Babli Bouncer Review: కథానాయికలతోనే కనికట్టు చేసి పలు చిత్రాలతో ఆకట్టుకున్న ఘనుడు దర్శకుడు మధుర్ భండార్కర్. ‘ట్రాఫిక్ సిగ్నల్’ చిత్రంతో ఉత్తమ దర్శకునిగా నేషనల్ అవార్డు అందుకున్న మధుర్ భండార్కర్ అంతకు ముందు రూపొందించిన “చాందినీ బార్, పేజ్ 3″తోనూ, ఆ పై ”ఫ్యాషన్, హీరోయిన్” సినిమాలతోనూ యావద్భారతాన్నీ ఆకట్టుకున్నారు. దాంతో మధుర్ తెరకెక్కించిన ‘బబ్లీ బౌన్సర్’ మూవీలో తమన్నా నాయికగా ఛాన్స్ దక్కించుకొనే సరికి ఈ సినిమాపై భలేగా అంచనాలు నెలకొన్నాయి. శుక్రవారం ఈ సినిమా నేరుగా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై జనాన్ని పలకరించింది.
ఇంతకూ ఈ ‘బబ్లీ బౌన్సర్’ సినిమా కథ ఏమిటంటే- అసోలా ఫతేపూర్ లోని బబ్లీ అనే అమ్మాయి జీవనోపాధి కోసం దేశరాజధాని ఢిల్లీ చేరుకుంటుంది. మొదటి నుంచీ బబ్లీ బలమైన అమ్మాయి. సునాయాసంగా డజన్ పరోటాలు లాగించేసి, గ్లాసుల కొద్దీ లస్సీని గటగట తాగేసే రకం. ఆమెను జనం ‘ఆడపులి’ అంటూంటారు. ఆమె తండ్రి కూడా బబ్లీని ప్రోత్సహిస్తాడు. అలాంటి అమ్మాయి ఢిల్లీలో ఉద్యోగం దక్కించుకోవడానికి పలు పాట్లు పడుతుంది. మగువ కావడంతో బబ్లీ ప్రతీచోట వివక్ష, అసమానతను ఎదుర్కోవలసి వస్తుంది. అది బబ్లీకి నచ్చదు. జీవితమే ఓ పోరాటం అనేలా తనకు ఎదురైన ఇక్కట్లను అధిగమించడానికి కొన్ని సార్లు భౌతిక పోరాటమూ చేయవలసి వస్తుంది. ఓ పట్నం బాబు తారస పడతాడు. అతను ఆమెపై సానుభూతి చూపిస్తాడు. ప్రోత్సహిస్తాడు. దానిని బబ్లీ ప్రేమగా అపార్థం చేసుకుంటుంది. చివరకు ఆమె జీవనోపాధి కోసం లేడీ బౌన్సర్ గా మారుతుంది. ఆమెను అభిమానించే వ్యక్తీ దొరుకుతాడు. ఆపై బబ్లీ బౌన్సర్ ఎలా సాగిందన్నదే మిగిలిన కథ.
మధుర్ భండార్కర్ పలు చిత్రాలలో మగువలు తమకు ఎదురైన కష్టాలను అధిగమిస్తూ సాగుతూ ఉంటారు. అదే తీరున ‘బబ్లీ బౌన్సర్’ కూడా తెరకెక్కింది. అంతకు మించి కొత్తదనం ఏమీ కథలో కనిపించదు. పైగా పదే పదే బబ్లీ వివక్షకు గురయ్యే అంశాలు ఎదురు కావడం చూసే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. మధుర్ భండార్కర్ వంటి దర్శకునితో పనిచేయడం నిజంగా తమన్నా లాంటి నటికి ఓ మంచి అవకాశం. దానిని తమన్నా బాగానే ఉపయోగించుకుంది. తన బబ్లీ బౌన్సర్ పాత్రను తమన్నా ప్రతిభావంతంగా పోషించింది. గతంలో మధుర్ చిత్రాలు చూసిన వారికి ‘బబ్లీ బౌన్సర్’ ఏమాత్రం కొత్తగా అనిపించదు. పైగా ప్రేక్షకులే సినిమాలో తరువాత ఏమవుతుందో చెప్పేలా పేలవమైన కథనం చోటు చేసుకుంది. టైటిల్ చూసి ఓ అమ్మాయి బౌన్సర్ గా ఎలా మారింది అన్న ఆసక్తితోనే ప్రేక్షకుడు ఈ సినిమాకు వస్తాడు. కానీ, చూసేవారికి నిరాశ కలిగించేలా ఇందులోని అంశాలు చాలా పాతగా అనిపిస్తాయి. సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేక పోయింది. చెప్పాలంటే మధుర్ చిత్రాలలో బలహీనమైన స్క్రీన్ ప్లే సినిమాగా దీనిని పేర్కొనవచ్చు.
ప్లస్ పాయింట్స్:
– తమన్నా ‘బబ్లీ బౌన్సర్’గా నటించడం
– మధుర్ భండార్కర్ సినిమా కావడం
మైనస్ పాయింట్స్:
– కొత్తదనంలేని కథ, కథనం
– ఆకట్టుకోలేక పోయిన సన్నివేశాలు
– అలరించని సంగీతం
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: బాదడం ఖాయం!