గతంలో మధురం అనే షార్ట్ ఫిలిం సహా పలు షార్ట్ ఫిలిమ్స్, మను అనే సినిమా డైరెక్టర్ చేసిన ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో ఎనిమిది వసంతాలు అనే సినిమా రూపొందింది. మాడ్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన అనంతిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, ప్రమోషనల్ కంటెంట్ కంటే ఎక్కువగా దర్శకుడు ఫణీంద్ర మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల కారణంగా సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కావాల్సి ఉండగా, ఒక రోజు ముందుగానే మీడియాకి ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా యూనిట్. మరి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం పదండి.
కథ:
శుద్ధి అయోధ్య (అనంతిక) తన తండ్రి చనిపోయిన బాధలో ఉండగా, ఆ బాధ నుంచి బయటపడటం కోసం రచయిత్రిగా మారుతుంది. అలా వరుసగా పుస్తకాలు రాస్తూ, ట్రావెలింగ్ చేస్తూ ఉండే ఆమెకు కరాటే అంటే కూడా చాలా ఇష్టం. తన గురువు దగ్గర ఒకపక్క కరాటే నేర్చుకుంటూ, మరోపక్క వీలు కుదిరినప్పుడల్లా ఆమె ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మడం కోసం ఊటీ వచ్చిన వరుణ్ (హను రెడ్డి) శుద్ధితో ప్రేమలో పడతాడు. అతని కేరింగ్ చూసి శుద్ధి కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లు ఓపెన్ తర్వాత, వరుణ్ అమెరికా వెళ్లడానికి సిద్ధమై శుద్ధిని మోసం చేస్తాడు. అలా హార్ట్ బ్రేక్ అయిన క్రమంలో శుద్ధి తన లైఫ్‌లో బిజీ అవుతుంది. అలాంటి ఆమెకు సంజయ్ (రవితేజ) పరిచయమవుతాడు. కేవలం పరిచయంగా మొదలైనా అది ప్రేమకు దారితీస్తుంది. అయితే సంజయ్ మీద ఉన్న ప్రేమను బయటపెట్టకుండా, శుద్ధి వరుణ్ అనే మరో యువకుడితో పెళ్లికి రెడీ అవుతుంది. అలా ఎందుకు చేసింది? సంజయ్, శుద్ధి ఒకటయ్యారా లేదా? చివరికి ఏం జరిగింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఫణీంద్ర దర్శకత్వంలో వచ్చిన షార్ట్ ఫిలిమ్స్, అలాగే ఆయన చేసిన మను అనే సినిమా చూసిన వారందరికీ ఇతనిలో ఏదో విషయం ఉంది, కానీ ఎందుకో దాన్ని పూర్తిస్థాయిలో తెరమీదకు తీసుకురావడంలో వెనకపడ్డాడని ఫీలింగ్ కలుగుతుంది. దాదాపుగా అతని సినిమాలు, రచనలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఈ సినిమా కూడా అందుకు ఏమీ మినహాయింపు కాదు. నిజానికి తెలుగు ప్రేక్షకులకు, తెలుగు తెరకు ప్రేమ కథలు కొత్త ఏమీ కాదు. ప్రతి వారం నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతుంటే, అందులో దాదాపుగా రెండు మూడు ఈ ప్రేమ కథలుగానే ఉంటాయి. అందులో ఫణీంద్ర సినిమాలో ఉన్న తేడా ఏంటి అని అడిగితే, కచ్చితంగా అతని పొయెటిక్ అలాగే ఒక ప్లెజెంట్ ఫీల్ తో చేసే నేరేషన్ అని చెప్పొచ్చు. సినిమా ఓపెనింగ్ సీన్ నుంచి ఎండ్ క్రెడిట్ పడే వరకు, తన సినిమాని ఫణీంద్ర ఒకరకంగా శిల్పాన్ని చెక్కినట్లు భావన కలుగుతుంది. ప్రమోషన్స్‌లో ఆడియన్స్ మీద లేదా సినిమా రివ్యూల మీద అతని మాటలు పక్కనపెడితే, ఈ సినిమాలో అతని హానెస్టీ కనిపించింది. కొన్నిచోట్ల సంభాషణలు మరీ ఫైలాసఫికల్‌గా అనిపించినా, ఇద్దరు రచయితలు మాట్లాడుకుంటే అలానే ఉంటుంది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే, కొన్నిచోట్ల మరీ నిబ్బా నిబ్బీ మాటలు అనే ఫీలింగ్ కలిగినా కూడా వారి వయస్సు రీత్యా అది కూడా లాజికల్‌గానే అనిపిస్తుంది. మొత్తం మీద ఫణీంద్ర నర్సెట్టి ఈ సినిమాతో ప్రేమకు ముగింపు లేదు, అలాగే ప్రేమకు కండిషన్స్ కూడా ఉండవు అని చెప్పాలని అనిపించినట్లు ప్రేక్షకులకు అనిపిస్తుంది. అయితే సినిమా నిడివి చాలా తక్కువే ఉన్నా, ఎందుకో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. స్లో నేరేషన్ కారణంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే అవునని చెప్పలేము. కానీ ప్రేమ కథలు, పొయెటిక్ ప్రేమ కథలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చొచ్చు.
ఇక ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించిన అనంతిక తన పాత్రలో ఒదిగిపోయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో తేలిపోయినా, మిగతా అన్ని చోట్ల తనదైన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మ్యాజిక్ చేసింది. హను రెడ్డితో పాటు రవి సినిమాకి తగ్గట్టు నటించారనడంలో సందేహం లేదు. ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అయితే తెలుగువారికి పెద్దగా పరిచయం లేని ముఖాలు కావడంతో త్వరగా పాత్రలకు కనెక్ట్ కావడం కాస్త ఇషర్షందికరం. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, హేషం అందించిన సంగీతం సినిమాకి చాలా ప్లస్ పాయింట్. దానికి తోడు సినిమాటోగ్రాఫీ అలాగే చాలా ఫ్రేమ్స్ సెట్ చేయడంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ అభినందనీయం. నిడివి తక్కువగానే ఉన్నా, ఇంకా కాస్త ట్రిమ్ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఫైనల్‌గా: ఈ ఎనిమిది వసంతాలు లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి నచ్చుతుంది. అలా అని అందరి కప్ ఆఫ్ టీ అనలేం.