Akshat Greentech : భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రానిక్స్ మిషన్‌కు తెలంగాణ రాష్ట్రం కీలక మద్దతుగా నిలవనుంది. ఈ దిశగా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ విస్తరణకు మరొక కీలక ముందడుగు పడింది. లండన్, తెలంగాణకు చెందిన కైలాస్ ఫ్యామిలీ నేతృత్వంలో ఉన్న అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు చేసింది.
ఈ ఒప్పందం ద్వారా అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థ తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించనుంది. దశలవారీగా సుమారు రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యోచనలో సంస్థ ఉంది. ఈ పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘భారతదేశ ఎలక్ట్రానిక్స్ మరియు కాంపోనెంట్ తయారీ పథకం’ మార్గదర్శకాల ప్రకారం వినియోగించనున్నట్లు వెల్లడించింది.
ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారే ప్రధాన లక్ష్యంగా అక్షత్ గ్రీన్‌టెక్ తెలంగాణలో యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా మల్టీ లేయర్ పీసీబీలు, కాపర్ క్లాడ్ లామినేట్లు, సెన్సార్లు, యాంటెనాలు, ట్రాన్స్‌డ్యూసర్లు వంటి అత్యాధునిక కాంపోనెంట్లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలో హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం మరింత బలోపేతం కానుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
భారీ పెట్టుబడులతో అమలుకాబోయే ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధి వేగం పెరగడంతో పాటు, యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీలో తెలంగాణను దేశంలోనే ఒక ప్రముఖ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక మైలురాయిగా నిలవనుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.