Mistake Movie Review:చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఇప్పుడు నచ్చితే ఎలాంటి సినిమాలు ఆదరించడానికి అయినా ప్రేక్షకులు సిద్ధంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకమంది నటులు దర్శకులుగా మారి తాము చెప్పాలనుకున్న కథలు చెప్పేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మలపాటి దర్శకత్వంలో మిస్టేక్ అనే సినిమా వచ్చింది. అభినవ్ సర్దార్ నటిస్తూ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
హెయిర్ స్టైలీస్ట్ ఆగస్త్య (బిగ్ బాస్ అజయ్ కతుర్వార్), పూజారి దేవదాస్ అలియాస్ దేవ్ (సుజిత్ కుమార్), కార్తీక్ (తేజ ఐనంపూడి) ముగ్గురూ ఒకే గదిలో ఉండడంతో వీరందరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఈ ముగ్గురూ ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో ఉంటారు. ఆగస్త్య.. డీసీపీ కూతురు మిత్ర (ప్రియ)తో, దేవ్ ఏమో పార్వతి అలియాస్ పారు(నయన్ సారిక)తో ముంబైలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అయిన స్వీటీ (తానియ కల్ల్రా)తో కార్తీక్ ప్రేమలో ఉంటారు. ఈ ప్రేమికులు అందరూ హ్యాపీగా సమయం గడిపేస్తున్న క్రమంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇబ్బంది ఏర్పడడంతో ఒక వారం పాటు సిటీకి దూరంగా తమ ప్రియురాళ్లను తీసుకుని జంగిల్ కి వెళ్లారు. అయితే అంతా కలిసి ఫారెస్ట్‌కి వెళ్తుంటే మార్గ మధ్యలో అనుకోని సమస్య ఏర్పడుతుంది ఆ సమస్య నుంచి ఈ మూడు జంటలు తప్పించుకుని అడవిలోకి వెళ్ళారా? వెళ్ళాక అక్కడ వారికి ఎదురైన సమస్యలేంటి? అసలు అభినవ్ సర్దార్ ఎవరు? ఆ వ్యక్తికి ఈ మూడు జంటలకు సంబంధం ఏంటి? అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ:
సాధారణంగా ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ తరహా సినిమాలు ఎక్కువయ్యాయి. ఓటీటీ కంటెంట్ కి బాగా జనం అలవాటు పడిపోవడంతో వారిని మెప్పించాలంటే ఏదో ఒక కొత్త పాయింట్ తో ఆకట్టుకోక తప్పదు. ఇక ఈ మిస్టేక్ సినిమా కూడా ప్రారంభమైనప్పుడు రొటీన్ సినిమాలాగే అనిపిస్తుంది కానీ ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సినిమా మీద ఒక్కసారిగా ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ లో రొటీన్ సినిమానే కదా అనుకున్న వారందరూ సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం చాలా ఎక్సైట్ అవుతారు. సినిమా పేరుకు జస్టిఫై చేస్తూ చిన్న మిస్టేక్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అలాంటి మిస్టేక్ చేస్తే కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తే కొన్నిసార్లు మాత్రం అదృష్టం తెచ్చి పెడుతుంది అన్న కోణంలో ఒక చిన్న లైన్ ము ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. కొరియోగ్రాఫర్ గా అనేక సినిమాలు చేసిన భరత్ కి దర్శకుడిగా ఇది మొదటి సినిమానే అయినా ఆద్యంతం ఇంట్రెస్టింగా సినిమా కథని నడిపించడంలో ఆయన కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ ఆఫ్ నుంచి సస్పెన్స్ క్రియేట్ చేసి చివర్లో ట్విస్టులు రివీల్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సస్పెన్స్ క్రియేట్ చేయడం మీద ఎక్కువగా కేర్ తీసుకుని దర్శకుడు ట్విస్టులను రివిల్ చేసే విషయంలో కూడా అంతే బలంగా రాసుకుంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది.. సినిమా ఫస్ట్ హాఫ్ మూడు జంటల ప్రేమ కథలు, వారి సమస్యలను చూపించగా సెకండాఫ్ లో సమస్యల నుంచి బయటపడేందుకు వారు ఏం చేశారు అనే విషయాన్ని చూపించారు. బోల్డ్ డైలాగులు యూత్ కి కనెక్ట్ చేసేలా ఉన్నాయి. అయితే ఒకానొక దశలో సినిమా సాగదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో తర్వాత ఏం జరగబోతుందో అనే విషయం ఈజీగా అర్థమయిపోతూ ఉండటం కొంతమైనస్. ఈ సినిమాలో కామెడీ కొంతవరకు పర్వాలేదనిపించింది కానీ తర్వాత రొటీన్ అయిపోయింది అనిపిస్తుంది ఈ క్రమంలో ఈ కామెడీ మీద మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. తీసుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా ఫలితం మరింత బాగుండేది.
ఎవరు ఎలా చేశారు అంటే
ముందుగా నటీనటుల విషయానికి వస్తే మూడు ప్రేమ జంటలు అగస్త్య(అజయ్ కథుర్వర్)- మిత్ర(ప్రియా),దేవ్(సుజిత్ కుమార్)-పార్వతి(నయన్ సారికా), కార్తిక్(తేజ ఐనంపూడి)-స్వీటి(తనియా కార్లా) తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దేవ్ పాత్ర నవ్వించేలా , అగస్త్య పాత్ర స్టయిలీష్‌గా ఉండగా కార్తిక్ పాత్రధారి తేజ అమాయకుడిగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్లు గ్లామర్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నిర్మాతగా సినిమా నిర్మించి కిల్లర్ పాత్రలో కనిపించిన అభినవ్ సర్దార్ పాత్ర సినిమా మొత్తం మీద హైలైట్. ఆయన సీన్లు భయపెడతాయి. కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నంలోనే చాలా వరకు సక్సెస్ అయ్యారు. తీసుకున్న పాయింట్ బాగుంది కానీ కథ, కథనాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రాఫర్ హరి జాస్తి కెమెరా పనితనం చాలా ఫ్రేమ్స్ లో కనిపించింది. సంగీతం ఓకే , పాటలు పెద్దగా వర్కౌట్ అవలేదు కానీ బీజీఎం సినిమాకు హైలెట్ అవుతుంది. నటుడే నిర్మాత అయితే ఇక నిర్మాణ విలువలు గురించి చెప్పాల్సిందేముంది.
ఫైనల్‌గా మిస్టేక్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికి పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్