Antony Movie Review: మలయాళంలో గత ఏడాది వచ్చి కాస్త హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలలో ‘ఆంటోని’ కూడా ఒకటి. జోజు జార్జ్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను జోషి డైరెక్ట్ చేశాడు. డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వెర్షన్, ఈ నెల 23వ తేదీన ‘ఆహా’లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఆంటోనీ కథ ఏమిటంటే:
కేరళలోని ఒక టౌన్ లో ఉండే పటాస్ జేవియర్ అనే రౌడీని అదే ఊరిలో ఉండే మరో రౌడీ ఆంటోనీ (జోజు జార్జ్) చంపేస్తాడు. జేవియర్ భార్య జెస్సీ (ఆశా శరత్) ఆ హత్యను కళ్లారా చూసినా ఆంటోనీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా అతని నుంచి కొంత డబ్బు, ఇంటిని నష్టపరిహారంగా కోరుతుంది. ఇక కొత్త ఇంటికి వెళ్లినరోజే జెస్సీ కూడా చనిపోవడంతో ఆమె కూతురు, దుందుడుకు స్వభావం గల మరియా(కళ్యాణి ప్రియదర్శన్) గార్డియన్‌గా ఆంటోనీ ఉండాల్సివస్తుంది. ముందు చీదరించుకున్నా ఆంటోనీకి మరియా దగ్గరయి, తన తండ్రిలా ఫీల్ అవుతుంది. కాలేజీలో అనేక గొడవల కారణంగా ఆమె ఆంటోనీ ఇంటికే షిఫ్ట్ అవుతుంది. వారిద్దరూ బాగానే ఉన్న వారి మధ్య వేరే ఏదో ఉందని కొందరు తప్పుపడతారు. ఇక అదే సమయంలో తన అన్నయ్య జేవియర్ చావుకు కారణమైన ఆంటోనీపై జేవియర్ తమ్ముడు టార్జన్ పగతో రగిలిపోతూ అతని మనుషుల మీద దాడి చేస్తుంటాడు. ఈ క్రమంలో టార్జన్ బారి నుంచి తన వాళ్లను ఆంటోనీ ఎలా కాపాడుకున్నాడు? కరుడు గట్టిన రౌడీగా జీవిస్తున్న ఆంటోనీలో మరియా ఏం మ్యాజిక్ చేసి మార్పచేసింది? ఆంటోనీతోనే మరియా కలిసి ఉందా? లేదా? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా మొత్తం చూడాల్సిందే.
విశ్లేషణ:
కథగా చెప్పుకుంటే ఇది కొత్త కథేం కాదు కానీ ఎన్నో అనుమానాలు రేకెత్తించేలా సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్. ఇంతకు ముందు ఈ తరహా కథలు చాలానే వచ్చినా స్క్రీన్ ప్లేతో చేసిన వర్క్ కథను ప్రేక్షకుల ముందు రివీల్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒక మూర్ఖుడిలా మారిన వ్యక్తి, తనకు ఒక వేళ పెళ్ళై కూతురు పుడితే ఇలా ఉంటుందేమో అనుకునేలా ఒక ఆడపిల్ల వచ్చిన తరువాత ఎలా మారిపోతాడు? అనేది అంతర్లీనంగా కథలో చెప్పాలనుకున్న అంశం అనిపిస్తుంది. తండ్రిని చంపిన వాడు కావడంతో అతని సాయం అక్కర్లేదు అని చెప్పాలనుకున్నా తప్పక అతని నీడలో బ్రతకాల్సిన సమయంలో మరియా వేదన వంటి వాటిని ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. తనకు ఏమీ కాని ఒక ఆడపిల్లని ఆంటోని ఎలా రక్షించాడనేది దర్శకుడు ఆవిష్కరించిన విధానంలో ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు. ఇక క్లైమాక్స్ కూడా ఏదేదో చేసేయాలి అనుకోకుండా ఒక ప్లెజెంట్ ఫీల్ వచ్చేలా ముగించాడు డైరెక్టర్.
ఇక నటీనటుల విషయానికి వస్తే జోజు జార్జ్, కల్యాణి ప్రియా దర్శన్ నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. గ్యాంగ్‌స్టర్ పాత్రలో జోజు జార్జ్ అదరగొట్టాడు. ఇక మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్‌గా కళ్యాణి ప్రియదర్శన్ డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయిగా చూపించారు. ఆమె కూడా ఈ పాత్రను బాగా ఓన్ చేసుకొని నటించిందనిపించింది. హీరో గురువుగా భావించే పాత్రలో చెంబన్ వినోద్ జోస్ నటన బాగుంది. నైలా ఉషా, ఆశా శరత్ లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ కథ కోసం ఎంపిక చేసుకున్న లొకేషన్స్ ను రెనదివ్ గొప్పగా ఆవిష్కరించాడు. ఇక ఎడిటింగ్ బాగుంది.
ఫైనల్ గా ఆంటోనీ ఒక గ్యాంగ్ స్టర్ డ్రామా విత్ ఎమోషన్స్.. మలయాళ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చచ్చు.