కన్నడ సినీ పరిశ్రమలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన హోంబాలే ఫిల్మ్ సంస్థ నుంచి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కొద్ది రోజుల క్రితం ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆ తర్వాత మహావతార్ నరసింహ అనే సినిమా రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడంతో ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ట్రైలర్ కట్ కూడా అద్భుతంగా ఉండడంతో సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
కశ్యప మహాముని భార్య అసంధర్భ కామవాంఛ కారణంగా ఆమెకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మిస్తారు. వారిద్దరూ విష్ణు వ్యతిరేకులుగా, విష్ణువుని పూజించే వారిని హింసించడమే లక్ష్యంగా చాలా రేగిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు భూమాతను సముద్ర గర్భంలో బంధించడంతో దేవతలంతా కలిసి విష్ణువుని ప్రార్థిస్తారు. ఆయన వరాహ రూపం ధరించి భూమాతను కాపాడి, హిరణ్యాక్షుడిని అంతమొందిస్తాడు. ఆ తర్వాత హిరణ్యాక్షుడి మరణంతో హిరణ్యకశిపుడు బ్రహ్మను ప్రార్థించి, తనను ఇంట గానీ బయట గానీ, మనిషి గానీ, వస్తువు గానీ, దేవతలు గానీ, పశువు గానీ, పగలు గానీ చంపకూడదని వరం తీసుకుంటాడు. ఆ తర్వాత తనకు జన్మించిన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా మారడంతో తట్టుకోలేక, ఐదేళ్ల పిల్లవాడిని చంపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఆ ప్రయత్నాలు ఏమయ్యాయి? ప్రహ్లాదుడు మరణించాడా? చివరికి హిరణ్యకశిపుడిని నరసింహ అవతారంలో వచ్చిన విష్ణు ఏం చేశాడు? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ :
నిజానికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడి గురించి మన వేదాలలో ప్రస్తావన ఉంది. వారిద్దరూ జయ విజయులు, మహావిష్ణు ఆంతరంగిక సమయంలో సనకసనందాది మహామునులను లోపలికి వెళ్ళకుండా అడ్డగిస్తారు. దీంతో వారికి కోపం వచ్చి, వారికి శాపం విధిస్తారు. ఆ శాపం ప్రకారం వారు మూడు జన్మలు విష్ణు ద్వేషులుగా జన్మించి, తిరిగి విష్ణు నివాసానికి వెళ్ళేలా శాపాన్ని మార్చుకోగలుగుతారు. అక్కడిదాకా మన వేదాలలో ఉంది. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా నేరుగా కశ్యప మహాముని భార్య కడుపున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మించినప్పటి నుంచి ఈ సినిమా కథ మొదలవుతుంది. మొదలైనప్పటి నుంచి ఎక్కడా డివియేషన్స్ లేకుండా వారిద్దరి క్రూరత్వాన్ని చూపించారు. ఆ తర్వాత భూమాతను హిరణ్యాక్షుడు సముద్ర గర్భంలో దాచడం, ఆమెను కాపాడేందుకు వరాహ అవతారంలో మహా విష్ణువు రావడం వంటివి సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా వరాహ అవతారాన్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు రెండు కళ్ళూ చాలవు, అంటే అతిశయోక్తి కాదు. ఒకరకంగా అది గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పాలి. ఇక ఆ తర్వాత హిరణ్యాక్షుడి మరణం, హిరణ్యకశిపుడి బ్రహ్మ కోసం తపస్సు చేయడం వంటి అంశాలను ఆసక్తికరంగా మలిచారు. ఇక ఆ తర్వాత భక్త ప్రహ్లాదుడి కథను మొదలుపెట్టి అత్యద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా భక్త ప్రహ్లాదుడి రూపం అయితే అద్భుతంగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత ప్రహ్లాదుడి గురుకుల వాసం వంటి విషయాలను కళ్ళకు కట్టినట్లు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఎప్పుడైతే సినిమాలో హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుడిని చంపమని ఆదేశిస్తాడు, అప్పటి నుంచి సినిమా మరింత ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగింది. ఇక ఫైనల్‌గా హిరణ్యకశిపుడిని అంతమొందించేందుకు శ్రీ విష్ణు లక్ష్మీ నరసింహ అవతారంగా ప్రేక్షకుల ముందుకు రావడం అయితే అత్యద్భుతంగా చూపించారు. నిజానికి ఇది యానిమేటెడ్ సినిమా అయినా సరే, ప్రేక్షకులు నరసింహుడు చేస్తున్న ఫైట్, ఆయన రూపాన్ని చూసి ఈలలు వేస్తూ గోల చేశారంటే, దర్శకుడు ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయినట్లే చెప్పాలి. నిజానికి ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుని సినిమాలు చేస్తున్నా సరే, ప్రేక్షకులను ఒక పట్టాన ఆకట్టుకోలేకపోతున్నాయి. కానీ యానిమేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఆద్యంతం సాగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ సినిమాకి టెక్నికల్ టీమ్‌లో ప్రధానమైన హీరో ఎవరంటే సామ్ సీఎస్. మామూలుగానే ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కొడతాడనే పేరు ఉంది. ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దుమ్ము దులిపేశాడు. అంతేకాక, యానిమేషన్ క్రియేటర్స్ కూడా మంచి ఔట్‌పుట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ సినిమాని నిర్మించినట్లు క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. కాకపోతే సంభాషణలను మరింత సరళంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలు వాటికి బాగా కనెక్ట్ అయ్యేవారు. అయితే మెయిన్ చూసిన థియేటర్లలో ఉన్న పిల్లలు కూడా ఆ సంభాషణలకు, స్క్రీన్ ప్రెజెంట్‌కి, విజువల్స్‌కి అబ్బురపడుతూ చప్పట్లు కొడుతూ ఉండడం గమనార్హం. ఇలాంటి కథను చెప్పాలనుకున్న దర్శకుడు అశోక్, ప్రోత్సహించిన నిర్మాతలను అభినందించాలి .
ఫైనల్లీ : ఈ మహావతార నరసింహ మస్ట్ వాచ్ ఫర్ విజువల్ గ్రాండియర్.