అఖండతో హిట్ కొట్టిన బోయపాటి శ్రీను ది వారియర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న రామ్ పోతినేని కలిసి స్కంద అనే సినిమా చేశారు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తగినట్టుగానే ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేయడంతో పాటు నందమూరి బాలకృష్ణ అని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకురావడంతో సినిమాల మీద అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా అంచనాలను ఎంతవరకు అందుకుంది? అనేది సినిమా రివ్యూలో తెలుసుకుందాం.
స్కంద కథ:
ఏపీ సీఎం రాయుడు( అజయ్ పుర్కార్) కుమార్తెను తెలంగాణ సీఎం రంజిత్ రెడ్డి(శరత్ లోహితాస్వా) కొడుకు పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో తీసుకు వెళ్తాడు. అది నచ్చని ఏపీ సీఎం ఎలా అయినా తెలంగాణ సీఎం కుమారుడిని అంతం చేయాలని ప్లాన్ చేయగా దాన్ని భాస్కర్( రామ్) అడ్డుకుంటాడు. ఆ తర్వాత అనూహ్య పరిస్థితులలో ఏపీ సీఎం, తెలంగాణ సీఎంల ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్ చేసి తన ఊరైన రుద్రరాజపురం తీసుకువెళతాడు. రుద్రరాజు పురానికి చెందిన రుద్రగంటి రామకృష్ణ రాజు (శ్రీకాంత్) మీ వల్లే జైలు శిక్ష అనుభవిస్తున్నాడని అతన్ని నిదోషిగా బయటకి తీసుకొస్తేనే మీ కూతుళ్లను అప్పజెబుతానని అంటాడు. అసలు రామకృష్ణ రాజుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న సంబంధం ఏంటి? రామకృష్ణ రాజుకి భాస్కర్ కి ఉన్న లింక్ ఏంటి ? సీఎంల కుమార్తెలను ఎలా భాస్కర్ కిడ్నాప్ చేశాడు? మరి తమ కూతుర్లను విడిపించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేశారు? అనేదే ఈ స్కంద కథ.
విశ్లేషణ:
సాధారణంగా బోయపాటి ఎంచుకునే సినిమాలన్నీ పెద్ద కుటుంబాలకు చెందిన కథలుగానే ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి కథనే ఎంచుకున్నారు బోయపాటి శ్రీను. రాజకీయ క్రీనీడలో బలి పశువుగా మారిన ఒక పారిశ్రామికవేత్తను అతని స్నేహితుడి కుటుంబం ఎలా కాపాడుకుంది అనే ఒక చిన్న లైన్ తో ఈ సినిమా తెరకెక్కించారు. మొదటి భాగం అంతా సదరు పారిశ్రామికవేత్త అరెస్టు కావడం తరువాతి పరిస్థితులలో ఒక ముఖ్యమంత్రి కుమార్తెను మరొక ముఖ్యమంత్రి కుమారుడు పెళ్లి పీటల నుంచి లేపుకు వెళ్లిపోవడం వంటివి చూపించారు. ఒకానొక దశలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోరాహోరి తలపడతారేమో అని అనుకుంటున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా కొన్ని ట్విస్టులు రాసుకున్నాడు బోయపాటి శ్రీను. ఊహించని సమయంలో ట్విస్ట్ లు ఇచ్చి కథను ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు. మిత్రులుగా ఉన్న ముఖ్యమంత్రులు శత్రువులుగా మారడం. తర్వాత ఒక శత్రువు కోసం మళ్లీ మిత్రులుగా మారడం, ఇలా ఆసక్తికరంగా కథ సాగుతూ ఉంటుంది.. అయితే లైన్ బాగానే రాసుకున్నాడు గాని కథనం విషయంలోనే మరింత జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను వీధి రౌడీల్లాగా తాము కావాలి అనుకున్న దానికోసం దేనికైనా తెగించే వ్యక్తులుగా చిత్రీకరించడం ఎందుకో రియాలిటీకి దగ్గరగా అనిపించలేదు. అలాగే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల ఇళ్లకు ఒక్క గన్ను కూడా లేని వ్యక్తి వెళ్లి వారి ఇంటి నుంచి మనుషులను అపహరించడం లేదా చంపడం లాంటివి ఎందుకో రియాలిటీకి దగ్గరగా అనిపించలేదు. సాధారణంగానే సినిమాలకు లాజిక్స్ వెతకకూడదు అంటారు, అలాంటిది బోయపాటి సినిమాకి లాజిక్స్ అనే పదమే మైండ్లో లేకుండా వెళ్లాలి. అలా వెళితే కనుక ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో రామ్ లోని మాస్ యాంగిల్ ని బోయపాటి పెద్ద ఎత్తున చూపించే ప్రయత్నం చేశాడు. రియాలిటీకి దగ్గరగా లేకపోయినా యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. నేటి రాజకీయాలపై సెటైర్లు అనిపించే విధంగా చాలా డైలాగులు రాసుకున్నాడు బోయపాటి శ్రీను.. అయితే ముందే డిస్క్లైమెర్లో ఇది ఏ రాజకీయ పార్టీకి, నాయకులకు సంబంధం లేని సినిమా అని ప్రకటించాడు.
