తెలుగు సంగీత ప్రపంచంలో ఆయనొక ధ్రువతార. తరాలు మారినా, కాలాలు గడిచినా తన అమృత గానంతో తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన జీవిత విశేషాలను వెండితెరపై ఆవిష్కరిస్తూ తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్’. సి.హెచ్. రామారావు దర్శకత్వంలో సి.హెచ్. ఫణి నిర్మించిన ఈ సినిమా జనవరి 2న విడుదలైంది. ఈ అమర గాయకుడి జీవిత ప్రయాణం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ
ఘంటసాల(కృష్ణ చైతన్య) అంటే మనకు ఆయన పాడిన వేల పాటలే గుర్తుకు వస్తాయి. కానీ ఆ గానం వెనుక ఉన్న కష్టం, ఆ వ్యక్తిత్వం వెనుక ఉన్న గొప్పతనం చాలా మందికి తెలియదు. ఈ సినిమా ప్రధానంగా ఆయన వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను, సంగీత సాధన కోసం ఆయన పడ్డ తపనను చూపిస్తుంది. చిన్నతనంలో పేదరికం వల్ల జోలె పట్టుకుని అడుక్కున్న రోజులు, ఆకలితో అలమటించిన రాత్రులు, సంగీతం నేర్చుకోవడానికి ఆయన చేసిన పోరాటం వంటి ఎన్నో హృదయ విదారక ఘట్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు.
విశ్లేషణ:
సినిమా ఫస్టాఫ్ మొత్తం ఘంటసాల సినిమాల్లో అవకాశాల కోసం పడ్డ పాట్లు, ఆయన ఎదుర్కొన్న అవమానాల చుట్టూ తిరుగుతుంది. సెకండాఫ్ లో ఒక గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సాధించిన ప్రగతిని అద్భుతంగా చూపించారు. లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ వంటి దిగ్గజాలు ఆయన ప్రతిభను కొనియాడటం, బడే గులాం అలీ ఖాన్‌తో ఆయనకు ఉన్న అనుబంధం వంటి సన్నివేశాలు సంగీత ప్రియులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన గొంతు మూగబోవడం, చివరి కోరిక తీరకుండానే స్వర్గస్తులవ్వడం వంటి సీన్లు కంటతడి పెట్టిస్తాయి.
నటీనటుల ప్రదర్శన విషయానికి వస్తే ఘంటసాల పాత్రలో గాయకుడు కృష్ణ చైతన్య పరకాయ ప్రవేశం చేశారు. స్వతహాగా సింగర్ కావడంతో ఆ పాత్రలోని హావభావాలను పండించడం ఆయనకు సులభమైంది. బాల్యంలోని ఘంటసాల పాత్రలో మాస్టర్ అతులిత్ చక్కగా నటించారు. ఘంటసాల సతీమణి పార్వతమ్మగా మృదుల, బడే గులాం అలీ ఖాన్‌గా సుమన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జె.కె భారవి, సుబ్బరాయ శర్మ తమ పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధాన బలం ఘంటసాల అసలు పాటలనే వాడటం. ఇది ప్రేక్షకులకు ఒక గొప్ప ఫీలింగ్‌ను ఇస్తుంది. కమర్షియల్ హంగులకు పోకుండా ఒక మహనీయుడి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించడంలో దర్శకుడు రామారావు సక్సెస్ అయ్యారు. అయితే బడ్జెట్ పరిమితుల వల్ల గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ఆశించిన స్థాయిలో లేవు. ప్రమోషన్స్ సరిగా లేకపోవడం, స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం సినిమాకు మైనస్ పాయింట్స్.
ఫైనల్లీ : ‘ఘంటసాల ది గ్రేట్’ కేవలం సినిమా మాత్రమే కాదు, తెలుగు వారు తెలుసుకోవాల్సిన ఒక చరిత్ర.