Site icon NTV Telugu

KCR : జాతీయపార్టీగా మారాలన్న గులాబీ పార్టీతో కలిసి నడిచేదెవరు

New Project (16)

New Project (16)

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ ఒకవైపు.. ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయపక్షాలు మరోవైపు పావులు కదుపుతున్నాయి. మమతా బెనర్జీ సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న గులాబీ పార్టీ.. హస్తినలో విపక్షాల సమావేశానికి దూరంగా ఉండటం వెనక ఉన్న మతలబుపై చర్చ జరుగుతోంది. ఇందుకు తమ కారణాలు తమకు ఉన్నాయన్నది టీఆర్ఎస్‌ నేతలు చెప్పేమాట. తాము బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సమాన దూరంలో ఉన్నామన్న సంకేతాలు పంపడంలో భాగంగానే టీఆర్ఎస్‌ ఆ నిర్ణయం తీసుకుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకోవడం సరికాదన్న అభిప్రాయంలో గులాబీ బాస్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. నేషనల్‌ పార్టీ ఏర్పాటు చేసి దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటే భవిష్యత్‌లో దేశంలో జాతీయపార్టీగా మారే టీఆర్‌ఎస్‌కు కలసి వచ్చేది ఎవరు అనే చర్చ జరుగుతోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వల్లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంది. దాంతో ఆ పార్టీలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌తో జాతీయస్థాయిలో ఎంత వరకు కలిసి వస్తాయన్నది విశ్లేషకుల ప్రశ్న. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రల్లో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాలు ఉన్నాయి.

అయితే రాజకీయల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు అంటూ ఉండబోరన్న వాదన ఉంది. ఆ సూత్రం టీఆర్ఎస్‌ విషయంలోనూ వర్తిస్తుందన్నది కొందరి మాట. ఒకసారి జాతీయ పార్టీగా మారి.. విధానాలు ప్రకటించాక.. ఇప్పుడు ఊగిసలాటలోఉన్న ఇతర పార్టీలు వైఖరి మార్చుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌కు సమాన దూరం అనే లైన్‌ను ఎస్టాబ్లిష్‌ చేసే పనిలో గులాబీ నేతలు ఉన్నారట. ఇప్పటికే వివిధ పార్టీల నేతలు.. సీఎంలతో సీఎం కేసీఆర్‌ సమావేశాలు నిర్వహించి ఉన్నారు. తమ అభిప్రాయం ఏంటో వారితో స్పష్టంగా చర్చించి ఉండటంతో.. తమకు క్లారిటీ ఉందని చెబుతున్నారు గులాబీ నేతలు. మరి..ఈ వ్యూహం టీఆర్ఎస్‌కు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

 

Exit mobile version