రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా కాకుండా ఈ సినిమాని స్టాండ్ అలోన్ ఫిల్మ్‌గా రూపొందించాడు. నాగార్జున నెగటివ్ రోల్లో నటించడంతోపాటు, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతిహాసన్, సత్యరాజ్ ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూ చూద్దాం.
కూలీ రివ్యూ:
సైమన్ (నాగార్జున) విశాఖపట్నం పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకొని కింగ్ పిన్ లాజిస్టిక్ పేరుతో బంగారంతోపాటు లగ్జరీ వాచ్‌లను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అతని కోసం పనిచేసే దయాళ్ (సౌబిన్ షాహిర్) దయ అనేదే లేకుండా అరాచకం సృష్టిస్తూ ఉంటాడు. ఇలాంటి క్రమంలో సైమన్ కోసం పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) మరణిస్తాడు. అయితే అది సహజ మరణం కాదని భావించిన దేవా (రజనీకాంత్) ఆ మరణానికి కారణం తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌ను చంపింది ఎవరో తెలుస్తుంది. కానీ అతను ఎందుకు చంపాడు? అసలు రాజశేఖర్, దేవా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే వివరాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
రజనీకాంత్ టైటిల్ రోల్‌లో కూలీ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు పెరుగుతూ వచ్చాయి. దానికి తోడు ఒక్కో భాష నుంచి ఆయా భాషలో సూపర్‌స్టార్‌లుగా ఉన్న వారిని సినిమాలో భాగం చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు నెమ్మదిగా పెరిగాయి. తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, హిందీ నుంచి అమీర్ ఖాన్, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్ ఇలా ప్రస్తుతం టాప్ లీగ్‌లో కొనసాగుతున్న వారిని సినిమాలో భాగం చేశారు. దీంతో అసలు సినిమా కథ ఎలా ఉండబోతుంది అని ముందు నుంచి అందరిలో ఆసక్తి ఏర్పడింది. టీజర్, ట్రైలర్ కట్స్ విడుదలైన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. అయితే సినిమా మాత్రం భారీ అంచనాలతో వెళ్లిన వారిని కాస్త నిరాశ పరుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే సినిమాని ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కోసం కాకుండా ఒక కథను చెప్పాలనే ప్రయత్నంతో లోకేష్ చేసినట్లు అనిపించింది. లోకేష్ కనకరాజ్ సినిమాలు అంటే ఏదో మ్యాజిక్ ఎక్స్‌పెక్ట్ చేసి థియేటర్లకు వస్తారు ప్రేక్షకులు. అయితే ఇందులో అలా చేయకుండా నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో ఒక సింపుల్ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. అసాధారణ రీతిలో మరణించిన స్నేహితుడి మరణానికి కారకులు ఎవరు అని తెలుసుకునేందుకు ఓ మాజీ కూలీ యూనియన్ నాయకుడు మొదలుపెట్టిన ప్రయాణమే ఈ కూలీ కథ. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫ్లాట్‌గా, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ కన్నా కాస్త ముందు వచ్చి ప్రీ-ఇంటర్వెల్ నుంచి సినిమా కథ ఆసక్తికరంగా మారుతుంది. ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ బాగానే వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ కట్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలు కథ నెమ్మదిగా అర్థం అవుతుంది. అయితే ఎక్కడా హై ఇవ్వలేదని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. కానీ క్లైమాక్స్ అరగంట మాత్రం చాలా డీసెంట్‌గా రాసుకున్నాడు డైరెక్టర్. ముఖ్యంగా అమీర్ ఖాన్ పాత్ర ఎంట్రీ అయితే అదిరిపోతుంది. అమీర్ ఖాన్‌తో పాటు ఉపేంద్రకు కూడా మంచి ఎలివేషన్స్‌తో ఎంట్రీ రాసుకున్నారు. సాధారణంగా రజనీకాంత్ సినిమాకి రజనీకాంత్‌కి అలాంటి ఎలివేషన్స్ పడతాయనుకుంటే, ఉపేంద్రతో పాటు అమీర్ ఖాన్‌కి అలాంటి షాట్స్ పడ్డాయి. నిజానికి ఇది ఒక రివెంజ్ డ్రామా అనుకోవచ్చు. స్నేహితుడి హత్యకు పగ తీర్చుకునేందుకు మరో స్నేహితుడు చేసిన యుద్ధమే కూలీ కథ.
నటీనటుల ప్రదర్శన:
కూలీ టైటిల్ రోల్‌లో రజనీకాంత్ కరెక్ట్‌గా సెట్ అయ్యాడు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ వస్తున్న రజనీ ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రతోనే అదరగొట్టాడు. సైమన్ పాత్రలో నాగార్జున పరకాయ ప్రవేశం చేసాడేమో అనిపించింది. ఈ మధ్యకాలంలో చాలా ఈజ్ తో చేసిన పాత్ర ఇదే అని చెప్పొచ్చు. నాగార్జున ఇలాంటి తరహా పాత్రలో గతంలో కూడా కనిపించాడు, కానీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర మొదటిసారి కావడం గమనార్హం. ఇక సౌబిన్ షాహిర్ కనిపించినంత సేపు అదరగొట్టాడు. తనదైన విలనిజం పండిస్తూ ఆకట్టుకున్నాడు. ఉపేంద్ర కనిపించింది చాలా తక్కువే అయినా ఇంపాక్ట్ ఉన్న రోల్ చేశాడు. అమీర్ ఖాన్ కూడా చివరలో కాసేపే కనిపిస్తాడు, కానీ కనిపించినంత సేపు భలే ఉన్నాడు రా అనిపించేలా చేశాడు. శృతిహాసన్‌కి ఇలాంటి పాత్రలకు కొత్త ఏమీ కాదు, ఉన్నంతలో తన పాత్రలో బాగానే చేసింది. రచితా రామ్‌కి ఈ సినిమాలో సాలిడ్ పాత్ర దక్కింది. షాకింగ్ ట్విస్ట్‌లతో ఆమె ఆకట్టుకుంది. సత్యరాజ్ పాత్ర కనిపించింది కొద్దిసేపైనా, కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది.
టెక్నికల్ టీం:
ఈ సినిమాలో చాలామంది హీరోలు ఉన్నారు, కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే అనిరుద్ అసలు హీరో. సినిమాని నెక్స్ట్ లెవెల్‌లో ఎలివేట్ చేయడానికి అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉపయోగపడింది. ఇప్పటికే అనిరుద్ అందించిన అన్ని పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. కాకపోతే మోనికా సాంగ్ ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా సెట్ అవ్వలేదేమో అనిపించింది. మిగతా సాంగ్స్ చూడ్డానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా మంచి ప్రెజెంట్ ఫీల్ తీసుకొచ్చింది, కానీ VFX విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల అది గ్రాఫిక్స్ అని ఈజీగా అర్థమయిపోయేలా ఉంది. ఎడిటింగ్ విషయంలో కూడా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిడివి కొంతవరకు సినిమాకి ఇబ్బందికర అంశం. ఆర్టిస్టుల కాస్టింగ్ కరెక్ట్‌గా సెట్ అయింది.
ఫైనల్లీ:
కూలీ రజనీ మార్క్ రివెంజ్ డ్రామా. అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లిన వాళ్లకు నచ్చుతుంది.