ఎవరెలా చేశారంటే:
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో భాస్కర్ అనే పాత్రతో పాటు పేరు రివీల్ చేయని మరో పాత్రలో రామ్ పోతినేని నటించి ఆకట్టుకున్నాడు. వాస్తవానికి భాస్కర్ అనే పేరు కూడా రివీల్ చేయలేదు కానీ మణికంఠరాజు అనే వ్యక్తి కుమారుడిగా మాత్రమే చూపించారు..పూర్తిగా తండ్రి కోసం తండ్రి మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒక వ్యక్తి పాత్రలో కనిపిస్తూనే 30 వేల మంది సైనికులు చంపలేని ఒక మాఫియా డాన్ ను మట్టుపెట్టిన మరో పాత్రలో కూడా రామ్ జీవించేశాడు. సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షో గా నడిపించాడు రామ్ పోతినేని. శ్రీ లీల డాన్సుల కోసం, ఒకటి రెండు కామెడీ సీన్ల కోసమే పరిమితమైనట్లు అనిపించింది. మరాఠీ నటుడు అజయ్, తమిళ నటుడు శరత్ ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పూర్తిస్థాయిలో జీవించారు. నటుడు ప్రిన్స్, కాలకేయ ప్రభాకర్ ఇద్దరు సీఎంల తమ్ముడు, బావమరుదులుగా క్రూరత్వాన్ని పండించే ప్రయత్నం చేశారు. రామ్ తల్లి పాత్రలో గౌతమి, రామకృష్ణ రాజు అనే పాత్రలో శ్రీకాంత్ ఆయన భార్య పాత్రలో ఇంద్రజ, కుమార్తె పాత్రలో సాయి మంజ్రేకర్ ఇలా ఎవరికివారు తమ తమ పాత్రల పరిధి మీద నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రచ్చ రవి పాత్ర చిన్నది అయిన ఒక మోనోలాగ్ డైలాగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. టెక్నికల్ టీం విషయానికి వస్తే బోయపాటి శ్రీను కదరం మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండనిపిస్తుంది. రత్నం రాసిన డైలాగ్స్ అన్నీ ఎందుకు టార్గెట్ చేసినట్లే అనిపించాయి. ఇక సినిమా మొత్తం మీద సినిమాటోగ్రఫీ సినిమాని ఎలివేట్ చేసింది తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు మాత్రం అంత క్యాచి అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్:
బోయపాటి స్టైల్ ఫైట్స్
రామ్ డ్యూయల్ రోల్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
రియాలిటీకి దగ్గరగా లేని కథనం
ఏమాత్రం క్యాచీగా లేని పాటలు
ఫైనల్లీ : స్కందలో వయలెన్స్ పాళ్ళు ఎక్కువే.. మంచి మాస్ మసాలా ఎంటర్టైనర్లు, యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ వాచ్, అది కూడా లాజిక్స్ వెతకనంతవరకే.
రేటింగ్: 2.5