అలనాటి అందాల తారలు. రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. మళ్లీ సైలెంటయ్యారు. ఇప్పుడు మళ్లీ పొలిటికల్ పిక్చర్ లో తళుక్కుమనాలని భావిస్తున్నారా? ఓ జాతీయ పార్టీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారా?
మాజీ ఎమ్మెల్యే జయసుధ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? జాతీయ పార్టీ నేతలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారా? జయసుధ పార్టీలో చేరేందుకు షరతులు పెట్టారా? తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమేనా?
సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలను కుంటున్నారు. భర్త చనిపోయిన తర్వాత జయసుధ ఇటు రాజకీయాలకు, అటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు బలమైన నాయకులను పార్టీల్లో చేర్చుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజా సంఘాల నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఐఏఎస్ లతో పాటు సినీ ప్రముఖులతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. పార్టీలో చేరాలని కమలం నేతలు వారిని కోరుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జయసుధ కాంగ్రెస్ పార్టీ తరపున 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించింది. ఆ తరువాత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వచ్చారు. రాష్ట్ర విభజన తరువాత జయసుధ ఏపీ రాజకీయాలపై దృష్టి సారించారు. దీంతో 2016 జనవరి 17న ఆమె టీడీపీలో చేరారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలతో జయసుధ టీడీపీని వీడారు. 2019 మార్చిలో జయసుధ, ఆమె తనయుడు వైసీపీలో చేరారు. వైసీపీలో ఏదైనా మంచి పదవితో పాటు నామినేటెడ్ పోస్టు వస్తుందని జయసుధ భావించారు. కానీ వైసీపీలో పెద్దగా జయసుధ చరిష్మా పనిచేయక పోవడంతో కొంత కాలంగా ఆమె ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలతో పాటు వీఐపీలతో కూడా బీజేపీ తెలంగాణ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీలో చేరే విషయమై ఆమె స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరనున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరిగిన సమయంలోనే బీజేపీ జాతీయ నాయకులు జయసుధతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా ఢిల్లీ పెద్దల నుంచి ఎలాంటి హామీ లేకుండా పార్టీలో చేరే అవకాశం లేదని ఆమె తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో పదవితోపాటు కేంద్రంలో పదవి కోరుతున్నారు. ఆర్థికంగా తాను ఖర్చు పెట్టలేనని, మీరే భరించాలని పార్టీ నేతల ముందు చెప్పినట్లు సమాచారం. అయితే బీజేపీలో చేరికపై తానేమి పార్టీ నేతలను అడగ లేదని, వాళ్లే రమ్మంటున్నారని జయసుధ సన్నిహితులకు చెబుతున్నారట.
ఇటీవల పార్టీలో చేరికలపై ఆంక్షలు తొలగించడంతో మరోసారి బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యేతో చర్చలు జరుపుతున్నారు. త్వరలో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండ బోతున్నాయని…ఈ తరుణంలో జయసుధ కూడా చేరేలా బీజేపీ నాయకులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నట్లు చర్చ జరుగుతోంది.ఇటు ప్రత్యక్ష రాజకీయాలు, అటు సినిమాల్లో మళ్ళీ కొనసాగాలని జయసుధ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు పార్టీలో చేర్చుకునే విషయంలో జయసుధకు అభయం ఇస్తారా? లేదా వేచి చూడాలి.
మరోవైపు మరో అలనాటి తార జయప్రద కూడా పుట్టింటి రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆలోచిస్తున్నారట. ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ లో ఒక వెలుగు వెలిగిన జయప్రద, ఏపీలో మాత్రం క్రియాశీలకంగా లేరు. ఇటీవల రాజమండ్రి బీజేపీ సభలో కనిపించిన జయప్రద, తిరిగి కాషాయ పార్టీలో క్రియాశీలకం కావాలని ఆలోచిస్తున్నారట. మొదట టీడీపీతో రాజకీయ ప్రయాణం మొదలైనా, తర్వాత సమాజ్ వాదీలోకి వెళ్లారు. యూపీలోనే ఎంపీ అయ్యారు. అయితే, తిరిగి ఏపీ రాజకీయాల్లోచక్రం తిప్పాలని భావిస్తున్నట్టు, ఆమె తన సన్నిహితులతో చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే, ఏపీ బీజేపీలో ప్రాధాన్యత కలిగిన పాత్రలో పోషించబోతున్నారు జయప్రద.