దుల్కర్ సల్మాన్ మలయాళ హీరో అయినా సరే తెలుగువారికి బాగా దగ్గరయిపోయాడు. ఇప్పటికే మహానటి, సీతారామం లాంటి సినిమాలు చేసిన ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఉన్నాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీతో పాటు ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సమర్పించిన ఈ సినిమా మీద ముందు నుంచి సినిమా యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. అందుకే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది యూనిట్. మరి ఈ సినిమా ఎలా ఉంది? యూనిట్ నమ్మకాన్ని సినిమా ఎంతవరకు నిలబెట్టుకుంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
లక్కీ భాస్కర్ కథ:
కథ అంతా 80ల కాలంలో జరుగుతూ ఉంటుంది. ఒక మధ్య తరగతి బ్యాంకు ఉద్యోగి భాస్కర్(దుల్కర్) తనకు వచ్చే జీతంతో కుటుంబం మొత్తాన్ని నడిపించడానికి అనేక కష్టాలు పడుతూ ఉంటాడు. తన భార్య సుమతి(మీనాక్షి చౌదరి), కొడుకు కార్తీక్(రిత్విక్)లనే కాకుండా ఒక తండ్రి, ఒక చెల్లి, ఒక తమ్ముడి బాధ్యతలు కూడా అతని మీదనే ఉంటాయి. నెల జీతం చాలక పోవడంతో కనిపించిన వారి దగ్గర అప్పులు చేస్తూ అందరి వద్ద మాటలు పడుతూ ఉంటాడు. బ్యాంకులో తనకు ప్రమోషన్ వస్తుందని భావించిన సమయంలో అది లంచం ఇచ్చి వేరొకరు తీసుకున్నారని తెలిసిన తర్వాత ఎంత కష్టపడి పని చేసినా ఇక జీవితంలో ఎదుగు బొదుగూ ఉండదని ఫిక్స్ అవుతాడు. అలాంటి సమయంలో అప్పు కోసం వచ్చిన ఆంటోనీ(రాంకీ)తో చేతులు కదిపి బ్యాంకులో నుంచి ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇస్తాడు. గంటల వ్యవధిలో తిరిగివ్వాలనే ఒప్పందంతో బిజినెస్ లో వచ్చిన లాభాల్లో 20 శాతం అడుగుతాడు. అలా అంటోనీతో కలిసి అనేక డీల్స్ చేసి లక్షల సంపాదిస్తాడు భాస్కర్. అయితే ఆంటోనీ ఇక నేను ఇండియా వదిలి వెళ్లిపోతానని చెప్పి వెళ్లిపోయిన తర్వాత భాస్కర్ డబ్బు సంపాదించేందుకు కొత్తదారి వెతుకుతాడు. ఆ దారి రిస్క్ అని తెలిసినా కూడా తన కుటుంబ అవసరాల కోసం కోట్ల కొలది డబ్బు అక్రమ మార్గంలో సంపాదిస్తాడు. అయితే తనకు తెలిసిన ఒక బ్యాంకు ఉద్యోగి హఠాన్మరణంతో భాస్కర్ లో ఆలోచన మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో భార్య కూడా భాస్కర్ తో గొడవ పడుతుంది. ఈ క్రమంలో సిఏ అయిన తండ్రి ఇచ్చిన సలహా మేరకు భాస్కర్ ఏం చేశాడు? 100 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు తేల్చిన సీబీఐ భాస్కర్ ను ఏం చేసింది? చివరికి భాస్కర్ ఆ వంద కోట్లు బ్యాంకుకు తిరిగి కట్టాడా? ఇందులో బ్యాంక్ ఛైర్మన్ (టిను ఆనంద్), మేనేజర్(సచిన్ ఖేడ్కర్) పాత్రలు ఏమిటి? భాస్కర్ ఈ కేసులో నుంచి ఎస్కేప్ అయ్యాడా? చివరికి ఏం జరిగింది? అసలు సాధారణ భాస్కర్ లక్కీ భాస్కర్ ఎలా అయ్యాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు ముందు డబ్బు కోసం అష్ట కష్టాలు పడి, తర్వాత డబ్బు సంపాదించే మార్గం తెలిసి ఒక రేంజ్కి ఎదగడం లాంటి సినిమాలు మనం ఎన్నో చూసాం. దాదాపుగా ఇది కూడా అదే లైన్ లో సాగుతుంది. కొత్తగా చెప్పుకోవాలంటే ఏమీ లేదు, కానీ సినిమాని మొదటి సీన్ నుంచి చివరి క్లైమాక్స్ శుభం కార్డు వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ వారిని నవ్విస్తూ, ఆలోచింపచేస్తూ సాగిందని మాత్రం చెప్పొచ్చు. ఒక సాదాసీదా బ్యాంకు ఉద్యోగస్తుడు తన కళ్ళముందే డబ్బు కోట్ల కొలదీ ఉన్నా దాన్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక దారి దొరుకుతుంది. తన పరిధి మేరకు బ్యాంకు నుంచి డబ్బు బయటకు తెచ్చి దాని ద్వారా ఇల్లీగల్ వ్యవహారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఆ డబ్బు మళ్ళీ తీసుకెళ్లి బ్యాంకులో పెడుతూ ఎలా ఒక స్థాయికి ఎదిగాడు అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హర్షద్ మెహతా గురించి తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన స్టాక్ మార్కెట్ స్కామ్స్ ఎలా చేశారు అనే దాని మీద ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లు వచ్చాయి. ఈ హర్షద్ మెహతా గురించి మాత్రమే వాటిలో ప్రస్తావించారు. కానీ ఈ హర్షద్ మెహతా వల్ల