Kalasa Movie Review: సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు హారర్ జానర్ అంటే చాలా ఇష్టం. అందుకే మేకర్స్ కూడా ఇలాంటి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కలశ అనే మూవీ తెరకెక్కింది. చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో ఈ సినిమాను కొండ రాంబాబు దర్శకత్వంలో డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఒక్క సారిగా ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో అనేది రివ్యూలో చూద్దాం.
కలశ కథ:
తన్వీ(భాను శ్రీ) ఒక మంచి హారర్ కథ రాసుకుని సినిమా చేయడానికి ప్రయత్నిస్తూ ఒక నిర్మాత దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకుంటుంది. ఇక క్లైమాక్స్ మార్చమని అడగడంతో దాని మీద డిస్కస్ చేసేందుకు తన స్నేహితురాలు కలశ(సోనాక్షి వర్మ) ఇంటికి వెళ్తుంది. అక్కడ కలశ లేకపోవడంతో లోపలికి వెళ్లగా ఆమెకు కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ కలశ చెల్లెలు అన్షు(రోషిని) దెయ్యంలా తనను ఆట పట్టిస్తోందని భావిస్తూ ఉంటుంది. ఇక రాత్రికి కలశ వచ్చిన తరువాత కూడా ఆమెకు ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏమీ అర్ధం కావు. అయితే ఉదయాన్నే ఇంటి బయట కూరగాయల షాప్ వ్యక్తి వచ్చి కలశ, అన్షు చనిపోయి రెండు నెలలు అయిందని చెప్పి షాక్ ఇస్తాడు. మీరు చూసింది కలశ, అన్షు ఆత్మలను అని చెప్పడంతో తన్వీ భయపడి పోతుంది. అయితే అనాథలు అయిన ఈ అక్కాచెల్లెళ్లు ఎలా చనిపోయారు? నిజంగానే చనిపోయిన వారు ఆత్మలు అయ్యారా? వీరి చావులకు కారణం అయింది ఎవరు? వారికి చివరికి శిక్ష పడిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో మనం గతంలో ఎన్నో సినిమాలు చూశాం, ఈ సినిమాను కూడా అదే కోవలో తెరకెక్కించారు.. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని సినిమాటిక్ గా క్యాప్చర్ చేయడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. ప్రేక్షకులను భయపెడుతూ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి పెంచేస్తూ మొదటి భాగం అంతా నడిపించాడు. అలాగే ఉన్నంతలో ఫస్ట్ హాఫ్ లో రచ్చ రవి, భానుశ్రీల మధ్య కామెడీ ట్రాక్ కొంత వర్కౌట్ అయింది. ఇక ఇంట్లోకి వెళ్ళాక దెయ్యం దెబ్బకు కొన్ని చోట్ల భయ పెడుతూనే మరోపక్క నవ్వు తెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక ఇంటర్వెల్ సీన్ తో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేసి సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి ఒక్కో చిక్కుముడిని విప్పుతూ వస్తాడు. కలశ నేపథ్యం, అక్కాచెల్లెళ్ల చావులు, ఆ చావులకు గల కారణాలు ఊహించని విధంగా రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎవరైతే విలన్ అనుకుంటామో వారితోనే అసలు నిజాలు చెప్పిస్తూ ట్విస్టులు థ్రిల్లింగ్ గా రాసుకుంటాడు. రియాలిటీకి దూరంగా క్లైమాక్స్ కొంచెం కొత్తగా అనిపించింది. కథనం బాగానే ఉన్నా కథ మరింత ఎమోషనల్ గా రాసుకొని, క్యాస్టింగ్ లో తెలిసిన ముఖాలను కనుక పెట్టి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది.
ఇక నటీనటుల విషయానికి వస్తే బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీకి చాలా కాలం తర్వాత మంచి ఒక లెన్త్ ఉన్న రోల్ లభించింది. యంగ్ డైరెక్టర్ తన్విగా ఆమె తన పాత్రలో ఒదిగిపోయింది. టైటిల్ పాత్రలో నటించిన సోనాక్షి వర్మ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆమె చెల్లి అన్షుగా రోషిణి కామిశెట్టి, పోలీసు అధికారి కార్తికేయగా రవివర్మ, నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐగా సమీర్, సినిమా రచయిత రాహుల్‌గా అనురాగ్‌తో పాటు కానిస్టబుల్ నారాయణగా రాజు సహా మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. ఇక టెక్నికల్ విషయాలను పరిశీలిస్తే విజయ్ కురాకుల నేపథ్యం సంగీతం కొన్ని చోట్ల వణికించేలా ఉంది. వెంకట్ గంగధారి సినిమాటోగ్రఫీ కథకు తగ్గ మూడ్ క్యారీ చేసింది. నిర్మాత డాక్టర్ రాజేశ్వరి చంద్రజ కూడా డాక్టర్ పాత్రలో మెరవడమే కాదు నిర్మాణ విలువల విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా అనుభవం ఉన్న నిర్మాతలా నిర్మించారు.
ఫైనల్లీ: కొత్త పాయింట్ తో వచ్చిన ఈ కలశ హారర్ జానర్ ఇష్టపడేవారికి నచ్చుతుంది.