‘పేపర్ బాయ్’ మూవీతో మొదటి సినిమాతోనే మంచి దర్శకుడు అనే పేరు తెచ్చుకున్నాడు జయశంకర్. ఆయన గ్యాప్ తీసుకుని చేసిన ‘అరి’ అనే సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి, ఈ సినిమాని ముందుగానే పలువురు ఆధ్యాత్మికవేత్తలకు చూపించడంతో పాటు ట్రైలర్ కట్ కూడా ఆధ్యాత్మిక అంశాలతో కూడి ఉండడంతో, సినిమా ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అనసూయ, వైవా హర్ష, సాయికుమార్ వంటి వాళ్లతో చేసిన ఈ సినిమా ట్రైలర్ కట్ కూడా ఆసక్తి రేకెత్తించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
అరి కథ:
“ఇచ్చట మీ కోర్కెలు తీర్చబడును” అనే యాడ్ మనం ఎక్కడైనా చూస్తే ఏం చేస్తాం? వెంటనే పరిగెత్తుకుని ఆ కోర్కెలు ఎలా తీరుస్తారో అని అక్కడికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఆ ప్రయత్నం చేసేందుకు ఆరుగురు వ్యక్తులు వెళతారు. అందులో టీ మాస్టర్‌గా పని చేసే అమూల్ కుమార్ (వైవా హర్ష)కి సన్నీ లియోన్తో ఒక్క రాత్రి అయినా గడపాలని కోరిక. 60 ఏళ్ల గుంజన్ (శుభలేఖ సుధాకర్)కి ఆస్తి పిచ్చి. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆస్తి అంతా తనకే దక్కాలనే ఆశ. సీఐ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్) ఓ నిధి ఎక్కడ ఉందో తెలుసుకొని, మొత్తం తీసుకెళ్లాలనే కోరిక. ఎయిర్ హోస్టెస్ ఆత్రేయి (అనసూయ)కి తన సహోద్యోగి అవ్య అంటే అసూయ. ఆమె కంటే అందంగా మారాలని, ఆ అందం ఎప్పటికీ ఉండాలనేది ఆమె కోరిక. మరణించిన తన భర్తను మళ్లీ బ్రతికించుకోవాలనేది లక్ష్మీ (సురభి ప్రభావతి) ఆశ. మరొక పక్క తన వారసులు ఎప్పటికీ ధనవంతులుగానే ఉండాలనేది వ్యాపారవేత్త విప్రనారాయణ పాశ్వాన్ (సాయి కుమార్) కోరిక. ఈ ఆరుగురు విడివిడిగా వచ్చి యాడ్ ఇచ్చిన వ్యక్తి (వినోద్ శర్మ)ని కలుస్తారు. లైబ్రరీలో ఉండే సదరు వ్యక్తి వీరందరికి ఒక్కో టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్స్ ఏమిటి? వాటిని పూర్తిచేసిన వీరు తమ కోర్కెలను తీర్చుకోగలిగారా లేదా? అనే విషయాలు తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రస్తుతానికి డివోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలకు టాలీవుడ్‌లోనే కాదు, అన్ని భాషల్లో మంచి డిమాండ్ ఉంది. బహుశా ఆ ఉద్దేశంతో రాసుకున్నారో ఏమో తెలియదు కానీ, ఈ సినిమాని అరిషడ్వర్గాల గురించి దర్శకుడు రాసుకున్నారు. దానికి కృష్ణుడి పాత్రతో లింక్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. వాస్తవానికి, దర్శకుడు ప్రమోషన్స్‌లో చెప్పినట్టుగానే, ఇది ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలోనే ఎవరూ తెరమీద చూపించడానికి ప్రయత్నం చేయని సినిమా. అయితే, అది లైన్ వరకు బాగుంది. కానీ, ఎగ్జిక్యూషన్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే అదిరిపోయేదేమో అనిపిస్తుంది. అరిషడ్వర్గాలు అంటే ఇప్పటి వారికి అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు. కానీ, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సల్యాలు అనగానే పురాణ కథలు గుర్తు వస్తాయి. కానీ, వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మనిషికి ఆపాదిస్తూ, వాటితో సందేశం ఇవ్వాలనే ఆలోచన ఆసక్తికరంగా అనిపించింది. ఒకరికి కామం, మరొకరికి క్రోధం, ఒకరికి మదం, మరొకరికి మరొకటి, ఇలా ఒక్కొక్క పాత్రతో ఒక్కొక్క గుణాన్ని లింక్ చేస్తూ రాసుకున్న విధానం అయితే ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ అయినందున, ఈ సినిమాకి రీమేక్ డిమాండ్ ఏర్పడవచ్చు. ఫస్ట్ హాఫ్ పెద్దగా సాగదీయకుండానే కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు, సెకండ్ హాఫ్ విషయంలో కూడా అదే విధంగా సాగతీత లేకుండా చూసుకున్నాడు. ఇక క్లైమాక్స్‌లో అయితే మైథలాజికల్ టచ్ ఇస్తూ రాసుకున్న కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. “అసలు మనిషి ఇలా ఆలోచించాలి, ఇలా జీవించాలి” అనే ఆలోచన రేకెత్తించేలా ఉన్న సీన్స్ ఆకట్టుకున్నాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూశామనే ఫీల్తో వస్తాడని చెప్పొచ్చు.
నటీనటులు & టెక్నికల్ టీమ్
నటీనటుల విషయానికి వస్తే, అరిషడ్వర్గాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రతో కనెక్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో అనసూయ, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి ప్రభావతితో పాటు కృష్ణుడి పాత్రలో కనిపించిన వినోద్ శర్మ కూడా పాత్రలకు కరెక్టుగా సెట్ అయ్యారు. టెక్నికల్‌గా కూడా సినిమా బాగుంది అనే చెప్పాలి. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి కరెక్ట్‌గా సెట్ అయింది. సినిమాలో వచ్చే సాంగ్స్, ముఖ్యంగా కృష్ణుడి సాంగ్ అయితే ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అయితే సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఎడిటింగ్ విషయంలో తీసుకున్న కేర్ సినిమాకి బాగా కలిసి వస్తుంది.
ఫైనల్లీ ఈ అరి ఇంట్రెస్టింగ్ పాయింట్ విత్ మైథలాజికల్ టచ్