NTV Telugu Site icon

Inspector Rishi Review: ట్రైలర్ తోనే వణికించిన ఇన్స్పెక్టర్ రిషి రివ్యూ

Inspector Rishi

Inspector Rishi

Inspector Rishi Web Series Review: ఈ మధ్యకాలంలో సినిమా కంటెంట్ తో పోటీ పడుతూ వెబ్ సిరీస్ లు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు ఇతర భాషలకు మాత్రమే పరిమితమైన ఈ వెబ్ సిరీస్ లు ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో తెలుగు హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో ఇన్స్పెక్టర్ రిషి అనే ఒక వెబ్ సిరీస్ తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ గా ఈ వెబ్ సిరీస్ ని గత కొద్ది రోజుల నుంచి ప్రమోట్ చేస్తున్నారు. ముందు నుంచి పెద్దగా ఆసక్తి లేదు కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ వెబ్ సిరీస్ మీద పడింది. హారర్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు ఉండడంతో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ ఎదురుచూపులను తెరదించుతూ మార్చి 29వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధానంగా తమిళ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ని ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేశారు. సునయన, కన్నా రవి వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

ఇన్స్పెక్టర్ రిషి కథ:
తమిళనాడులోని తేన్కాడు అనే అటవీ ప్రాంతంలో ఫోటోలు తీయడానికి వెళ్లిన ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనూహ్య పరిస్థితుల్లో మరణించి కనిపిస్తాడు. అతని మరణం అనుమానాలకు తావివ్వడంతో అక్కడికి కొత్తగా పోలీస్ ఇన్స్పెక్టర్ రిషి(నవీన్ చంద్ర)ని పంపిస్తారు. అయితే ఈ విషయం అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న అయ్యనార్(కన్నా రవి)కి నచ్చదు. తనకు రావాల్సిన ప్రమోషన్ రాకపోవడానికి ఈ కొత్త ఇన్స్పెక్టర్ రిషి కారణమని భావిస్తూ తన తోటి సబ్ ఇన్స్పెక్టర్ చిత్ర(మాలిని)కి తన ఆవేదన అంతా చెప్పుకుంటూ ఉంటాడు. మరోపక్క అదే ఫారెస్ట్ లో ఫారెస్ట్ రేంజర్ గా సత్య(శ్రీకృష్ణ దయాళ్), గార్డులుగా ఖ్యాతి (సునయన), ఇర్ఫాన్ (ఎలాంగో కొమరవెల్) పనిచేస్తూ ఉంటారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హత్య కేసు తేల్చకముందే అదే పాటర్న్ లో మరికొన్ని హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు చేస్తోంది వనరచ్చి(వన రాక్షసి, వనదేవత) అని అక్కడి వాళ్ళందరూ భావిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే చాలామందికి భయంకరమైన రూపంలో వనరచ్చి కనిపిస్తూ ఉంటుంది. అయితే నిజంగానే ఈ హత్యలను ఆ వనదేవత చేసిందా? లేక వేరే ఎవరైనా చేస్తే ఆమె ఎలా కనిపిస్తుంది? ఇంతమంది టీం కలిసి అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కనిపెట్టారా లేదా? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే పది ఎపిసోడ్లు ఈ సిరీస్ మొత్తాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే.

