ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్నికల సమయంలో కలిసి సాగిన నేతలు ప్రస్తుతం చెరోదారి అయ్యారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మధ్య అస్సలు పడటం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేయబోనని బూచేపల్లి చెప్పడంతో మద్దిశెట్టికి ఛాన్స్ ఇచ్చింది పార్టీ. ఆ సమయంలో ఇద్దరి మధ్య సఖ్యత ఉంది. కానీ.. తర్వాతే మార్పు వచ్చింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. బ్యానర్లు చించివేత, శిలాఫలకాల ధ్వంసం.. పార్టీ ఆఫీసులపై దాడి.. కరపత్రాల పంపిణీ సెగలు రేపాయి. బూచేపల్లి తల్లి వెంకాయమ్మ జడ్పీ ఛైర్మన్‌గా ఉండటంతో దర్శి వైసీపీలో ప్రస్తుతం రెండు పవర్ సెంటర్లు కొనసాగుతున్నాయి.
దర్శి నగర పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో రెండు వర్గాలు శాంతించినట్టు కనిపించినా.. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల అత్యుత్సాహం బూచేపల్లి, మద్దిరెడ్డి వర్గాల మధ్య విభేదాలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ కాలేజీలో విద్యార్థులు జనసేన జెండాలు ప్రదర్శించడం.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గొడవలు చెలరేగి… పోలీసుల కేసు వరకు వెళ్లాయి. ముగ్గురిపై కేసు పెట్టగా.. వారిలో ఒకరు జనసేన నేత అయితే.. ఇంకొకరు బూచేపల్లి అభిమానిగా గుర్తించారట. దీంతో తమకు సంబంధం లేకపోయినా.. తమవారిపై కేసు పెట్టారని బూచేపల్లి వర్గీయులు రచ్చ రచ్చ చేశారు. కౌంటర్ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు వాటిని పట్టించుకోలేదట. దీనిపై బూచేపల్లి వర్గీయులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు కూడా దిగారు.
దర్శి నియోజకవర్గంలో మండలానికో ఇంఛార్జ్‌ను నియమించుకున్నారట ఎమ్మెల్యే. పనులు కావాల్సిన ముఖ్య నేతలు సైతం వారి వద్దకే వెళ్లాలని చెప్పడంతో ఎమ్మెల్యే వైఖరి నచ్చని వాళ్లు బూచేపల్లి శిబిరంలో చేరిపోతున్నారట. ఇక్కడి పరిణామాలపై వైసీపీ పెద్దలు కూడా ఒక కన్నేసినట్టు సమాచారం. సీఎంకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే మద్దిశెట్టిని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆ ఘటనపై సీఎంవో సీరియస్‌గా స్పందించడం వల్లే.. వివాదం కేసుల వరకు వెళ్లిందని చెవులు కొరుక్కుంటున్నారట.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నా బూచేపల్లి వర్గీయులు దూరంగానే ఉంటున్నారట. రెండు వర్గాల మధ్య ఉప్పు నిప్పులా ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదట పోలీసులకు. మరి.. సమస్యను సర్దుబాటు చేసేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.