Ammu Movie Review: ‘అమ్ము’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అక్టోబర్ 19న నేరుగా అమేజాన్ ప్రైమ్ లో విడుదలయింది.
‘అమ్ము’ కథ ఏమిటంటే – అమ్ము అంటూ ఆత్మీయులు ముద్దుగా పిలుచుకొనే అముద పెళ్ళి గురించి ఎన్నో కలలు కంటుంది. సర్కిల్ ఇన్ స్పెక్టర రవిని పెళ్ళాడుతుంది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న ఆమె సంసారంలో భర్త వేధింపులు అనే అపస్వరాలు మొదలవుతాయి. పైకీ ఎంతోమంచివాడిలా కనిపించే రవిలో ఏదో తెలియని మృగం దాగుందని అమ్ముకు మెల్లగా అర్థమవుతుంది. ఆమె కన్నవారికీ ఈ విషయం తెలుస్తుంది. ఓ పిల్లనో, పిల్లాడో పుడితే అన్నీ సర్దుకుంటాయని తన తల్లి తనకు చెప్పిందని అముద అమ్మ ఆమెతో అంటుంది. కానీ, భర్త ఈసడింపులు భరిస్తూ జీవించనక్కరలేదనీ తల్లి చెబుతుంది. అముద మాత్రం భర్త ఎంతగా కొట్టినా, తిట్టినా భరిస్తూ వస్తుంది. అమ్ము గర్భవతి అవుతుంది. అయితే తిండితిప్పలు సరిగా లేని అమ్ము గర్భవతి కాదని, ఆమె ఆరోగ్యం బాగుండాలని డాక్టర్ అంటుంది. పిల్లలు కావాలనుకుంటే సరిపోదు, భార్యను ముందు బాగా చూసుకోండనీ సలహా ఇస్తుంది డాక్టర్. భర్త టార్చర్ భరించలేని అమ్ము డిఐజీకి అతనిపై ఫిర్యాదు చేయాలను కుంటుంది. భర్త కళ్ళలో భయం చూసి, తాను సంతృప్తిగా వెళతానని, అమ్ము తనకు పరిచయమున్న భర్తతో పాటు పనిచేసే లేడీ ఇన్ స్పెక్టర్స్ తో అంటుంది. ప్రభు అనే నేరస్థుడు చెల్లెలి పెళ్ళికోసమని పెరోల్ పై విడుదలై వస్తాడు. రూల్స్ ప్రకారం అతను రవి పోలీస్ స్టేషన్ లోనే రోజూ సంతకం పెట్టాల్సి వస్తుంది. రవికి లంచ్ తీసుకు వచ్చిన అమ్ముతో మాట కలుపుతాడు ప్రభు.
ప్రభును కూడా రవి పలు విధాలా టార్చర్ కు గురి చేస్తాడు. ప్రభు చెల్లెలు అతణ్ణి అసహ్యించుకుంటూ ఉంటుంది. ప్రభు పెరోల్ కేన్సల్ చేయమని రవి పై అధికారులకు ఫ్యాక్స్ పంపిస్తాడు. దాంతో ప్రభు, రవిపై చేయి చేసుకుంటాడు. అతణ్ణి పోలీసులు చితకబాదుతారు. అదే సమయంలో డిఐజీ ఆ పోలీస్ స్టేషన్ కే ఇన్ స్పెక్షన్ కు వస్తున్నాడని తెలుస్తుంది. ప్రభును కాళ్ళు చేతులు కట్టేసి లోపల వేస్తారు. ఇవన్నీ లంచ్ తీసుకు వచ్చిన అమ్ము చూస్తుంది. డిఐజీ వచ్చే సరికి, అమ్మును కూడా ప్రభు ఉన్న గదిలోకి తోస్తాడు రవి. ప్రభు తప్పించుకోవడానికి తన వద్ద ఓ ప్లాన్ ఉందని చెబుతుంది అమ్ము. అతను తప్పించుకుంటాడు. ప్రభు కోసం గాలింపు మొదలవుతుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రభును ఏం చేశారో చెప్పండంటూ అతని బంధువులు ధర్నా చేస్తారు. డిఐజీ పోలీసులపై యాక్షన్ తీసుకుంటానని అంటాడు. ప్రభును తమ క్వార్టర్స్ లోనే ఓ చోట భద్రంగా దాచి పెడుతుంది అమ్ము. ప్రభు కోసం భర్త పడే ఆందోళన చూసి నవ్వుకుంటుంది అమ్ము. ప్రభుకోసం అతడిని అసహ్యించుకొనే చెల్లెలు సైతం ధర్నా చేయడంతో అతను మారిపోతాడు. అమ్ము వల్లే తన చెల్లి పెళ్ళి చూడగలిగానని, డిఐజీ ముందు సరెండర్ కావడానికి వెళ్తున్నానని, మధ్యలో తనకు ఏం జరిగినా దానికి ఇన్ స్పెక్టర్ రవి కారకుడని చెప్పి వీడియోలో చెబుతాడు ప్రభు. ఆ తరువాత ఏమయింది? అమ్ము జీవితం ఎటు పోయింది అన్నదే మిగిలిన కథ.
అమ్ముగా ఐశ్వర్య లక్ష్మి జీవించింది. రవిగా నవీన్ చంద్ర, ప్రభుగా బాబీ సింహ ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు సైతం తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా మొత్తానికి “తోలు బొమ్మల నాటకం…” అంటూ సాగే పాటనే కీలకం. ప్రథమార్ధం నసగా అనిపిస్తుంది. ప్రభు పాత్ర ఎంటర్ అయిన తరువాతే కథ వడిగా సాగుతుంది. దర్శకుడు చారుకేశ్ శేఖర్ ఎక్కడో బాగా తనకు తెలిసిన అంశాలతోనే ఈ చిత్రం రూపొందించారని పిస్తుంది. అందుకే కాబోలు సినిమాకు ముందుగానే ‘ఇందులోని పాత్రలు కల్పితాలు, ఎవరినీ ఉద్దేశించినవి కావు’ అని ప్రకటించారు. ఫస్టాఫ్ భరించలేకపోతే, రిమోట్ కు పని చెప్పవచ్చు. అనేక చోట్ల ఈ నాటికీ అబలలపై అఘాయిత్యం చేస్తోన్న భర్తల అసలు ముసుగు తొలగించి చూపే ఇలాంటి కథలు సదరు బాధితులను ఆకట్టుకోగలవు.
ప్లస్ పాయింట్స్:
– డొమెస్టిక్ వయలెన్స్ పై కథ కావడం
– అలరించిన ఐశ్వర్య లక్ష్మి నటన
– దర్శకుని ప్రతిభ
మైనస్ పాయింట్స్:
– నస పెట్టే ప్రథమార్ధం
– పదే పదే టార్చర్ పెట్టే సీన్స్
– అంతగా అలరించని పాటలు
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: అమ్మో… అమ్ము!