NTV Telugu Site icon

Devaki Nandana Vasudeva Review: దేవకీ నందన వాసుదేవ రివ్యూ

Devaki Nandana Vasudeva Trailer

Devaki Nandana Vasudeva Trailer

తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుణ 369 అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించగా నల్లపనేని యామిని సమర్పిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ అందించడంతో సినిమా మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు టీజర్, ట్రైలర్ కట్స్ చూస్తుంటే మురారి ఛాయలు కనిపించడంతో మామకు తగ్గట్టే అల్లుడు అలాంటి సినిమా ఏమైనా ప్లాన్ చేసి ఉంటాడేమో అని అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలు అందుకుండా? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనే వివరాలు తెలియాలంటే సినిమా రివ్యూ చదివేయండి

కథ :
విజయనగరంలో కంసరాజు (దేవదత్త నాగే) చాలా క్రూరమైన వ్యక్తి. అతని మాటే శాశనం కాదన్న వాడి శవం కూడా దొరకదు. అయితే పరమ శివ భక్తుడు అయిన అతను ఓ సారి కాశీ వెళ్లినప్పుడు అక్కడ ఓ అఘోరా కనపడి.. నీ చెల్లికు పుట్టే మూడో బిడ్డ వల్ల ప్రాణ హాని ఉందంని అనడంతో కంసరాజు కడుపుతో ఉన్న చెల్లెలి (దేవయాని) భర్తను దారుణంగా చంపేస్తాడు. చెల్లెలు ప్రసవం రోజే మరో హత్య కేసులో జైలుకు వెళ్లి 21 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తాడు. అలా పుట్టిన మేనకోడలు సత్య (మానస వారణాసి)ను ఓ పెళ్లిలో చూసిన కృష్ణ (అశోక్ గల్లా) ప్రేమలో పడతాడు. కంసరాజు జైలు నుంచి బయిటకు వచ్చాక అనుకోకుండా రెండు సార్లు కృష్ణ కాపాడడంతో అతన్ని ఇంట్లోనే పనికి పెట్టుకుంటాడు. అయితే అప్పటికే సాత్యకి కంసరాజు వేరే పెళ్లి చేసేందుకు రెడీ అవుతాడు. ఈ క్రమంలో కృష్ణ తన ప్రేమ కోసం ఏం చేశాడు. కంసరాజుకు కృష్ణకు మధ్య ఏం జరిగింది? చివరికి అఘోరా చెప్పింది నిజం అయిందా? లేదా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
కార్తికేయ, హనుమాన్ సహా కొన్ని మైథలాజి టచ్ ఉన్న సినిమాలు సూపర్ హిట్ కావడంతో అలాంటి నేపథ్యంలోనే దేవకీ నందన వాసుదేవను కూడా ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథతో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆ మిగతా సినిమాల తరహాలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. సినిమా ఓపెనింగ్ లోనే కంస మామ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తరువాత హీరో పరిహాయం హీరోయిన్ తో ప్రేమలో పడడంతో సినిమాలో వేగం పెరుగుతుంది. అయితే సినిమా కథనంలో కొన్ని సీన్స్ ఓవర్ డ్రమటిక్ గా మరీ అవుట్ డేటెడ్ అనిపిస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు పరమ బోరింగ్ ఫీలింగ్ కలుగక మానదు. అయితే సినిమాలో కొన్ని ట్విస్ట్ లు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అలాగే క్లైమాక్స్ బాగా రాసుకున్నారు. అయితే సినిమాలో నటీనటుల ఎంపిక, కొందరి ఓవర్ యాక్షన్ చూడలేం. రామ్ ప్రసాద్ జబర్దస్త్ మార్క్ కామెడీ ఎబ్బెట్టుగా ఉంది. సినిమాలో లవ్ ట్రాక్ అతికించినట్టు ఉండగా చాలా ఎమోషన్స్ కూడా అసలు వర్కౌట్ కాలేదు. ఏదో పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే మానదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే అశోక్ గల్లా ఈ సినిమాలో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపించాడు. లుక్స్ వరకు బాగున్నా ఫైట్ సీన్స్ లో వెయిటేజ్ ఎక్కువై ఓవర్ డోస్ అనిపించింది. ఇక హీరోయిన్ మానస వారణాసి నటన పర్వాలేదు. దేవదత్త నాగే విలన్ గా అదరగొట్టాడు. క్రూరంగా విలనిజాన్ని ఉట్టి పడేలా నటించాడు. ఝాన్సీ, దేవయాని, గెటప్ శ్రీను, శత్రు, శ్రీధర్ రెడ్డి ఉన్నంతలో ఫర్వాలేదు అనిపించారు. ఇక సాంకేతిక వర్గ పని తీరు విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ విషయంలో కేర్ తీసుకుని ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. భీమ్స్ సంగీతం బాగానే ఉన్నా నేపధ్య సంగీతం విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా కత్తిరించి ఉండొచ్చు. నిర్మాత పెట్టిన ఖర్చు సినిమాలో కనిపిస్తుంది.

ఫైనల్లీ “దేవకీ నందన వాసుదేవ” రొటీన్ మూవీ విత్ అవుట్ డేటెడ్ స్క్రిప్ట్.

Show comments