ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న నేతలకు బీజేపీ దిమ్మతిరిగే టెస్ట్ పెట్టిందా? ఆ పరీక్షలో పాస్ కాకపోతే టికెట్ గ్యారెంటీ లేదా? దీంతో నిన్నటి వరకు తమకే టికెట్.. నేనే అభ్యర్థిని అని విర్రవీగిన నేతలు.. ప్రస్తుతం పక్క చూపులు చూస్తున్నారా? ఇంతకీ ఆశావహులకు బీజేపీ పెట్టిన ఎగ్జామ్ ఏంటి? లెట్స్ వాచ్..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మెజారిటీ స్థానాలను కైవశం చేసుకోవాలని చూస్తోంది బీజేపీ. ఇందుకు తగ్గట్టుగా కార్యక్రమాల నిర్వహణ.. పార్టీ పరంగా సంస్థాగత కూర్పులో స్పీడ్ పెంచింది. ఇదే సమయంలో టికెట్ ఆశిస్తున్న బీజేపీ నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. ఎవరికి వారు తామే క్యాండిడేట్స్‌మని ప్రచారం చేసేసుకుంటున్నారు కూడా. అయితే ఎమ్మెల్యే సీటుపై ఎవరికీ గ్యారెంటీ లేదని బీజేపీ తేల్చిచెప్పడంతో ఆశవాహుల గొంతులు పచ్చివెలక్కాయ పడ్డట్టు అయ్యింది. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులకు సైతం టికెట్ నో గ్యారెంటీ అని చెప్పేసిందట పార్టీ.
నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలను మినహాయిస్తే.. మిగతా చోట్ల ఆశావహులకు పార్టీ చెక్ పెడుతోంది. ఆర్మూర్‌లో బీజేపీ ఇంఛార్జ్‌కి పొమ్మన లేక పొగపెడుతున్నారట. ఇక్కడ నిజామాబాద్ అర్బన్ నాయకులు చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. బాల్కొండలో వలస నేతలు బీజేపీ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకుని పర్యటనలు చేస్తున్నారు. ఇంతలో బాల్కొండలో మరో పార్టీకి చెందిన నేత కాషాయ కండువా కప్పుకొంటారని.. ఆయనకే ఛాన్స్ ఇవ్వొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అయితే నియోజకవర్గంలో పనిచేయాలని.. ప్రచారం చేసుకోవాలని.. ప్రజాబలం ఎవరికి ఉంటే వాళ్లకే టికెట్ ఇస్తామని పార్టీ పెద్దలు తేల్చిచెప్పడంతో మీమాంశలో పడ్డారట నేతలు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కష్టపడి పనిచేస్తాం సరే.. చివరి నిమిషంలో వేరెవరికైనా బీజేపీ టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏంటి అని కొందరు అనుమానిస్తున్నారట. ఈ డోలాయమానంలో ఉండేకన్నా.. అప్పటి వరకు వేచి చూడకుండా ఇప్పుడే సర్దుకుంటే బెటర్ కదా అని పావులు కదుపుతున్నారట. ఇదే సమయంలో నియోజకవర్గంలో ఏ పార్టీ నాయకుడికి ఎంత బలం ఉంది? ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే నెగ్గుకు వస్తారు? అనే అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. సర్వే గురించి ఆలస్యంగా తెలుసుకున్న ఆశవహులు కొందరు తల పట్టుకుంటున్నారట. ఇప్పటికిప్పుడు ప్రజల అటెన్షన్ తీసుకురావడం సాధ్యమా? బలప్రదర్శనకు దిగితే చేతి చమురు ముందే వదిలిపోతుందని బెంగ పెట్టుకున్నారట. పార్టీపై నమ్మకం పెట్టుకున్న మరికొందరు నాయకులు మాత్రం.. కార్యక్రమాల స్పీడ్ పెంచుతున్నారు. అధినాయకత్వం దృష్టిలో పడాలంటే.. ఫీల్డ్‌లో ఉండాలనే లెక్కలు వేసుకుంటున్నారట.
ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునేది ఎవరో? గెలుపు గుర్రాలుగా ముద్ర పడేది ఎవరికో? కానీ.. బీజేపీ పెట్టిన పరీక్ష మాత్రం అగ్నిపరీక్షగా మారిందని కమలనాథులు వాపోతున్నారట. ప్రజాబలంపై పార్టీకి ఉన్న కొలమానం ఏంటో అని మల్లగుల్లాలు పడుతున్నారు నేతలు. మరి.. ఎన్నికల నాటికి ఎవరు పార్టీ పరీక్షలో పాస్ అవుతారో.. ఇంకెవరు మిడిల్ డ్రాప్ అవుతారో.. మరెందరు జంప్ చేస్తారో చూడాలి.