Aha Naa Pellanta Review: యంగ్ హీరో రాజ్ తరుణ్ సైతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేశాడు. అతను నటించిన తాజా వెబ్ సీరిస్ ‘ఆహ నా పెళ్ళంట’ ఈ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే… ఇందులో రాజ్ తరుణ్ సరసన రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ హీరోయిన్ గా నటించింది. బోలెడన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్ తో సాగిన ఈ వెబ్ సీరిస్ కు ‘ఏబీసీడీ’ ఫేమ్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సూర్య రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా దీన్ని ప్రొడ్యూస్ చేశారు.
స్కూల్ లో చదువుకుంటున్నప్పుడే సీతాకళ్యాణం నాటికలో ఓ అమ్మాయికి ‘ఐ లవ్ యు’ చెప్పి తండ్రి నారాయణ (హర్షవర్థన్) చేతిలో దెబ్బలు తింటాడు శ్రీను (రాజ్ తరుణ్). అప్పటి నుండి జీవితంలో ఎప్పుడూ అమ్మాయిల వైపు కన్నెత్తి చూడనని తండ్రి మీద ఒట్టు వేస్తాడు. అమ్మాయిల వెంట పడటం తప్పితే, ఈ కుర్రాడు అన్ని తుంటరి పనులూ చేస్తుంటాడు. పొరపాటున అతను ఎవరైనా అమ్మాయి వైపు చూస్తే చాలు తండ్రికి ఏదో ఆపద సంభవిస్తుంది. అలాంటి శ్రీను బుద్ధిమంతుడిలా పెద్దలు కుదర్చిన పెళ్లికి అంగీకరిస్తాడు. సుధ (దీపాలి శర్మ)తో అతని పెళ్ళి కుదురుతుంది. పెళ్ళి పీటల మీద శ్రీను కూర్చున్న కొద్ది సేపటికే, పెళ్ళికూతురు జంప్ అయిందని తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఆమె స్నేహితురాలు మహ (శివాజీ రాజశేఖర్) హస్తముందని కాబోయే మావగారు (పోసాని) చెబుతాడు. తన పెళ్ళి చెడగొట్టిన మహా మీద శ్రీను ఎలా కక్ష తీర్చుకున్నాడు? ఆ క్రమంలో ఆమెతోనే ఎలా ప్రేమలో పడ్డాడు? అనేది ఈ వెబ్ సీరిస్ కథ.
ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సీరిస్ ఇది. ఒక్కొక్కటి సుమారు అరగంట నిడివి ఉంది. ప్రతి ఎపిసోడ్ చివర తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కలిగేలా దర్శకుడు సంజీవ్ రెడ్డి జాగ్రత్త పడ్డారు. అంతేకాదు.. ఓ సినిమాను తీసినట్టుగానే భారీగా దీన్ని తెరకెక్కించారు. నేపథ్య గీతాలతో సరదాగా ఇది సాగిపోయింది. ఒకటి రెండు ఎపిసోడ్స్ లో కాస్తంత ల్యాగ్ ఉన్నా.. ఆ తర్వాత వచ్చే కామెడీతో దాన్ని కవర్ చేశారు. నిజానికి దీన్ని మరింత పకడ్బందీగా ఎడిట్ చేసి, థియేటర్లలో సినిమాగా రిలీజ్ చేసి ఉంటే తప్పకుండా ప్రేక్షకాదరణ పొంది ఉండేది. ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ నటించిన సినిమాలు పెద్దంత ఆడలేదు. ఆ లోటును ఇది తీర్చేసి ఉండేది. చిత్రం ఏమంటే.. ఈ వెబ్ సీరిస్ ఐదో ఎపిసోడ్ లో కానీ హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ అనేది పుట్టదు. అంతేకాదు.. చివరి ఎపిసోడ్ ముందు ఊహించని ట్విస్ట్ ఇచ్చి, ఇక వీళ్ళ పెళ్ళి జరిగినట్టే అనిపించేలా చేశారు. కానీ గమ్మత్తుగా చివరి ఎపిసోడ్ లో కేవలం ఇరవై నిమిషాల్లో కథను సుఖాంతం చేసేశారు. ఈ విషయంలో దర్శకుడు సంజీవ్ రెడ్డి చాతుర్యాన్ని అభినందించాలి.
రాజ్ తరుణ్ డిజిటల్ మీడియంలోకి రావడం ఇదే మొదటిసారి కాగా, శివానీ రాజశేఖర్ నటించిన ‘అద్భుతం’, ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ సినిమాలు ఇప్పటికే ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే ఆమె వెబ్ సీరిస్ లో నటించడం ఇదే మొదటి సారి. తాను సైతం చక్కటి వినోదాన్ని పండించగలనని శివానీ దీనితో నిరూపించుకుంది. హీరో తండ్రిగా హర్షవర్థన్ చక్కటి నటన ప్రదర్శించాడు. ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది!? ఆమె మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకుంది. మొదటి ఎపిసోడ్ లో పెళ్ళిళ్ళ పేరయ్యగా భద్రమ్, ఆ తర్వాత ఎపిసోడ్స్ లో రవి శివతేజ, గెటప్ శ్రీను, తాగుబోతు రమేశ్, రఘు కారుమంచి.. క్లయిమాక్స్ లో రాజ్ కుమార్ కసిరెడ్డి చక్కటి వినోదాన్ని అందించారు. రంగస్థల నటుడు మహ్మద్ అలీ బేగ్ ఇందులో ‘మిస్టర్ కె’ గా ఓ కీ-రోల్ ప్లే చేశారు. ఇతర ప్రధాన పాత్రలను పోసాని, లిరీషా, వడ్లమాని శ్రీనివాస్, మధునందన్, దీపాలీ శర్మ, కృతికా సింగ్, త్రిశూల్ జీతూరి తదితరులు పోషించారు.
షేక్ దావూద్ అందించిన కథలో పెద్దంత కొత్తదనం లేకపోయినా కథనం ఆకట్టుకునేలా సాగింది. కళ్యాణ్ రాఘవ్ సంభాషణలు హిలేరియస్ గా ఉన్నాయి. నగేష్ బన్నెల సినిమాటోగ్రఫీ, జాదుహ్ శాండి నేపథ్య సంగీతం బాగున్నాయి. ప్రముఖ రచయిత, దర్శకులు జంధ్యాల అప్పట్లో తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘అహ నా పెళ్ళంట’ పేరు దీనికి పెట్టుకున్నందుకు… దాన్ని చెడగొట్టకుండా, క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ వెబ్ సీరిస్ ను రూపొందించడం అభినందించదగ్గది. వీకెండ్ లో హాయిగా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్: 3.25 / 5
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఆకట్టుకునే సంభాషణలు, కథనం
సాంకేతిక నిపుణుల పనితనం
మైనెస్ పాయింట్స్
అక్కడక్కడా డ్రాప్ అయ్యే గ్రాఫ్!
ఊహకందే క్లయిమాక్స్
ట్యాగ్ లైన్: పెళ్ళి భోజనం!