Kodi Pandalu: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. కోడి పందేలకు పందెం కోళ్లు సిద్ధమయ్యాయి. పందేల కోసం కోళ్లు పుంజుకుంటుండగా, పందెంగాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు మరో రెండు వారాల్లోనే రానుంది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడి పందాలే అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఔనన్నా కాదన్నా భోగి పండుగలో భాగమైన భోగి మంటల రోజైన భోగి నుంచే కోడి పందేలు ప్రారంభించి, మూడు రోజుల పాటు కోట్ల రూపాయల బెట్టింగ్‌లు నిర్వహించేందుకు నిర్వాహకులు, పందెం రాయుళ్లు రెడీ అవుతున్నారు.
Read Also: Fisherman Escapes Crocodile Attack: చేపలు పడుతున్న యువకుడు.. ఒక్కసారిగా మీదికి వచ్చిన..
ఇక, ఏడాదిగా పెంచుతున్న పందెం కోళ్లకు శిక్షణ ఇచ్చి వీటిలో వీటికే పోటీలు పెడుతూ పుంజులను రాటు దేల్చుతున్నారు పందెం రాయుళ్లు. కోళ్లకు డిమాండ్ ఉండడంతో అప్పుడే పుంజుల ధరలు పెరిగిపోయాయి. మరోపక్క కోడి పందేల బరులను దక్కించుకోవడం కోసం అప్పుడే నేతల మధ్య సిగపట్లు ప్రారంభమయ్యాయి. సిరులు కురిపించే పందెం కోళ్ల కోసం రాజమండ్రి మార్కెట్లో పందెం రాయుళ్లు ఎగబడుతున్నారు.