అనుకోకుండా ఒక వివాదంతో రాజ్ తరుణ్ అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిన అతను, అంతే సైలెంట్‌గా ఒక సినిమా చేశాడు. ‘అదిరే అభి’ దర్శకుడిగా మారి ‘చిరంజీవ’ అనే సినిమా చేయగా, దానిలో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. మరో వివాదంతో తెరమీదకు వచ్చిన భామ కుషిత కళ్ళపు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథాంశం (స్టోరీ లైన్)
చిన్ననాటి నుంచే శివ (రాజ్ తరుణ్)కు బాగా స్పీడ్ ఎక్కువ. ఆ స్పీడ్ అతన్ని అంబులెన్స్ డ్రైవర్ అయ్యేలా చేస్తుంది. అయితే ఒకరోజు అంబులెన్స్ నడుపుతూ ఉండగా జరిగిన యాక్సిడెంట్‌తో హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాక అతనికి ఒక స్పెషల్ పవర్ వచ్చిందని తెలుసుకుంటాడు. ఆ పవర్ కారణంగా ప్రతి మనిషి తల మీద ఒక మీటర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ మీటర్‌లో అతని ఆయుష్షు ఎంత ఉంది అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పవర్ కారణంగా అతను డబ్బు సంపాదించడమే కాక, జీవితంలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద పిల్లల గుంపు మొత్తం ఒకేరోజు చనిపోతుందని విషయం అర్థం అవుతుంది. అయితే, వారందరినీ చనిపోకుండా శివ ఎలా కాపాడాడు? వారిని కాపాడే క్రమంలో శివకు ఎదురైన సవాళ్లు ఏమిటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూసేయాల్సిందే.
విశ్లేషణ
చావు అనేది ఓ భయంకరమైన విషయం. ఆ చావు ఎప్పుడొస్తుందో తెలిస్తే, అది ఇంకెంత భయంకరం? అది కూడా మన చావు కాదు, పక్కన వాళ్ళ చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలిసే వరం వస్తే, అమ్మో! ఆ ఊహ భయంకరంగా ఉంది కదా! కానీ, అలాంటి వరం సంపాదించిన శివ ఆ వరం కారణంగా ఎలాంటి పరిస్థితులకు లోనయ్యాడు? ఆ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? లాంటి విషయాన్ని ఆసక్తికరంగా రాసుకున్నాడు ‘అదిరే అభి’. స్వతహాగా మంచి కామెడీ సెన్స్ ఉన్నవాడు కావడంతో ఒక సీరియస్ పవర్‌ని కామెడీతోనే నడిపించాడు. ముఖ్యంగా ఈ పవర్ వచ్చిందని తెలియడానికి అరగంట పడుతుంది. ఆ అరగంట తర్వాత సినిమా అంతా నవ్వుకునేలా ఆకట్టుకుంటుంది. నిజానికి సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నా, తనదైన కామెడీతో నడిపించేశాడు రాజ్ తరుణ్. నిజానికి రియాలిటీలో సాధ్యం కాని ఇలాంటి పవర్స్ (శక్తులు) వచ్చినప్పుడు దానితో పుట్టించే సిచువేషన్ (పరిస్థితుల) కామెడీ మరింత వర్కౌట్ అయింది.
నటీనటుల పర్ఫార్మెన్స్
నటీనటుల విషయానికి వస్తే, రాజ్ తరుణ్‌కి ఇలాంటి తరహా పాత్రలు కొట్టిన పిండి. దీంతో మనోడు పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్టుగా నటించాడు. కుషిత కళ్ళపు స్క్రీన్ మీద చాలా బాగుంది. రాజా రవీంద్ర, గడ్డం నవీన్ సహా మిగతా నటీనటులు అందరూ ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, అచ్చు రాజమణి అందించిన సంగీతం బావుంది. నేపథ్య సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి రెస్పాండ్ అయింది. కూడా గంటన్నర ఉండేలా ఎడిటింగ్ టేబుల్ మీద చేసిన క్రిస్ప్ కట్ బావుంది.
ఫైనల్లీ, ఈ ‘చిరంజీవి’ నవ్విస్తాడు.