ఈ మధ్య మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థలు ఆయా సినిమాలను కొనుగోలు చేసి, తెలుగులో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మలయాళంలో మంచి టాక్ సంపాదించిన “బ్రోమాన్స్” అనే సినిమాను సోనీ లివ్ సంస్థ మంచి రేటుకు దక్కించుకుని, పాన్-ఇండియన్ లాంగ్వేజెస్‌లో స్ట్రీమింగ్ చేస్తోంది. “ప్రేమలు” ఫేమ్ సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, “రోమాంచం” ఫేమ్ అర్జున్ అశోకన్, “జాబిలమ్మ నీకు అంత కోపమా” చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మాథ్యూ థామస్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 14న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం నేటి నుంచి (మే 1) సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ కామెడీ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం, పదండి.
కథ: ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కథ. అందుకే సినిమాకు “బ్రోమాన్స్” అనే పేరు పెట్టారు. షింటో (శ్యామ్ మోహన్) మరియు బింటో (మాథ్యూ థామస్) ఇద్దరూ అన్నదమ్ములు. న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేస్తున్న బింటోకు షింటో మిస్ అయినట్లు కాల్ వస్తుంది. అన్నయ్య ఉండే కొచ్చికి బయలుదేరిన బింటో, షింటోను కనుగొనే ప్రయత్నం మొదలుపెడతాడు. తనకు కాల్ చేసిన తన అన్న ఫ్రెండ్ షబీర్ (అర్జున్ అశోకన్), ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్ (సంగీత్ ప్రతాప్), తన అన్న మాజీ ప్రేయసి ఐశ్వర్య (మహిమా నంబియార్)తో కలిసి షింటో ఎక్కడున్నాడని వెతుకులాట మొదలు పెడతాడు. మరి బింటో షింటో ఎక్కడున్నాడో కనిపెట్టాడా? అసలు షింటో ఏమయ్యాడు? షింటో ప్రేయసితో బ్రేకప్ ఎందుకయింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది పూర్తిస్థాయి కామెడీ సినిమాగా రాసుకున్నాడు దర్శకుడు. అమ్మ మీద ఎలాంటి ప్రేమ లేని ఓ తమ్ముడు, అన్న ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి, ఎలాంటి పరిస్థితుల్లో అతని కోసం వెతుకులాట ప్రారంభించాడు, చివరికి అతన్ని ఎలా ట్రేస్ చేయగలిగాడు అనే సింపుల్ లైన్‌ను పలు ఆసక్తికరమైన కామెడీ సీక్వెన్స్‌లతో తెరకెక్కించాడు డైరెక్టర్. అన్నను ట్రేస్ చేసే క్రమంలో పరిచయమైన ఎథికల్ హ్యాకర్ హరిహరసుధన్ అనే క్యారెక్టర్‌తో నవ్వులు పూయిస్తూనే, షబీర్ అనే క్యారెక్టర్‌తో ఆ నవ్వులను మరింత ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి తోడు, కొచ్చి డాంగ్లీ అనే మరో క్యారెక్టర్‌తో కాస్త మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసే ప్రయత్నం చేసి, దాదాపు సఫలమయ్యారు. నిజానికి ఇది అద్భుతమైన కథతో రూపొందించబడిన సినిమా ఏమీ కాదు, కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను నవ్వించేలా డైరెక్టర్ ముందుకు నడిపించాడు.
నటీనటుల విషయానికొస్తే: ఈ సినిమాలో ఎంతోమంది ఉన్నారు, కానీ మాథ్యూ థామస్ పాత్ర బాగా ఎలివేట్ అయింది. ఒక సగటు కుర్రాడిగా ఆకట్టుకునేలా నటించాడు. అన్న కోసం వెతుకులాడుతూ పరితపించే తీరు ఆకట్టుకునేలా ఉంది. షింటో పాత్రలో శ్యామ్ మోహన్ పాత్ర పరిమితమే, అయితే అర్జున్ అశోకన్ మాత్రం తన పాత్రలో సెటిల్డ్ కామెడీతో అలరించాడు. సంగీత్ ప్రతాప్ పాత్ర కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులకు నవ్వు తెప్పించేలా సీన్స్ రాసుకున్నాడు డైరెక్టర్. ఇక మిగతా పాత్రల్లో నటించినవారందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సినిమాలో గోవింద్ వసంత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. మలయాళ సినిమాల్లో పెద్దగా పాటలు ఉండవు, కానీ ఈ సినిమాలో ఉన్న ఒకటి రెండు పాటలు కూడా ఈ జనరేషన్ ఆడియన్స్‌కు నచ్చేలా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది, ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్‌గా ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా: ఈ “బ్రోమాన్స్” సరదాగా వీకెండ్‌కు చూసేయొచ్చు.