Site icon NTV Telugu

ముఖం చాటేస్తున్న ఇంఛార్జ్..? కాంగ్రెస్ సీనియ‌ర్ల గుస్సా..!

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ. పార్టీలో సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలను తప్ప.. ఎవరినైనా ఏదైనా అనేయొచ్చు. దీన్నే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. ఈ వైఖరే ఇటీవల పెద్ద తలనొప్పికి దారి తీసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మొదలుకుని.. క్రమశిక్షణ కమిటీ వరకు… రచ్చ రచ్చ అయింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాజీనామాల వరకు వెళ్లిందా వ్యవహారం. ఈ అంశంపై సీనియర్ నాయకులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారట. మాజీ మంత్రి జానారెడ్డి లాంటి వాళ్లు ప్రస్తుతం కాంగ్రెస్‌లో పరిస్థితిపై అసహనం వ్యక్తం చేశారు. మరో ఇద్దరు సీనియర్లదీ అదే పరిస్థితి. చివరకు సీనియర్లంతా కలిసి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌పై విరుచుకుపడినట్టు తెలిసింది.

జగ్గారెడ్డి-రేవంత్ మధ్య పంచాయితీ తారాస్థాయికి చేరినా.. ఇంఛార్జ్‌ ఠాగూర్‌ సరిగా స్పందించడం లేదనే అభిప్రాయంతో ఉన్నారట సీనియర్ నేతలు. అసంతృప్తితో ఉన్న వాళ్లను.. పార్టీ నాయకత్వం మీద కామెంట్స్‌చేసే వారిని పిలిచి మాట్లాడటం లేదని.. కనీసం వారి ఇళ్లకు వెళ్లి చర్చించడం లేదని గుర్రుగా ఉన్నారు సీనియర్లు. పార్టీ ఇంఛార్జ్‌ హోదాలు నెలలో మూడు రోజులు రాష్ట్రంలోనే ఉండి నాయకుల మధ్య సమన్వయం చేయడం.. బేధాభిప్రాయాలను పోగొట్టే ప్రయత్నం చేయకపోతే ఎలా అన్నది వారి వాదన. ప్రతినెలా మూడు రోజులు పార్టీకోసం కేటాయిస్తే తప్పేంటి? పార్టీ ఇంఛార్జ్‌ నేరుగా మాట్లాడితే… సమస్యలకు పరిష్కారం లభిస్తుంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. నాయకుల మధ్య సఖ్యత కుదర్చడమే ఇంఛార్జ్‌ పనిగా వాళ్లు గుర్తు చేస్తున్నారట. అయితే ఠాగూర్‌ మాత్రం.. ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు.. శ్రీనివాసన్‌లకు అప్పగించి సైలెంట్‌గా ఉంటున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి నేరుగా రావడం కంటే.. రెండు రోజుల ముందే వచ్చి నాయకులతో మాట్లాడితే బాగుంటుందనేది వారి సూచన. ఆ తర్వాతే పీఏసీలో యాక్షన్‌ ప్లాన్‌పై చర్చ చేస్తే పార్టీకి మంచిదన్నది కొందరి ఆలోచన.

అయితే పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం కేవలం కొందరు నాయకులు లేవనెత్తిన పంచాయితీలకే పరిమితం అవుతుందనే వాదన ఉంది. రాష్ట్రంలో సమస్యలు.. కార్యాచరణపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదని మండిపడుతున్నారు. ఇంఛార్జ్‌ సమయం కేటాయించక పోవడం వల్లనే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనేది టాక్. ఇంఛార్జ్‌గా వచ్చిన కొత్తలో దూకుడుగా వెళ్లినా.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అది కూడా చర్చగా మారింది. ఠాగూర్ వైఖరిలో వచ్చిన మార్పు కొందరికి అర్థం కావడం లేదట. మరి.. ఏం జరిగిందో.. ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయనకే తెలియాలి.

Exit mobile version