NTV Telugu Site icon

రివ్యూ : ఫాస్ట్ ఎక్స్ (ఇంగ్లిష్)

Fast X

Fast X

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజ్ ఇప్పటికి తొమ్మిది సార్లు ప్రేక్షకులను అలరించింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’లో పదో భాగంగా ఇప్పుడు ‘ఫాస్ట్ ఎక్స్’ తెరకెక్కింది. ఈ చిత్రాల్లో కార్ ఛేజింగ్స్ తోనే కథను నడిపే తీరు ఆకట్టుకుంటూ వచ్చింది. ప్రతి చిత్రంలోనూ డోమినిక్ టొరెట్టో పాత్రలో విన్ డైసెల్ అలరిస్తూనే ఉన్నారు. ‘ఫాస్ట్ ఎక్స్’లోనూ విన్ తనదైన బాణీ పలికించారు.

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ లో ఎప్పుడూ కథ కంటే కథనం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ పదో భాగం అందుకు మినహాయింపేమీ కాదు. అంతకు ముందు క్రిమినల్ గా జీవనం సాగించిన డోమినిక్ టొరెట్టో కొత్త జీవితం సాగించాలని ఆశిస్తాడు. తన కొడుకును పెంచుతూ ఉంటాడు. ఈ లోగా గతంలో డోమినిక్ ఎదుర్కొన్న కొంతమంది దుర్మార్గుల కొడుకుల్లో ఒకడైన డాంటే వస్తాడు. అతని ధ్యేయం డోమినిక్ ను అంతం చేయాలన్నదే. ఏ తప్పుడు పని చేసినా డాంటే నవ్వుతూ చేయడం అతని అలవాటు. కేథలిక్ క్రైస్తవులు అతి పవిత్రంగా భావించే వాటికన్ సిటీని నేలమట్టం చేస్తానని అంటాడు డాంటే. కంటికి కన్ను- పంటికి పన్ను అనే అనాగరిక సిద్ధాంతాన్ని నమ్మిన డాంటే డోమినిక్ ను చంపేయాలనుకుంటాడు. ఆ తరువాత ఏమయింది? డాంటే ప్రయత్నాలను డోమినిక్ ఎలా అడ్డుకొన్నాడు? అన్నదే మిగిలిన కథ. బ్రెజిల్ లో మొదలయ్యే ఈ కథ, లండన్ మీదుగా పోర్చుగల్ దాకా సాగుతుంది. అంతటా ఛేజింగ్స్… ఛేజింగ్స్…!!

నిజం చెప్పాలంటే, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ లో ఎప్పుడూ కథను వెదుక్కోరాదు. ఇందులోనూ అలాగే ఉంది. ‘ఫాస్ట్ ఎక్స్’లో మరిన్ని ఛేజింగ్ విన్యాసాలు కనిపిస్తాయి. అయితే అవన్నీ గ్రాఫిక్స్ నైపుణ్యం అని తెలిసిన వారికి అంతగా థ్రిల్ ఏమీ కలుగదు. గత ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ లో నటించిన హేమాహేమీలందరూ ఇందులోనూ తారస పడతారు. విన్ డీసైల్ నటనలో కొత్తదనం వెదుక్కోనవసరం లేదు. అయితే విలన్ గా నటించిన జాసన్ మొమోవా పాత్ర జనాన్ని ఆకట్టుకుంటుంది. సినిమాకు స్టంట్ కొరియోగ్రఫీ ప్రాణమని చెప్పక తప్పదు. దర్శకుడు లూయిస్ లెటరీర్ ఆద్యంతం యాక్షన్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. 140 నిమిషాల సినిమాలో అధిక భాగం యాక్షన్ ఎపిసోడ్స్ చోటు చేసుకోవడం కూడా కాసింత సహనాన్ని పరీక్షిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
– ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ కావడం
– ఆకట్టుకొనే యాక్షన్ ఎపిసోడ్స్
– జాసన్ మొమోవా నటన

మైనస్ పాయింట్స్:
– కథలో పట్టు లేకపోవడం
– సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
– అలరించని సంగీతం

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: అదే ‘ఫాస్ట్’!