NTV Telugu Site icon

Raayan Review: ధనుష్ ‘రాయన్’ రివ్యూ!

Raayan Review

Raayan Review

Dhanush’s Raayan Movie Review: ధనుష్ హీరోగా ఆయనే స్వీయ దర్శకత్వంలో రాయన్ అనే సినిమా చేశాడు. ఈ మధ్యకాలంలో ఒకే రకమైన సినిమాలు చేస్తూ వస్తున్న ధనుష్ ఈ సినిమాని కూడా అదే రకమైన రా అండ్ రస్టిక్ వేలో చేసినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అనిపించింది. సినిమాకి ఆయన దర్శకత్వం వహించడం తెలుగు హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో ధనుష్ సోదరుడిగా నటించడంతో పాటు రెహమాన్ సంగీతం అందించడం అదే విధంగా సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడంతో ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు సినిమా టీజర్ ట్రైలర్ కట్స్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకులలో సినిమా మీద కొంత అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.

కథ :
చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైన రాయన్ (ధనుష్)కు ఇద్దరు తమ్ముళ్లు. అందులో ఒకరు ముత్తు వేల్ (సందీప్ కిషన్) కాగా మరొకరు మాణిక్యం (కాళిదాస్ జయరామ్). వీళ్లకు ఓ చెల్లి కూడా ఉంది, ఆమె పేరు దుర్గ (దుషారా విజయన్). ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే రాయన్ చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, తమ్ముళ్లకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. రాయన్ ఇలా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఒక సందర్భంలో ఆ ఏరియా డాన్ దురై (శరవణన్)ను చంపాల్సి వస్తుంది. ఆ తర్వాత రాయన్ మీద దురై ప్రత్యర్థి సేతు రామన్ (ఎస్.జె. సూర్య) కన్ను పడి తనతో పని చేయమని కోరగా రాయన్ నిరాకరిస్తాడు. అయితే అసలు దురైను రాయన్ ఎందుకు చంపాడు? ఈ క్రమంలో రాయన్, అతని తమ్ముళ్ల మధ్య విబేధాలు ఎందుకు వచ్చాయి? అన్నదమ్ముల గొడవ ఒక వైపు, సేతు రామన్ తో మరో వైపు గొడవలతో రాయన్ ఏం చేశాడు? ఏమైంది? ఈ కథలను పోలీసు అధికారి (ప్రకాష్ రాజ్) ఏ విధమైన మలుపులు తిప్పాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అన్ని లెక్కలు వేసుకుని ప్రేక్షకులను అలరిస్తూ డబ్బులు కొల్లగొట్టడమే లక్ష్యంగా చేసిన పక్కా కమర్షియల్ సినిమా. తెలుగు, తమిళ ప్రేక్షకులు చాలా సంవత్సరాల నుంచి ఈ తరహా కథలు చూస్తూనే ఉన్నారు. ముందు చిన్న పనులు చేసుకొంటూ అందరికీ భయపడుతూ ఉండి కుటుంబం జోలికి వస్తే ఎంతటి వాడిని అయినా సరే ఎదుర్కొనే హీరో, అవమానాలు భరించలేక అన్నకు ఎదురు తిరిగిన తమ్ముళ్లు అనే లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి. మీకు రజనీకాంత్ ‘బాషా’, చిరంజీవి ‘అన్నయ్య’, వెంకటేష్ ‘లక్ష్మీ’ సినిమాలు గుర్తు వస్తే అది మీ తప్పు కాదు. అయితే అన్ని లెక్కలు వేసుకుని చేసిన కమర్షియల్ సినిమా అనిపించినా ‘రాయన్’ను కాస్త భిన్నంగా చూపడంలో ధనుష్ దర్శకత్వం & ఏఆర్ రెహమాన్ సంగీతం కీలక పాత్ర పోషించాయి. రొటీన్ కమర్షియల్ సినిమా లానే ‘రాయన్’ మొదలైనప్పటికీ, కొత్త కథ లేకున్నా… ప్రేక్షకులను కాస్త సినిమాలో లీనం అయ్యేలా చేసే విషయంలో దర్శకుడిగా ధనుష్ సక్సెస్ అయ్యాడు. ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు కమర్షియల్ టేకింగ్ ఆకట్టుకునేలా ఉంది. కథ కొత్త కథ కాదు అదే విధంగా కథనం సాగుతున్న సమయంలో వచ్చే సీన్స్ సగటు ప్రేక్షకుడి ఈజీగా ఊహిస్తాడు. ఇంటర్వెల్ తరువాత కథ ఊహించేలా ఉన్నా ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు..

నటీనటుల విషయానికి వస్తే:

క్యారెక్టర్ పరంగా రాయన్ ధనుష్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. యాక్షన్ ధనుష్ చెల్లెలుగా నటించిన దుషారా విజయన్ నటన వేరే లెవెల్. సందీప్ కిషన్ నటనలో మరో మెట్టు ఎక్కేశాడు. కాళిదాస్ జయరామ్ కూడా బాగా నటించారు. ప్రకాష్ రాజ్ పాత్ర నిడివి తక్కువయినా తనదైన నటనతో ఆ పాత్రను వేరే లెవెల్ కి తీసుకు వెళ్ళాడు. ఎస్.జె. సూర్య, సెల్వ రాఘవన్ల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. వరలక్ష్మీ శరత్ కుమార్, అపర్ణ బాల మురళి, దివ్యా పిళ్ళైలు కూడా తమ పాత్రల పరిధి మేరకు చేశారు. టెక్నికల్ టీం కూడా నెక్స్ట్ లెవెల్ అంతే. కెమెరామెన్ పనితనం వలన విజువల్స్ ఎంతో సహజంగా కనిపిస్తాయి. రెహ్మాన్ ఇచ్చిన పాటలు అంతగా గుర్తుండవు కానీ రాయన్ పాత్రకు ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం చెవుల్లో మారుమోగి పోతుంది. సెట్ వర్క్ లా అనిపించలేదు అంతా నేచురల్‌గా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిడివి విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.

ఫైనల్లీ:
రాయన్ పక్కా కమర్షియల్ మూవీ.. కథ ఊహకు తగ్గట్టే ఉన్న థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చూసేయొచ్చు.

Show comments