ఆహ్వానాలు వెళ్లాయి సరే..! సెప్టెంబర్ 2నాటి YSR సంస్మరణ సభకు తెలంగాణ నుంచి హాజరయ్యేది ఎవరు? ఎంత మంది వెళ్తారు? మారిన రాజకీయ వాతావరణంలో నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉన్న నాయకులు.. ఆహ్వానాన్ని మన్నిస్తారా?
ఆహ్వానాలు అందుకున్న తెలంగాణ నేతలు తేల్చుకోలేకపోతున్నారా?
సెప్టెంబర్ 2. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈ తేదీపైనే ఎక్కువ మంది ఫోకస్ పెట్టారు. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి కావడంతో.. ఆ రోజున హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సభ చర్చగా మారింది. నాడు వైఎస్ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారికి.. సన్నిహితులకు స్వయంగా YS విజయమ్మ నుంచే ఆహ్వానాలు వెళ్లాయి. నాడు వైఎస్ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోయారు. టీఆర్‌ఎస్, బీజేపీల్లో కీలక పొజిషన్లో ఉన్నారు కొందరు. ప్రస్తుతం తెలంగాణలో షర్మిల ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. కుమార్తె పార్టీకి విజయమ్మ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో విజయమ్మ నుంచి వచ్చిన ఆహ్వానాలపై నాయకులు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. అందుకే తెలంగాణ నాయకుల్లో ఎంత మంది సంస్మరణ సభకు వెళ్తారు? ఎవరు దూరంగా ఉంటారన్నది చర్చగా మారింది.
టీఆర్‌ఎస్‌లో ఉన్నవాళ్లు సభకు వెళ్లకపోవచ్చా?
అప్పట్లో YS కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మినిస్టర్‌గా ఉన్నారు. మరో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్. ఇంకో మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. నాడు మంత్రులుగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు, ఫరీదుద్దీన్, రెడ్యానాయక్‌లు కూడా గులాబీ శిబిరంలోనే కొనసాగుతున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్పీకర్‌గా పనిచేసిన కేఆర్ సురేష్‌రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు. వీరందరికీ ఆహ్వానాలు వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్‌లో సేఫ్ జోన్ చూసుకున్న వీరంతా ఇప్పుడు ధైర్యం చేసి సెప్టెంబర్ 2 మీటింగ్ వెళ్తారా అన్నదే ప్రశ్న. సంస్మరణ సభకు వెళ్లకూడదనుకున్నవాళ్లు రకరకాల కారణాలను అన్వేషిస్తున్నారట. ముఖ్యంగా టీఆర్ఎస్‌లో ఉన్నవారు అటువైపు వెళ్లకపోవచ్చు అని చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఎంతమంది హాజరవుతారు?
నాడు వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు. సెప్టెంబర్ 2 సంస్మరణ సభలో డీకే కనిపిస్తారా? వెళ్తే ఆ సందర్భంగా ఎదురయ్యే ప్రశ్నలకు ఆమె సమాధానం ఏంటనే చర్చ మొదలైంది. ఇక కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న నాయకులకు కొంత ఇరకాట పరిస్థితి ఉందని సమచారం. కాంగ్రెస్ పార్టీ YSను తమ పార్టీ నేతగానే చూస్తోంది. అలాంటప్పుడు HICCలో జరిగే కార్యక్రమానికి ఎంతమంది కాంగ్రెస్ నేతలు హాజరవుతారన్నది ఉత్కంఠగా మారింది.
సభకు వెళ్లేవారిపై టీఆర్‌ఎస్ గురి పెడుతుందా?
నాడు వైఎస్ మంత్రివర్గంలో ఉన్న జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిన్నారెడ్డి తదితరులు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. వీరందరికీ సెప్టెంబర్ 2 సభ ఆహ్వానాలు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరు వెళ్తారు.. ఎవరు డుమ్మా కొడతారు అన్నది ప్రశ్నే. నాటి వైఎస్ కేబినెట్‌లో ఉన్నవారు తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోలేదని టీఆర్‌ఎస్ తరచూ విమర్శలు చేస్తోంది. ఇప్పుడు మీటింగ్‌కు వెళ్లే తెలంగాణ నేతలపై గులాబీ పార్టీ మరింత గురిపెట్టే వీలు ఉందని టాక్. అందుకే అందరి చూపూ సెప్టెంబర్ 2 హైటెక్స్‌పై పడింది.