విశ్లేషణ:
ఒకే రకమైన తీరులో వరుస హత్యలు జరగటం దానికి ఎవరైనా సీరియల్ కిల్లర్ కారణమేమోనని భావించి పోలీసులు ఆ సీరియల్ కిల్లర్ని ఛేదించడం లాంటి లైన్ తో ఎన్నో సినిమాలు మరెన్నో వెబ్ సిరీస్ లు వచ్చాయి. ఒకరకంగా ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ కూడా దాదాపు అదే లైన్ లో తెరకెక్కింది. సాధారణంగా వీటిని క్రైమ్ థ్రిల్లర్ అని పిలవచ్చు కానీ ఇన్స్పెక్టర్ ఋషి వెబ్ సిరీస్ విషయానికి వస్తే క్రైమ్ ఎలిమెంట్ కంటే ఎక్కువగా హారర్ ఎలిమెంట్స్ ఉండేలాగా దర్శకురాలు నందిని చూసుకున్నట్టు అనిపిస్తుంది. అయితే సిరీస్ మొదట్లోనే ఒక మాస్ సూసైడ్ చూపించిన దర్శకురాలు అక్కడి నుంచి ఈ హత్యలు జరగటం లాంటివి చూపిస్తూ చాలా పెద్ద పజిల్ ప్రేక్షకుల ముందు ఉంచుతారు. నిజానికి చివరి ఎపిసోడ్ వరకు నిజంగానే దెయ్యం ఉందేమో అని బ్రమ కల్పించడంలో సక్సెస్ అయ్యారు. అయితే నిజానికి సిరీస్లో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ట్విస్టులు ఉంటాయి కానీ నిడివి బాగా ఎక్కువైపోయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. నిడివి ఎక్కువ అవడంతో ఒకానొక సమయంలో బోర్ కలిగినా ఆశ్చర్యం లేదు. అయితే ముందు నుంచి లాజికల్ గా ఎక్కడో కనెక్షన్ అనిపించని విషయాలను కూడా లాస్ట్ ఎపిసోడ్లో రివీల్ చేసిన విధానం కన్విన్సింగ్ అనిపిస్తుంది. సిరీస్ లీడ్ అయిన రిషితో పాటు వారి టీమ్‍లోని ఇద్దరి వ్యక్తిగత జీవితం గురించి మధ్యమధ్యలో ప్రేక్షకులకు చూపించినా మరీ ఎక్కువ కాకుండా వాటిని కూడా ఆసక్తికరంగానే కట్ చేసిన విధానం బాగుంది. ఇక ఈ హత్య కేసులను రిషి, అండ్ టీమ్ దర్యాప్తు చేసే విధానాన్ని హడావుడిగా కాకుండా.. వివరంగా చూపించే ప్రయత్నం చేయడం మనకు సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. నమ్మకాలకు, లాజిక్‍లకు మధ్య ఉన్న లైన్ తోనే కేసులను సాల్వ్ చేయడానికి రిషి చేసే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటుంది. క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్‍గానే ఉంటూనే నెక్స్ట్ సీజన్ కి లీడ్ ఇచ్చేలా ఉంది. ట్రైలర్ లో భయపెట్టిన విధంగా హారర్ ఎలిమెంట్స్ మరీ భయపెట్టేలా అనిపించలేదు. అలాగే కొన్ని సీన్లు ముందుగానే ఊహించేలా ఉన్నా నెరేషన్ గ్రిప్పింగ్‍గా ఉండడంతో 10 ఎపిసోడ్లు ఉన్నా సస్పెన్స్‌ను ఫీలయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఇన్‍స్పెక్టర్ రిషిగా నవీన్ చంద్ర ఆ పాత్రలో ఒదిగిపోయాడు సీరియస్ గా కనిపిస్తూనే గతం వెంటాడే సమయంలో ఎమోషనల్‍ అయ్యే సీన్లలోనూ ఈ పాత్రలో నవీన్ చంద్రం తప్ప ఎవరిని ఊహించలేమేమో అనేంతలా నటించాడు. ఆయన టీమ్‍లో ఉండే కన్నా రవి, మాలినీ కూడా పోలీసు అధికారులుగా పర్ఫెక్ట్ అనిపించారు. సునైనా రోల్ ముందు నుంచి అండర్ డాగ్ అనిపిస్తూనే చివరిలో ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. శ్రీకృష్ణ దయాల్, కుమరవెల్ సహా మిగిలిన నటీనటులు అందరూ తమ పరిధి మేర నటించారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఇన్‍స్పెక్టర్ రిషి సిరీస్‍కు అశ్వత్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. ఫారెస్ట్ బ్యాక్‍డ్రాప్‍లో భార్గవ్ శ్రీధర్ కెమెరా వర్క్ అదిరిపోయింది, ముఖ్యంగా నైట్ సీన్లలో కలర్ గ్రేడింగ్ ఆసక్తికరంగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యుస్ రిచ్‍గా ఉండడం చూస్తే థియేటర్ కి కూడా ఈ సిరీస్ పనికి వచ్చేలాగా అనిపించింది.

ఫైనల్లీ థ్రిల్లర్ జానర్ సబ్జెక్టులు ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చుతుంది. ట్రైలర్ లో చూపించిన హారర్ ఎలిమెంట్స్ తక్కువగానే ఉన్న మొదలు పెడితే ఆపకుండా చూడాలనిపించే సిరీస్ ఇది.