Site icon NTV Telugu

Congress : చింతన్ శిబిర్ తో ఒరిగిందేంటి ? నిర్ణయాలు గాలికొదిలేశారా ?

Congres

Congres

AICC ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి చింతన్‌ శిబిర్‌ తర్వాత.. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌ సమావేశాలను ఘనంగా ముగించారు రాష్ట్ర పార్టీ నాయకులు. కాకపోతే ఈ చింతన్‌ శిబిర్‌తో పార్టీ ఏం చెప్పాలని అనుకుంది? ఏం చెప్పింది అనేది పార్టీ కేడర్‌కు కూడా అంతుచిక్కడం లేదట. ఆ సమావేశాల్లో కాంగ్రెస్‌ నాయకులంతా ఓపెన్‌ అయ్యారు. వాటిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటన్నదే స్పష్టత కరువైనట్టు కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది. అమలు చేయాల్సిన నిర్ణయాలేంటో కూడా శ్రేణులకు అర్ధం కాలేదని సమాచారం. పైగా సమావేశాల్లో తీసుకున్న రాజకీయ తీర్మానాలను కూడా పూర్తిగా ప్రకటించలేదు.

AICC ఆదేశాల మేరకు మేధోమథన సదస్సు జరిగింది తప్పితే.. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌ రోల్‌ ఏంటి అనేది ఒక్కరూ స్పష్టత ఇవ్వలేదని గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సామాజిక న్యాయం చేస్తాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యంపై గంభీరంగానే ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే అంతర్గత ప్రజాస్వామ్యం.. లాబీయింగ్‌ ఎక్కువైన కాంగ్రెస్‌లో అవి సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానం లేదట. అంతెందుకు.. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ సైతం సమావేశాలు పూర్తిస్థాయిలో ముగియకుండానే ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేశారు. చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలను ఎలా అమలు చేయాలో సమీక్షించాల్సిన ఆయనే లైట్‌ తీసుకున్నారని కాంగ్రెస్‌ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

కాంగ్రెస్‌ సమావేశాల్లో రాజకీయ తీర్మానాలే కీలకం. వాటిని పూర్తిగా బహిర్గతం చేయలేదు అని కమిటీ సభ్యులే చెబుతున్నారు. చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ నేతలు చెప్పారు. చింతన్‌ శిబిర్‌ ముగిసి వారం అవుతున్నా.. ఇంత వరకు PAC ఊసే లేదు. జిల్లా స్థాయిలో సమావేశాలు ఉంటాయని చెప్పినా.. అవి ఎప్పుడో.. ఎక్కడ నిర్వహిస్తారో.. ఎవరు బాధ్యతలు తీసుకుంటారో చెప్పడం లేదు. వాస్తవానికి ఈ నెల 11 నుంచి 14లోపే జిల్లాలో సమావేశాలు పెట్టాలన్నది నిర్ణయం. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు కాంగ్రెస్‌ నాయకులు.

రాష్ట్రంలో ఘనంగా చింతన్‌ శిబిర్‌ నిర్వహించినా.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లేరు. మరి.. ఆయన గైర్హాజరీలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తారో లేదో అనే చర్చ మొదలైంది. చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలపై పార్టీ వ్యూహకర్త సునీల్‌ టీమ్‌ ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ ఎవరికీ చీమ కుట్టినట్టు అయినా లేదట. దీంతో సమావేశాలు పూర్తి కాగానే వాటిని అలా వదిలేశారని చెవులు కొరుకుడు ఎక్కువైంది.

 

Exit mobile version