్రం కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసినట్లు అయింది. ఒక విషయాన్ని క్లియర్ చేస్తున్నట్టు కనిపిస్తూనే మరొక విషయంతో ప్రేక్షకులలో కొత్త అనుమానాలు క్రియేట్ చేయడంలో మాత్రం టీం సఫలమైనట్లే కనిపించింది. శశికిరణ్ తిక్క మార్క్ స్క్రీన్ ప్లే చాలా చోట్ల మిస్ అయినట్లే అనిపించినా కాజల్ అగర్వాల్ తన మ్యాజిక్ తో కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అది పూర్తిస్థాయిలో సఫలమైందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. ఇప్పటి వరకు ఒక గ్లామర్ డాల్ గా కనిపించిన కాజల్ ఈ సినిమాలో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పోలీస్ అధికారి పాత్రలో కనిపించడమే కాదు కొన్ని యాక్షన్ సీన్స్ లో కూడా మైమరిపించేలా నటించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో తడబడినా బాగానే ఎంగేజ్ చేసింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే సత్యభామ అనే పాత్రలో కాజల్ అగర్వాల్ ఒదిగిపోయింది. ముఖ్యంగా ఆమె యాక్షన్ సీన్స్ విషయంలో మాత్రం ఎంత కేర్ తీసుకుందో తెలియదు కానీ తెర మీద మాత్రం కొత్త కాజల్ ను చూస్తున్నామా అనేలా నటించింది. నవీన్ చంద్రది పరిమితమైన పాత్ర అయినా నెరేషన్ మొత్తం ఆయన చేతే చేయించి కొంతవరకు పాత్రకు డెప్త్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేహా పఠాన్, ఇక్బాల్ పాత్రలో నటించిన వ్యక్తి దివ్య పాత్రలో నటించిన అమ్మాయి సహా అంకిత్ కొయ్య తమ తమ పాత్రలను పరిధి మేరకు సమర్థవంతంగా నటించారు. టెక్నికల్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే బాధ్యతలు మొత్తం తీసుకున్న శశికిరణ్ తన మార్కుని పూర్తిస్థాయిలో క్రియేట్ చేయకపోయినా ఎంగేజింగ్ గా తెర మీదకు తీసుకొచ్చే విషయంలో మాత్రం కొంతవరకు సఫలమయ్యాడు. డైలాగ్స్ కొన్ని ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. స్టంట్ కొరియోగ్రఫీ కాజల్ కి కరెక్ట్ గా సెట్ అయింది. మ్యూజిక్ కూడా పాటలు అన్ని గుర్తుపెట్టుకో లేని విధంగా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపించింది. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంత ట్రిమ్ చేసుకున్నా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ ను క్యారీ చేసేందుకు బాగా ఉపయోగపడింది.
ఫైనల్లీ సత్యభామ కాజల్ మార్క్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళితే నచ్చవచ్చు.