ధనుష్ హీరోగా నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేర. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మందన నటించింది. జిమ్ సర్భ్, హరీష్ పెరడి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇక ట్రైలర్ కట్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద ఉన్న ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూ లో చూద్దాం, పదండి.
కుబేర కథ: నీరజ్ మిత్రా (జిమ్ సర్భ్) ఒక వ్యాపారవేత్త. ఒక ఆయిల్ రిగ్ ప్రభుత్వం నుంచి దక్కించుకోవడానికి లక్ష కోట్లు లంచం ఇవ్వాల్సి రావడంతో, ఆ లంచం ఇప్పించేందుకు తప్పుడు కేసులో జైల్లో ఉన్న సీబీఐ ఆఫీసర్ దీపక్ (నాగార్జున)ను బయటకు తీసుకొస్తాడు. ఆ లక్ష కోట్ల లంచాన్ని పంపిణీ చేసే ప్లాన్‌లో భాగంగా దీపక్ నలుగురు బిచ్చగాళ్లను తీసుకొచ్చి వారి పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి పంపిణీ మొదలు పెడతాడు. అందులో ఉన్న ముగ్గురు బిచ్చగాళ్లు పని పూర్తి చేసిన తర్వాత చంపబడినా, తీసుకొచ్చిన మరో బిచ్చగాడు దేవా (ధనుష్) మాత్రం అనుకోకుండా మిస్ అవుతాడు. ఈ క్రమంలో దేవాను దీపక్ అండ్ టీం పట్టుకున్నారా? చివరికి అతని పేరు మీద ఉన్న పదివేల కోట్ల లంచం ట్రాన్స్‌ఫర్ చేయగలిగారా? దేవా ఏమయ్యాడు? అయితే ఇందులో రష్మికా పాత్ర ఏమిటి? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా శేఖర్ కమ్మల అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద ఒక రేంజ్ అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే శేఖర్ కమ్ముల జనరల్గా సాఫ్ట్ లవ్ స్టోరీస్ లేదా సమాజానికి ఏదైనా మెసేజ్ ఇచ్చేలాంటి సినిమాలే చేస్తూ ఉంటాడు. అలాంటి ఆయన క్రైమ్ డ్రామా చేస్తున్నాడు అన్నప్పటినుంచి అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని అందరూ ఎదురు చూశారు. దానికి తోడు ధనుష్ బిచ్చగాడు, నాగార్జున సిబిఐ ఆఫీసర్ అంటూ బయటకు వచ్చిన తర్వాత అసలు ఏంటి కథ? ఏం చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల అనే అందరూ ఎదురు చూశారు. అయితే ఒకరకంగా ఇది శేఖర్ కమ్ముల మార్కుతో రాసుకున్న క్రైమ్ డ్రామా విత్ సోషల్ మెసేజ్ ఎలిమెంట్స్. నిజానికి కార్పొరేట్ వ్యవస్థ చేస్తున్న అవినీతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది కానీ ఏ విషయంలోనూ లోతుకు వెళ్లకుండా పైపైన డిస్కస్ చేస్తూనే సినిమా మొత్తం నడిపించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ధనుష్ పరిచయం, ధనుష్ నాగార్జునల ప్రయాణం తర్వాత అది ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే ఆసక్తికరంగా రాసుకున్నాడు. ధనుష్ ముంబై రావడం తర్వాత చావు నుంచి తప్పించుకుని పదివేల కోట్ల బినామీగా మారి తన వెంట పడుతున్న వారి నుంచి ఎలా తప్పించుకుంటూ ప్రాణాలు కాపాడుకున్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అయితే సినిమా లెంత్ కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఇంత నిడివి ఉన్న సినిమాలను అది కూడా బీభత్సమైన హింస ఉంటే తప్ప ఎంజాయ్ చేయడం లేదు. కానీ శేఖర్ కమ్ముల తనదైన మార్క్ తో సినిమాని నడిపించే ప్రయత్నం చేశాడు కొన్ని సీన్స్ అక్కడక్కడ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే సినిమాని లైటర్ వేలో నడిపించినా ఇంత నిడివి రావడం కాస్త ఇబ్బందికర అంశమే. బిచ్చగాళ్లను బినామీలుగా మార్చుకుని ఒక లక్ష కోట్ల ట్రాన్సాక్షన్ చేయడానికి సిద్ధమైన ఒక కార్పొరేట్ యజమాని చివరికి బిచ్చగాడు చేతిలో ఎలా హతమయ్యాడు ? అనేది సింపుల్ లైన్. దానికి బిచ్చగాళ్ళ కష్టాలు, కార్పొరేట్ బలుపు, మనీ హవాలా మాఫియా ఇలా రకరకాల లేయర్స్ తో కథ నడిపించాడు. అయితే శేఖర్ కమ్ములకు ఒకరకంగా ఇది కొత్త జానర్ గతంలో నయనతారతో ఒక సినిమా చేసినా ఇది మాత్రం ఒకరకంగా స్పెషల్ అనే చెప్పాలి. రెండు భాషలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లను పెట్టుకొని కథ నడిపించిన తీరు ఆసక్తికరం. సినిమాకి ప్రధానమైన మైనస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది నిడివి. ఆ విషయం మీద ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. అయితే ఆ విషయం మీద ఫోకస్ పెట్టి 15 నిమిషాల ఫుటేజ్ కట్ చేసిన తర్వాత కూడా ఇంత నిడివి రావడం కాస్త ఇబ్బందికర అంశమే. అయితే సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. క్లైమాక్స్ హడావిడిగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ అప్పటికే చాలా సినిమా చూసిన ప్రేక్షకుడు ఇంకేదో ఉంటుందనుకుంటే సింపుల్గా ముగించారు.
నటినటుల విషయానికి వస్తే బిచ్చగాడు పాత్రలో ధనుష్ నటించ లేదు, జీవించాడు. జాతీయ అవార్డు అందుకున్న నటుడు గురించి ఇంతకన్నా ఏం చెప్పగలము?. అతని ఎంట్రీ సీన్ కానీ మధ్యలో బిచ్చగాడిగా నటించే కొన్ని సీన్స్ కానీ మరోసారి జాతీయ అవార్డు అందించాలా అన్నట్లుగా సాగాయి. ఒక బిచ్చగాడిగా అసలు ఏమీ తెలియని ఒక వ్యక్తిగా అతను కనబరిచిన నటన అసమానం. ఇక సిబిఐ ఆఫీసర్ దీపక్ గా నాగార్జున నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. వ్యవస్థలను నమ్మి జైలుకు వెళ్లిన నాగార్జున ఒక వ్యక్తిని నమ్మి బయటకు వచ్చిన తీరు, ఆ తర్వాత అతని కోసం పని చేసిన వ్యవహారం అన్ని సినిమాకి ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో నాగార్జున కళ్ళతో నటించిన తీరు అత్యద్భుతం. గతంలో ఎప్పుడూ నాగార్జునని ఇంత డీ గ్లామర్ రోల్ లో మీరు చూసి ఉండరు. ధనుష్ నాగార్జున పోటాపోటీగా సీన్స్ లో నటించారు అనడంలో సందేహం లేదు. చాలాకాలం తర్వాత రష్మికకి అంగాంగ ప్రదర్శన జోలికి వెళ్లకుండా మంచి పాత్ర దక్కింది. జిమ్ సర్బ్ క్రూరమైన ఒక కార్పొరేట్ బాస్ గా జీవించాడు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం. సినిమాలో పాటలు బాగా కుదిరాయి. అంతకుమించి అనేలా రే రికార్డింగ్ కూడా చేశాడు దేవి శ్రీ ప్రసాద్. సినిమా నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా వర్క్ చేసి ఉండాల్సింది. ఈ సినిమా నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
ఫైనల్లీ : ఇది శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన ఓ క్రైమ్ డ్రామా విత్ ఎ సోషల్ మెసేజ్.