సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఇన్నాళ్లూ టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్టేలా కీలక నిర్ణయం ప్రకటిస్తారా? ప్రత్యేక తెలంగాణలో కొత్త చరిత్ర రాస్తారా? అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే.. నిజాం పాలనలోని దక్కన ప్రాంతం మాత్రం 13 నెలల తర్వాత సెప్టెంబర్ 17న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఆపరేషన్ పోలో పేరుతో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సైనిక చర్య ఫలితంగా నిజాం నవాబు.. భారత సమాఖ్యలో విలీనానికి అంగీకరించారు. ఇది జరిగి దశాబ్దాలు గడిచినా.. ఏటా సెప్టెంబర్ 17 ప్రత్యేకతను మాత్రం మర్చిపోలేదు ప్రజలు. ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఈ విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో వైఖరి. బీజేపీ తెలంగాణ విమోచనం దినం అంటే.. కాంగ్రెస్ తెలంగాణ విలీన దినంగా పాటిస్తుంది. ఆ రోజున జాతీయ పతకాన్ని ఎగరేస్తాయి పార్టీలు. ఎవరు ఏ పేరుతో కార్యక్రమాలు నిర్వహించినా.. సెప్టెంబర్ 17న మాత్రం ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు చేయాలన్నది బీజేపీ తదితర పక్షాల డిమాండ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పటైన తర్వాత కానీ.. అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహించింది లేదు.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. గాంధీభవన్‌లో జరిగే కార్యక్రమానికి ఆ పార్టీ సీఎం హాజరయ్యేవారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ భవన్‌లో ప్రొగ్రామ్స్ నిర్వహిస్తోంది. అయితే తెలంగాణలో అధికారికంగా కార్యక్రమాలు చేపట్టాలనేది విపక్ష పార్టీల డిమాండ్. ఇదే విషయంపై అధికారపార్టీని రాజకీయంగా కార్నర్ చేయాలని చూస్తున్నాయి. ఆజాదీ అమృతోత్సవాల్లోనూ ఇదే డిమాండ్ వినిపించాయి. అయితే ఈ అంశంలో విపక్షాలకు చెక్ పెట్టేలా ఈ ఏడాది ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 3న జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చిస్తారని సమాచారం. విలీనం.. విమోచనం అనే పదాలకు ఆస్కారం ఇవ్వకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హైలైట్ చేస్తూ.. సెప్టెంబర్ 17న అధికారికంగా ప్రొగ్రామ్స్ చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెబుతున్నారు.
సెప్టెంబర్ 17ను మతకోణంలో చూసే పార్టీలకు చెక్ పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. పైగా ఆ రోజు అధికారిక కార్యక్రమాలు చేయాలని డిమాండ్ చేసేవారి నోళ్లకు తాళాలు పడతాయని TRS వర్గాలు అభిప్రాయ పడుతున్నాయట. వామపక్షపార్టీలు సైతం సై అనే విధంగా ప్రొగ్రామ్స్ ఉంటాయట. అలాగే MIMకు TRS భయపడుతోందనే విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని తెలుస్తోంది. మరి.. సెప్టెంబర్ 17 విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.