Lily 2023 Telugu Movie Review: ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమా అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎప్పుడైతే అన్ని భాషల ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలను కూడా ఆదరిస్తున్నారో అప్పుటి నుంచే సినిమా అనేది ఇండియా వైడ్ గా ఫేమస్ అవుతోంది. ఇక ఇప్పటికే అనేక పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాగా పిల్లలతో చేసిన ఒక పాన్ ఇండియా మూవీ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సందర్భంగా మీడియా స్పెషల్ ప్రీమియర్స్ లో ప్రదర్శించారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం
లిల్లీ కథ విషయానికి వస్తే
లిల్లీ (బేబీ నేహా), దివ్య(బేబీ ప్రణతి రెడ్డి), గూగుల్ (మాస్టర్ వేదాంత వర్మ) స్కూల్లో ఒకే క్లాసులో కలిసి చదువుకుంటూ ఉంటారు. సాధారణంగా స్కూలుకు వెళ్లడం ఆడుకోవడం ఇంటికి రావడం ఆడుకోవడం ఇలా సాగిపోతున్న వీరి జీవితంలో ఒక పెద్ద కుదుపు వస్తుంది. అదేంటంటే ఒకరోజు ఆడుకుంటున్న సమయంలో దివ్య కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ఆమె మామయ్య దేవకు(రాజు వీర్ కి) సమాచారం ఇవ్వడంతో దివ్యను హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అయితే అలా దివ్యను హాస్పిటల్ కి తీసి వెళ్లి టెస్ట్ చేస్తే ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. అయితే ఆ బయటపడిన భయంకరమైన నిజం ఏంటి? దివ్య ఆరోగ్యానికి ఏమైంది? దివ్య ఆరోగ్యం కోసం లిల్లీ గూగుల్ కలిసి ఏం చేశారు? చిన్న చిన్న పనులు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ పాపను పెంచే దేవ ఈ గండాన్ని ఎలా గట్టెక్కించాడు అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ
ఈ సినిమాని దాదాపు 5 భాషల్లో తెరకెక్కించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. గోపురం స్టూడియోస్ బ్యానర్ మీద బాబు రెడ్డి, సతీష్ కుమార్లు ఈ సినిమాని నిర్మించగా ఈ సినిమాతో శివమ్ కొత్త దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇతర భాషల సంగతి పక్కన పెడితే తెలుగు విషయానికి వస్తే కడపను ఈ సినిమా బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పూర్తిగా చిన్న పిల్లలను, కథను వారి చుట్టే తిప్పుతూ వారితోనే మాక్సిమం సీన్లు చేయడం అనేది జరగలేదు. చిన్నపిల్లలతో పాన్ ఇండియా సినిమా చేయాలి అనే ఒక ఆలోచనతోనే ఈ సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. అయితే సినిమా మొత్తాన్ని ఒక ఎమోషనల్ పాయింట్ చుట్టూ తిప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. సినిమా చూస్తున్నంత సేపు ఆ పాపకి ఏం కాకూడదు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అనడంలో అతిశయోక్తి కాదు, అలా ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యే ప్రయత్నం చేయించడం అభినందించాల్సిన విషయం. అలాగే ఈ మోడరన్ యుగంలో కూడా స్నేహం విలువ ఎలా ఉంటుందో అందరికీ చాటి చెప్పే ప్రయత్నం చేశాడు.
ఎవరెలా చేసారంటే?
నటీనటుల విషయానికి వస్తే చిన్నపిల్లలే ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించిన ఈ సినిమాలో చిన్న పిల్లలందరూ కొత్తవారే. ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడించినప్పటికీ సినిమా నిడివి కాస్త ఇబ్బందికరమనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ స్లో నేరేషన్ అనేది సినిమాకి ఇబ్బందికర అంశం అని చెప్పక తప్పదు. పిల్లలందరూ తమ తమ పరిధిలో బాగా నటించారు. అయితే వారి డబ్బింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. లిల్లీ మూవీ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి బాగా అసెట్ అయింది, అలాగే పాటలు సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే పిల్లలతోనే సినిమా చేసి పిల్లల చుట్టూనే కథ చెప్పడంతో పెద్దవాళ్ళకి కరెక్ట్ కాకపోవచ్చు కానీ చిన్నపిల్లలకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్
చిన్నపిల్లల ఎమోషన్
ఫోటోగ్రఫీ
సాంగ్స్
మైనస్లు పాయింట్స్
స్లో నెరేషన్
అందరూ కొత్త నటీ నటులు కావడం
బాటమ్ లైన్
లిల్లీ : పిల్లలకు మాత్రమే