NTV Telugu Site icon

Animal Movie Review: ‘యానిమల్‌’ మూవీ రివ్యూ!

Animal Movie Review

Animal Movie Review

Sandeep Reddy Vanga’s Animal Movie Review:

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ వెళ్లి కబీర్ సింగ్ సినిమాతో బిగ్ హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కావడం అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీ రాజ్ బబ్లూ వంటి వారు కూడా సినిమాలో భాగం కావడంతో సినిమా స్పాన్ పెరుగుతూ వెళ్ళింది. ఈ క్రమంలో రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేసింది. తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషనల్ కంటెంట్ దించడంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం రండి.

యానిమల్ సినిమా కథ:
రణ్ విజయ్ సింగ్ బల్బీర్(రణబీర్ సింగ్) చిన్నప్పటి నుంచి తన తండ్రి బల్బీర్ సింగ్(అనిల్ కపూర్) అంటే పంచ ప్రాణాలతో ఉంటాడు. ప్రతి చిన్న విషయంలోనూ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుంటూ ఒక హీరోలా ఆరాధిస్తూ ఉంటాడు. అయితే బల్బీర్ సింగ్ మాత్రం కొడుకుకు తగ్గ సమయం కేటాయించడు. ఇండియాలోనే ఒక పెద్ద స్టీల్ బిజినెస్ నడిపించే బల్బీర్ సింగ్ రోజు మొత్తం తన బిజినెస్ కోసమే సమయం కేటాయిస్తూ ఉంటాడు. అయితే పెరుగుతున్న వయసుతో తండ్రి మీద కూడా ప్రేమ పెంచుకున్న విజయ్ మనస్పర్థల కారణంగా అమెరికా వెళ్ళిపోతాడు. ఇండియా వచ్చినప్పుడు తన స్నేహితుడి సోదరి గీతాంజలి (రష్మిక)తో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే బల్బీర్ సింగ్ మీద ఎటాక్ జరిగిందనే విషయం తెలుసుకుని తిరిగి ఇండియా వచ్చిన విజయ్ తన తండ్రి మీద ఎటాక్ చేసింది ఎవరు అని తెలుసుకునే పనిలో పడతాడు. ఇంతకీ బల్బీర్ సింగ్ మీద ఎటాక్ చేసింది ఎవరు? విజయ్ వారిని ఎలా కనుక్కున్నాడు? చివరికి తన తండ్రి బల్బీర్ సింగ్ ను కాపాడుకున్నాడా? అనేవి తెలియాలంటే యానిమల్ సినిమా తెరమీద చూడాల్సిందే.

