మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు, హీరోగా నటించిన తాజా చిత్రం “డీయస్ ఈరే”. వినడానికి వింతగా అనిపిస్తున్న ఈ సినిమా, మలయాళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ కావడమే కాదు, దాదాపుగా 50 కోట్లు కలెక్ట్ చేసింది. భూతకాలం, భ్రమయుగం లాంటి హారర్ హిట్స్ డైరెక్ట్ చేసిన రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని, వైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో, స్రవంతి మూవీస్ (రవి కిషోర్) ఈ సినిమా విడుదల చేశారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి, ఒక రోజు ముందుగానే తెలుగులో ప్రీమియర్స్ కూడా వేశారు. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
డీయస్ ఈరే వీరే కథ
రోహన్ (ప్రణవ్ మోహన్లాల్) ఒక ఆర్కిటెక్ట్. తన తండ్రి పెద్ద వ్యాపారవేత్త. అమెరికాలో, కేరళలోనూ అనేక వ్యాపారాలు ఉంటాయి. రెండు ప్రాంతాల్లోనూ వ్యాపారాలు ఉండడంతో, అక్కడ ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉంటాడు. సరదాగా కేరళ వచ్చిన రోహన్, స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ, సరదా సరదాగా గడిపేస్తూ ఉంటాడు. అలా ఓ రోజు పార్టీలో ఉండగానే, తన క్లాస్మేట్ కని (సుస్మిత భట్) సూసైడ్ చేసుకుందని తెలుస్తుంది. గతంలో ఆమెతో శారీరకంగా కూడా ఒక్కటైన రోహన్, ఒకవేళ తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారాల వల్ల ఏమైనా సూసైడ్ చేసుకుందేమో అని అనుమానంతో, వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్ళని పరామర్శించి వస్తాడు. ఆ రోజు నుంచి, అతన్ని ఒక ఆత్మ ఫాలో అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆమె ఇంటికి వెళ్లి వచ్చినప్పటి నుంచే ఆ ఆత్మ తిరుగుతోంది, కాబట్టి అది ఆమె ఆత్మే అని భావించి, ఆమె పొరుగు ఇంట్లో ఉండే మధు పొట్టి (జిబిన్ గోపీనాథ్) సాయం కోరుతాడు. ఈ క్రమంలో వారికి తెలిసిన నిజాలు ఏమిటి? అసలు రోహన్ వెంటపడుతున్న ఆత్మ ఆమెదేనా లేక ఇంకేవరిదైనా? నా మధ్యలో అసలు ఫిలిప్ ఎవరు? చివరికి ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
హారర్‌ను పూర్తిస్థాయి హారర్‌గా చూపించే దర్శకులు చాలా అరుదు. అలాంటి వారిలో ఈ సినిమా దర్శకుడు కూడా ఒకరు. సినిమా మొదలయ్యాక, ఇది రొటీన్ దయ్యం స్టోరీ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ, సినిమాని తానదైన సౌండ్ డిజైన్తో ప్రేక్షకులకు కన్విన్స్ అయ్యేలా చెప్పిన విధానం మాత్రం హాట్సాఫ్ అనిపించేలా ఉంటుంది. రొటీన్ స్టోరీతోనే సినిమా తీశారు. హారర్ మూమెంట్స్ కూడా ఎక్కువగా లేవు. మహా ఏదో ఒక నాలుగు ఐదు చోట్ల భయపడుతారేమో. మరీ ముఖ్యంగా, ఇంటర్వెల్ వరకు అసలు కథలోకి వెళ్ళలేదు దర్శకుడు. ఒక అమ్మాయి ఆత్మ తనను వేధిస్తోందని భావిస్తూ, ఆ ఆత్మనుంచి పారిపోయే హీరోని తప్ప మరొక యాంగిల్‌ని ఫస్ట్ హాఫ్‌లో టచ్ చేయలేదు. ఇక సెకండ్ హాఫ్‌లోకి వచ్చాక, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు మాత్రం, సినిమా చూపు తిప్పుకోనివ్వకుండా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో, ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా రాసుకున్న తీరు కచ్చితంగా అభినందనీయం.
నటీనటులు
రోహన్ పాత్రలో ప్రణవ్ మోహన్లాల్ చాలా సెటిల్‌గా కనిపించాడు. క్యారెక్టర్‌లో ఇమిడిపోయి, తన లుక్స్, స్టైలింగ్, నటన, ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలతో ఆకట్టుకున్నాడు. ఇక హీరో పాత్ర తర్వాత, ముఖ్యంగా అందరూ మాట్లాడుకునే పాత్ర జయ కురూప్. ఆమె గురించి ఎక్కువ మాట్లాడితే స్పాయిలర్ అవుతుంది. కచ్చితంగా ఆమె నటన సినిమాలో చూడాల్సిందే. అరుణ్ అజయ్ కుమార్, జిబిన్ గోపీనాథ్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి ప్రధానమైన బలం సౌండ్ డిజైన్. నేపథ్య సంగీతంతో క్రిస్టో జేవియర్ ఇచ్చిన సంగీతం, ప్రేక్షకులను భయపెట్టేలా చేసింది. ఇక హారర్ సినిమాల్లో రెగ్యులర్‌గా ఫాలో అయ్యే జంప్ కట్స్, షార్ప్ ఎడిట్స్ వంటి టెక్నిక్స్‌తో ప్రేక్షకులను భయపెట్టారు. సినిమాటోగ్రఫీ కూడా సీన్స్‌కి తగ్గట్టుగా ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది టెక్నికల్‌గా టాప్ నాచ్ ఫిల్మ్.
ఫైనల్లీ హారర్ థ్రిల్లర్ లవర్స్, ఈ సినిమాని థియేటర్‌లోనే చూసి తీరాలి.