ఒక సాధారణ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. నిజానికి నాణానికి మరోవైపు చూడడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి భాస్కర్ పాత్రను ప్రతి మధ్యతరగతి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కచ్చితంగా మధ్యతరగతి మాత్రమే కాదు దిగువ మధ్య తరగతి వ్యక్తులు కూడా తాము ఏదో ఒకరోజు మంచి స్థాయికి వెళతామని కలలు కంటూ ఉంటారు. ఆ కలలు కనడమే కాదు ఆ స్థాయికి వెళ్ళిన భాస్కర్ లో తమను తాము చూసుకుని ఆనందపడని ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు సినిమా పూర్తయి బయటకు వచ్చిన తర్వాత మనకి కూడా ఇలా ఈజీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటే ఎంత బాగుండో కదా అనిపించేలా దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ దానికోసం ఆయన చేసిన రీసెర్చ్ ప్రతి సీన్ లో కనిపించింది. తప్పులు వెతకాలని ప్రయత్నించినా అవి లేకుండా రాసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. బహుశా పలు మార్లు ఇదే విషయాన్ని నాగ వంశీ ప్రస్తావించి ఉంటాడు. ఈ సినిమాలో తప్పులు వెతికిన వారికి పార్టీ ఇస్తానని అందుకే అని ఉండవచ్చు. చిన్న చిన్న సీన్స్ లో కూడా డీటైలింగ్ మిస్ అవ్వకుండా దర్శకుడు స్పెషల్ కేర్ తీసుకున్నట్లయితే కనిపించింది. అయితే చిన్న చిన్న లాజిక్స్ ఒక్కోసారి మిస్సయినట్లు అనిపించినా స్క్రీన్ ప్లే తో తనదైన మ్యాజిక్ చేశాడు. సినిమా మొదలు చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమా ప్రారంభమైనప్పుడే భాస్కర్ కష్టాలు చూపిస్తూ ఇంటర్వెల్ సమయానికి భాస్కర్ ను డబ్బులో ముంచేత్తుతాడు. ఆ తర్వాత భాస్కర్ ఆ డబ్బు మత్తు ఎలా వదిలించుకున్నాడు? చివరికి జేబులో చిల్లర లేని స్థాయి నుంచి 100 కోట్లు తిరిగి బ్యాంకు కట్టే స్థాయికి ఎలా ఎదిగాడు? అని చూపించే జర్నీ ఆకట్టుకుంటుంది. మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ అయితే విజిల్స్ వేయిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో భాస్కర్ అనే పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. అతను ఒక మలయాళ నటుడు అనే ఆలోచన కూడా రాకుండా తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడని చెప్పొచ్చు. ఇక ఆయన భార్య సుమతి పాత్రలో నటించిన మీనాక్షికి ఇది చాలా పరిమితమైన పాత్ర అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. రిత్విక్ మాత్రం కనిపించిన ప్రతి సీన్లో అదరగొట్టాడు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. ఇక భాస్కర్ స్నేహితుడి పాత్రలో నటించిన రాజ్ కుమార్ కశిరెడ్డి నవ్విస్తూనే ఎమోషనల్ కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. ఇక సాయికుమార్, టిను ఆనంద్ వంటి వాళ్లు తమ అనుభవాన్ని స్క్రీన్ మీద చూపించారు. మిగతా పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన సాంగ్స్ ఇప్పటికే కొన్ని హిట్స్ అయ్యాయి. వాటి సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. స్పెషల్ ఎలివేషన్స్ ఇచ్చే సమయంలో మాత్రం ఆకట్టుకునేలా డిజైన్ చేసుకున్నాడు. ముఖ్యంగా వెంకీ అట్లూరి డబ్బు గురించి, మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి రాసుకున్న డైలాగులు భలే అనిపించాయి. 80ల నాటి సినిమా కావడంతో అప్పటి బాంబే నగరాన్ని మొత్తం సృష్టించిన తీరు నిజంగా అభినందనీయం. నిర్మాణ విలువలు ఇక్కడ బాగా కనిపించాయి. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ ని క్యారీ చేయడంలో సక్సెస్ అయింది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిజానికి సినిమా విషయంలో అద్భుతం అనలేం అలా అని వంకలు పెట్టడానికి కూడా ఏమీ లేదు. సినిమా చూస్తున్నంత సేపు కడుపుబ్బా నవ్విస్తూ, ఆలోచింప చేస్తూ సాగుతుంది. ఈమధ్య కాలంలో అసభ్యత జోలికి వెళ్లకుండా నవ్వించే సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది.
చివరిగా ఈ పండుగకు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ వాచ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విషయంలో లక్కీ భాస్కర్ ముందు ఉంటాడు.