సుధీర్ఘ చర్చల తర్వాత జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసింది అధికార టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే పార్టీకి జిల్లా అధ్యక్షులు ఉండేవారు. ఆ తర్వాత ఈ పదవుల జోలికి వెళ్లలేదు అధిష్ఠానం. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేనే సుప్రీం అని గులాబీ పార్టీ స్పష్టం చేసింది. కానీ.. కొద్ది నెలల క్రితం రాష్ట్రంలోని 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది టీఆర్ఎస్. వీరిలో ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు ఉన్నారు. నియామక ప్రక్రియ పూర్తి అయ్యింది కానీ.. జిల్లా అధ్యక్ష హోదాలో వాళ్లు చక్కబెట్టాల్సిన వ్యవహారాలపై పార్టీ నుంచి స్పష్టత రాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏం చేయాలో పార్టీ నుంచి స్పష్టత లేదా?
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు నిర్వహిస్తోంది. భవిష్యత్‌లో కూడా బీజేపీపై తీవ్రస్థాయిలో పోరాటానికి రెడీ అవుతోంది. ఈ పోరాటంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు కీలక పాత్ర పోషిస్తారని అనుకున్నారు. కానీ.. ఆ పదవులు చేపట్టిన నాయకులు మాత్రం స్పష్టత లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారట. అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టని వాళ్లూ ఉన్నారట. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టత వచ్చాకే ముందుకు సాగాలన్నది వాళ్ల ఆలోచనగా చెబుతున్నారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాలకు పార్టీ ఆఫీసుల నిర్మాణం చేపట్టింది టీఆర్ఎస్. వాటిల్లో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ప్రారంభోత్సవాలే మిగిలాయి. పూర్తిస్థాయిలో జిల్లా పార్టీ ఆఫీసులు అందుబాటులోకి వచ్చాక కార్యక్రమాలు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. పైగా రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికారపార్టీకి.. కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. ఈ అంశంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు దూకుడుగా వెళ్తున్నారు కానీ.. జిల్లా అధ్యక్షులుగా నియామకమైన వాళ్లు మాత్రం పెద్దగా చప్పుడు చేయడం లేదు.
పార్టీ జిల్లా అధ్యక్షుల్లో నెలకొన్న సందిగ్ధత అధిష్ఠానం గుర్తించిందో ఏమో.. త్వరలో వారికి దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. పార్టీ ఆఫీసుకు పిలిచి.. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పోరాటాలు.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నారు. అప్పటి వరకు పార్టీ జిల్లా సారథులకు నిరీక్షణ తప్పదేమో..!
Watch Here : https://youtu.be/5Pei3ArjFEM