పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకుల ముందు వచ్చేసింది. నిజానికి ప్రకటించిన నాటి నుంచి అనేకసార్లు వాయిదా పడ్డ సినిమాగా ఈ సినిమా రికార్డులకు ఎక్కింది. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా మొదలైన ఈ సినిమా రెండు కరోనా వేవ్స్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. చివరికి క్రిష్ సినిమా నుంచి తప్పుకోగా, ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా సినిమాని పూర్తి చేశారు. ఈ సినిమాకి మొన్నటి వరకు పెద్దగా బజ్ లేదు, కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సినిమాని ప్రమోట్ చేశాడో, ఒక్కసారిగా అందరి దృష్టి సినిమా మీద పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
హరిహర వీరమల్లు కథ: హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్) ఓ మంచి దొంగ. “పెద్దవాళ్లను కొట్టు, పేదవాళ్లకు పెట్టు” అనే ఉద్దేశంతో పెత్తందారులు, భూస్వాములు, రాజుల వద్ద దొంగతనం చేసి వాటిని పేదలకు పంచి పెడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి విదేశాలకు తరలి వెళ్తున్న సంపదను బందరు పోర్టులో దొంగిలిస్తాడు. ఈ విషయం తెలిసిన కొల్లూరు సంస్థానీసుడు వీరమల్లును పిలిపించి, తాను తానీషాకి కప్పం కట్టే సంపదను దొంగిలించాల్సిందిగా కోరుతాడు. ఆ సమయంలోనే అంతపురంలో ఉన్న పంచమి (నిధి అగర్వాల్)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. తర్వాత తానీషా దగ్గరకు వెళ్తున్న సంపదను దొంగిలిస్తూ పట్టుబడగా, అక్కన్న, మాదన్నలు, ఔరంగజేబ్ (బాబీ డియోల్) వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకొస్తే ఒక వజ్రాల గని ఇస్తామని చెప్పడంతో వీరమల్లు అందుకు సిద్ధమై ఢిల్లీ బయలుదేరుతాడు. అయితే, అతని ప్రయాణం ఎలా సాగింది? ఎవరెవరు వీరమల్లు వెంట వెళ్లారు? హిందువులను కనీసం మనుషులుగా కూడా చూడని ఔరంగజేబ్ ఇలాకాలో వీరమల్లు ఏం చేశాడు? చివరికి కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చాడా లేదా? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:నిజానికి సినిమా ఓపెనింగ్‌లో పవన్ కళ్యాణ్ తల్లిదండ్రుల నుంచి వరద కారణంగా దూరమై సత్యరాజ్ కుటుంబానికి దొరుకుతాడు. బ్రాహ్మణోత్తముడైన సత్యరాజ్ ఆ బుడతడు అందరికీ ఉపయోగపడేవాడు అవుతాడని, కష్టాలు తీర్చేవాడు అవుతాడని చెప్పి చిన్నప్పటి నుంచే అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. ఇక అక్కడ కట్ చేస్తే, బందరు పోర్టులో దొంగతనంతో పవన్ ఎంట్రీ అదిరిపోయేలా రాసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా కృష్ణా నది తీరం నుంచి ఢిల్లీ గద్దె మీదకు వెళ్లిన కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చేందుకు, అదే కృష్ణా నది తీరం నుంచి హరిహర వీరమల్లు చేసే ప్రయాణమే ఈ మొదటి భాగం సినిమా. అందులో భాగంగా ఒకపక్క పవన్ కళ్యాణ్ పాత్ర ఎస్టాబ్లిష్మెంట్ చూపిస్తూనే, మరోపక్క ఆ రోజుల్లో హిందువుల మీద మొగల్ రాజుల దురాగతాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ఒకపక్క పవన్ కళ్యాణ్ అభిమానులను, మరోపక్క ఆయనను అభిమానించే హిందుత్వవాదులను సంతృప్తి చేసేలా చాలా సీన్స్ రాసుకున్నారు. అలాగే డైలాగ్స్ కూడా జనసైనికులను ఆనందింపజేసేలా రాశారు. అయితే, కొన్నిచోట్ల సీన్స్ పవన్ అభిమానులు పండగ చేసుకునేలా ఉంటే, పేలవమైన విఎఫ్ఎక్స్ మాత్రం ఇబ్బంది పెడుతుంది. నిజానికి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథ మొదలైనా కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి ఇది కథగా రాసుకున్నప్పుడు ఒక అద్భుతమైన కథ, కానీ దాన్ని తెర మీదకు తీసుకొచ్చే విషయంలో మాత్రం దర్శకుడిలో అనుభవ లేమి కనిపిస్తుంది. ఈ సినిమాని పూర్తిగా క్రిష్ దర్శకత్వంలోనే పూర్తి చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమో అనిపిస్తుంది. అయితే, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం కాలర్ ఎగరేసుకునేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ విషయంలో, అలాగే ఎమోషనల్ టచ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరే లెవెల్‌లో ఉండేది. అయితే, చివరిలో ఎవరూ ఊహించని విధంగా సెకండ్ పార్ట్‌కి లీడ్ ఇవ్వడం గమనార్హం.
నటీనటుల విషయానికి వస్తే: ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. సినిమా ఎప్పుడో 2020లో ప్రారంభమై, మొన్నటి వరకు షూటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ లుక్స్‌లో చాలా వేరియేషన్స్ కనిపించాయి, కానీ ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? వీరమల్లు చెబితే వినాలి అని ఆయన చెప్పినట్టు, ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్నంత సేపు అదో రకమైన మ్యాజిక్ అంతే. పంచమి పాత్ర కావాలని ఇరికించినట్లు ఉంది. ఆమెకు మేకప్ కూడా సెట్ కాలేదు. బహుశా చాలా లాంగ్ రన్‌లో షూట్ చేయడం వల్ల కంటిన్యూటీ దెబ్బతిని ఉండవచ్చు. ఇక ఔరంగజేబ్ అనే క్రూరుడి పాత్రలో బాబీ డియోల్ ఒదిగిపోయాడు. సత్యరాజ్, ఈశ్వరి రావు, రఘు బాబు, కబీర్ సింగ్, సునీల్, సుబ్బరాజు, సచిన్ ఖేడ్కర్ వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కోట శ్రీనివాసరావు ఒక సీన్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే: ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ హీరో, అలాగే ఆయన వన్ మ్యాన్ షో చేస్తే, దానికి పూర్తిస్థాయిలో సహకరించింది కీరవాణి. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకురావడమే కాదు, కొన్నిచోట్ల నిలబెట్టేసిందని చెప్పచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, అయితే ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు పనిచేసిన విషయం అర్థమయ్యేలా ఉంది. తోట తరణి ఆర్ట్ వర్క్ సినిమాకు అదనపు ఆకర్షణ. పవన్ కళ్యాణ్ చేసిన ఫైట్ సీక్వెన్స్‌లు అన్నీ వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ సీన్‌తో పాటు పోర్ట్ ఫైట్, కుస్తీ ఫైట్, సహా ఠాణా ఫైట్ ఆకట్టుకునేలా ఉన్నాయి. డైలాగ్స్ సెట్ అయ్యాయి, కొన్ని గుచ్చుకునేలా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా: ‘హరిహర వీరమల్లు’ ఫ్యాన్స్‌కి ఫీస్ట్..కానీ?