విశ్లేషణ:
సందీప్ రెడ్డి వంగ యానిమల్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతూ వచ్చాయి. సినిమా నుంచి పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడల్లా అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్లాయి. ఆ ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత ఈ సినిమా మొత్తం ఒక రేంజ్ వైలెన్స్ ఉండబోతుందని అర్థం అయిపోయింది. అదే విషయాన్ని టైటిల్ తో కూడా జస్టిఫై చేస్తూ తెరమీద యానిమల్ తో తాండవం ఆడించాడు సందీప్ రెడ్డి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ తో కూడుకొని ఉన్న సినిమా. కష్టపడి సంపాదించే తండ్రి తన కొడుకుతో కనీసం రోజుకు పది నిమిషాలు కూడా కేటాయించలేకపోయినా ఆ కొడుకు తండ్రి మీద పిచ్చి ప్రేమ పెంచుకుంటాడు. అయితే ఆ ప్రేమ అంతకంతకు పెరుగుతూ వెళుతుంది తప్ప ఏ మాత్రం తగ్గదు. తన తండ్రిని దైవంశ సంభూతుడిగా భావించే కుమారుడు అదే తండ్రి మీద ఎవరో ఎటాక్ చేశారనే విషయం తెలుసుకొని ఆ ఎటాక్ చేసిన వారిని అంతమొందించే ప్రయత్నమే ఈ సినిమా. సినిమా మొదటి నుంచి క్యారెక్టర్ లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడు దర్శకుడు సందీప్ రెడ్డి. విజయ్ కు తన తండ్రి మీద ఉన్న ప్రేమ ఎంత? ఎందుకంత ప్రేమ పెంచుకున్నాడు? జీవితంలో పలు దశలలో తన తండ్రి మీద ప్రేమ ఎలా పెరుగుతూ వచ్చింది? విజయ్ క్యారెక్టర్ ఎలాంటిది! ఇలాంటి విషయాలను చాలా డీటైల్డ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు సందీప్ రెడ్డి. అయితే అలా చెప్పే క్రమంలో సినిమా నిడివి భారీగా పెరిగిపోవడం సినిమాకి కాస్త ఇబ్బందికర అంశం. అదేవిధంగా ఈ సినిమా పూర్తిగా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా అనలేం అలా అని క్లీన్ కంటెంట్ అని కూడా చెప్పలేం. ముద్దు సీన్లు, ఇంటిమేట్ సీన్లు తక్కువగానే ఉన్నా డైలాగులతో సహా ఎన్నో అంశాలు ఫ్యామిలీలతో ముఖ్యంగా పిల్లలతో సినిమాను చూడకుండా చేసేలా ఉన్నాయి. అయితే సినిమాలో చాలా సీన్స్ హై వచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. నిజానికి ఫైట్ సీన్స్ ఉన్నవి రెండు మూడే అయినా ఆ సీన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. హిందీలో ఎలా ఉందో కానీ తెలుగు డైలాగ్స్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నట్టు అనిపించింది.. ఓవరాల్ గా ఈ యానిమల్ సినిమా వైలెన్స్ ఎక్కువే అయినా ఏమాత్రం ఫ్యామిలీస్ తో కలిసి చూడదగ్గ సినిమా కాదు. నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే కచ్చితంగా సినిమా రిసల్ట్ వేరేలా ఉండేది కానీ డీటెయిలింగ్ మిస్ అయ్యేదేమో. అయితే ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఫాలో అవుతూ ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంది అని అర్థం వచ్చేలా ముగింపు ఇచ్చాడు దర్శకుడు.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని రణబీర్ సింగ్ వన్ మ్యాన్ షో ఏమో అనిపించేలా స్క్రీన్ మొత్తాన్ని క్యాప్చర్ చేసేశాడు. జీవితంలో పలు దశల్లో పలు వయసుల్లో, ఫిజికల్ మేకోవర్ మాత్రమే కాదు నటనలో కూడా రణబీర్ సింగ్ చూపించిన నటన ఆయన కెరియర్ లో ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాగా నిలిచేలా చేస్తుంది. అనిల్ కపూర్ అయితే చాలా సీన్స్ లో కళ్ళతో నటించాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ అయితే ఒక రేంజ్ లో పండాయి. రష్మిక పాత్ర కూడా చాలా అత్యద్భుతంగా డిజైన్ చేశారు. రణబీర్ తో గొడవపడే ఒక సీన్ లో అయితే రష్మిక కెరీర్ లో ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది అని చెప్పవచ్చు. బాబీ డియోల్, పృథ్వీరాజ్ సహా మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సందీప్ రెడ్డివంగా స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది. నిడివి బాగా ఎక్కువగా ఉన్న ఎక్కడా బోర్ కొట్టిన ఫీలింగ్ కలిగించకుండా కథనాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో సందీప్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది, కొన్ని సీన్స్ లో హై మూమెంట్స్ రావడానికి ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కలిసి వచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా భలే ఉంది, ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ భలే క్యాప్చర్ చేశారు. కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలలో చెప్పింది నిజమే అయింది ఎక్కడ అనవసరమైన కంటెంట్ ఉన్నట్టు అనిపించలేదు.

ఫైనల్లీ: యానిమల్ ఒక ఎమోషనల్ బ్లెండెడ్ ఫిలిం విత్ వయలెన్స్ ఫీస్ట్.. ఫ్యామిలీస్ తో కలిసి చూడలేరు.