జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్.. కేరళ సీఎం పినరాయ్ విజయన్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. జార్కండ్ సీఎం హేమంత్ సొరేన్‌లను కలిసి జాతీయ రాజకీయాలు.. 2024 సార్వత్రిక ఎన్నికల గురించి చర్చించారు. ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని స్పష్టం చేశారు గులాబీ దళపతి. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో జోడీ కుదిరింది. పీకేకు చెందిన ఐపాక్‌తో టీఆర్ఎస్ ఒప్పందం చేసుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించారు పీకే. బిహార్ నుంచి సొంతంగా రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో పీకే పార్టీ పెడుతున్నట్టు జోరుగా చర్చ జరుగుతోంది.
టీఆర్‌ఎస్ ప్లీనరీలో జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్రపై క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. త్వరలో వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమై జాతీయ అజెండాపై చర్చిస్తామని ప్రకటించారు. పీకే రాజకీయ వ్యూహం కూడా మారడంతో.. నేషనల్ లెవల్లో కేసీఆర్ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయన్నది ప్రశ్న. ముఖ్యంగా ఎలాంటి రాజకీయ కూటమి ఏర్పడుతుంది? అందులో ఎవరెవరు ఉంటారు? అనేది ఆసక్తిగా మారింది. ప్రశాంత్ కిశోర్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్, పీకే ఆలోచనలు ఒకే విధంగా ఉండటంతో ఆ మేరకు ప్లానింగ్ ఉంటుందని టాక్.
అజెండా కొలిక్కి వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో కలిసి పనిచేసే అంశాలపై వివిధ పార్టీలతో మరింత విస్తృతంగా సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతారని అనుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక శక్తులు ఒక తాటిపైకి వచ్చే పనిలో ఉన్నాయి. ఇదే సమయంలో బలమైన అజెండాను కొలిక్కి తెస్తే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు నాయకులు. అందుకే గులాబీ దళపతి వేసే ఎత్తుగడలు.. వ్యూహాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటనే ప్రశ్నలు ఊపందుకున్నాయి. వీటిపై గులాబీ బాస్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.