NTV Telugu Site icon

Arangetram Movie Review: అరంగేట్రమ్

Arengetram

Arengetram

Arangetram Movie Review: ఐదేళ్ళ క్రితం వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కవచం’తో శ్రీనివాసరెడ్డి మామిళ్ళ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇప్పుడు మలియత్నంగా ‘అరంగేట్రమ్’ చిత్రాన్ని తెరెక్కించాడు. సైకో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ‘అరంగేట్రమ్’లో డైరెక్టర్ శ్రీనివాస్ ఓ కీలక పాత్ర కూడా పోషించడం విశేషం. మహి మీడియా వర్క్స్ బ్యానర్ మీద మహేశ్వరి నిర్మించిన ఈ సినిమాను విడుదలకు ముందే మీడియాకు ప్రదర్శించారు.

కథ విషయానికి వస్తే… హైదరాబాద్ లో ప్రతి నెల 13వ తేదీ ఓ యువతి హత్యకు గురౌతుంటుంది. అలా ఏకంగా 23 హత్యలకు పాల్పడతాడో సైకో. ఎడమచేతి వాటం ఉన్న అమ్మాయిలనే టార్గెట్ చేసి చంపుతూ పోలీసు డిపార్ట్ మెంట్ కు సవాల్ గా నిలుస్తాడు. అతని నెక్ట్స్ టార్గెట్ వైష్ణవి అనే విషయం తెలిసి చిత్రకారుడైన శ్రీనివాస్ ఆమె ఇంటిలో పాగా వేస్తాడు. అక్కడ నుండి ఊహించని విధంగా ఒక్కో పాత్ర ఒక్కో కారణంతో ఆ ఇంట్లోకి ప్రవేశించి శ్రీనివాస్ చేతిలో బందీలుగా మారతారు. తన ప్లాన్ ప్రకారం వైష్ణవిని చంపడానికి సైకో సైతం అక్కడికే వస్తాడు. వైష్ణవి తప్పించుకుందనే విషయం తెలుసుకుని శ్రీనివాస్ ను బందించి, అప్పటికే బందీలుగా ఉన్న ఒక్కొక్కరినీ హతమార్చే పనిలో పడతాడు. వైష్ణవిని సైకో టార్గెట్ చేశాడనే విషయం శ్రీనివాస్ కు ఎలా తెలుసు? చిత్రకారుడైన శ్రీనివాస్ కు వైష్ణవిని రక్షించాల్సిన అవసరం ఏమిటీ? సైకోను పోలీసులు కాకుండా శ్రీనివాస్ ఎందుకు పట్టుకోవాలని అనుకున్నాడు? అనేది మిగతా కథ.

ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వచ్చాక థ్రిల్లర్ మూవీస్ రూపుదిద్దుకోవడం ఎక్కువైంది. అందులో కాస్తంత కొత్తదనం ఉన్న సినిమాలు థియేటర్లలోనూ విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. నిజానికి ఈ సినిమా ఎత్తుగడ చాలా బాగుంది. సైకో ఎవరో తెలియక ఒక్కో పాత్ర కన్ ఫ్యూజన్ కు గురికావడం, ఏదో కారణంతో ఇంట్లోకి ప్రవేశించి, బందీలుగా మారడం, చివరకు సైకో ఎంట్రీ ఇచ్చి, హీరోనూ బందీని చేయడం వంటివి ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాయి. బట్… సైకో ఎవరో రివీల్ అయిన తర్వాత మూవీకి స్పీడ్ బ్రేక్ పడినట్టు అయ్యింది. ఓ సాదాసీదా కుటుంబానికి చెందిన కుర్రాడు సైకోగా మారడానికి సహేతుకమైన కారణం ఉండాలి. అలానే తన వాళ్ళనే అతను హత్య చేశాడంటే అందుకు స్ట్రాంగ్ రీజన్ చూపాలి. అది ప్రేక్షకుల ఆమోదాన్ని పొందేలా ఉండాలి. కానీ ఈ సినిమాలో అది కరువైంది. సైకోగా మారే కారణాలే కాదు… అతను హత్య చేయడానికి అమ్మాయిలను ఎంచుకునే తీరు కూడా ఆమోదయోగ్యంగా అనిపించదు. అయితే… ఓ చిన్న పాయింట్ ను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించడానికి డైరెక్టర్ శ్రీనివాస్ హోమ్ వర్క్ బాగా చేశాడు. ప్రథమార్థంలో ఒకే ఇంటిలో కథను నడిపిన దర్శకుడు… ద్వితీయార్థంలో సైకోతో తన గతానికి సంబంధించిన సంఘటనలను కథల రూపంలో చెప్పడం బాగుంది. కానీ ఇందులో కీలక పాత్రలు పోషించిన వారు పేరున్న నటీనటులు కాకపోవడం పెద్ద మైనెస్.

నటీనటుల విషయానికి వస్తే… అనివార్య కారణంగా దర్శకుడు శ్రీనివాసే హీరోగా నటించాడు. ఆ పాత్రను అతను కాకుండా వేరెవరైనా పేరున్న వాళ్ళు చేసి ఉంటే రక్తి కట్టేది. దర్శకుడిగా అతను మెప్పించినా, హీరో పాత్రకు అంతగా సూట్ కాలేదు. సైకో పాత్రను ముస్తఫా అస్కరి బాగా చేశాడు. హీరోయిన్ గా నటించిన పూజా తన క్యారెక్టర్ కు న్యాయం చేకూర్చింది. ‘జబర్దస్త్’ సత్తిపండు పాత్రోచితమైన కామెడీని పండించాడు. అనిరుథ్, సాయిశ్రీ, విజయ, లయ, ఇందు తదితరులు బాగానే చేశారు. ఇటీవల విడుదలైన ‘విరూపాక్ష’లో నటించి మెప్పించిన మాస్టర్ రోషన్ చిన్నప్పటి సైకోగా బాగా నటించాడు. సాంకేతిక నిపుణులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నేపథ్య సంగీతం అందించిన గిడియాన్ కట్టా గురించి. అతను అందించిన రెండు పాటలూ మెలోడీతో సాగి బాగున్నాయి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్స్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. బురన్ షేక్ సినిమాటోగ్రఫీ, మధు ఎడిటింగ్ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా చేశాయి. ప్రొడక్షన్ డిజైనర్ రమేశ్ బాబు చిన్నం (గోపీ) కృషి తెర మీద కనిపిస్తోంది. కాస్తంత పేరున్న ఆర్టిస్టులను తీసుకుని, సైకో పాత్రను మరింత బలంగా రాసుకుని ఉంటే… ఈ సినిమా మరో మెట్టు పైన ఉండేది. థ్రిల్లర్ జానర్స్ ను ఇష్టపడేవారు ఎలాంటి అంచనాలు లేకుండా ‘అరంగేట్రమ్’ను చూస్తే నచ్చే ఆస్కారం ఉంది.

రేటింగ్: 2.5/5

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న పాయింట్
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
పేరున్న నటీనటులు లేకపోవడం
బలహీనంగా సైకో పాత్ర
కాస్తంత బోర్ కొట్టే ద్వితీయార్థం

ట్యాగ్ లైన్: మరో సైకో కథ!