పార్లమెంట్ సమావేశాల్లో పోరుబాట పట్టిన టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి? విపక్ష పార్టీలతో కలిసి ధర్నాలలో పాల్గొనడం దేనికి సంకేతం? జాతీయ రాజకీయాల్లో ఎటువైపు అడుగులు వేయబోతోంది? పార్లమెంట్ లోపల.. బయట కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న గులాబీ పార్టీ.. ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తుందా?
జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పోషించే పాత్రేంటి?
తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నది అధికార టీఆర్‌ఎస్ ఆరోపణ. రైతులకు మేలు కలిగేలా కేంద్రం సానుకూల ప్రకటన చేయాలన్నది రాష్ట్ర సర్కార్ డిమాండ్. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపైనే ఆందోళనలు చేస్తున్నారు ఆ పార్టీ ఎంపీలు. ఇదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నారు సీఎం కేసీఆర్. ఈ పరిణామాలను.. టీఆర్‌ఎస్ వేస్తున్న ఎత్తుగడలను పరిశీలిస్తున్నవాళ్లు.. జాతీయ రాజకీయాల్లో గులాబీ పార్టీ పోషించే పాత్రపై అనేక విశ్లేషణలు చేస్తున్నారు.
బీజేపీకి టీఆర్‌ఎస్ వ్యతిరేకమని ప్రకటించిన ఎంపీ కేకే..!
ఇప్పటి వరకు బీజేపీకి టీఆర్ఎస్ సహకరిస్తుందనే విమర్శలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కానీ.. తాజా వైఖరితో ఆ విమర్శలకు తన చేతలతోనే టీఆర్‌ఎస్ బదులిచ్చింది. పైగా.. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు తాము బీజేపీకి వ్యతిరేకమని స్పష్టం చేసేశారు. 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విపక్ష పార్టీలు పార్లమెంట్ వేదికగా నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ ఆందోళనల్లోనూ టీఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొంటున్నారు. తెలంగాణలో ధాన్యం సేకరణ డిమాండ్‌పై తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతామని ఎంపీ కేకే ప్రకటించారు. దీంతో ఇతర విపక్ష పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ప్రయాణిస్తుందా లేక అంశాల వారీగా రాజకీయ ఎత్తుగడలు ఉంటాయా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
గతంలో ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతను వివరించిన సీఎం కేసీఆర్..!
మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చేస్తారా?
లోక్‌సభకు 2024లో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులు ఏకమయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి. సీఎం కేసీఆర్ సైతం గతంలో ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను దేశవ్యాప్తంగా చర్చకు పెట్టారు. ప్రాంతీయ పార్టీలకు ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతను ఆయన వివరించారు కూడా. అయితే జాతీయ స్థాయిలో తాజాగా కొత్త రాజకీయ కూటముల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో టీఆర్‌ఎస్ ఏం చేస్తుందన్నది ఒక ప్రశ్న. ఎన్నికలు దగ్గర పడగానే మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన చేస్తారా లేక అప్పటికి జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈ విషయంలో గులాబీ దళపతి ఎత్తుగడలు ఊహలకు అందవని చెబుతాయి టీఆర్‌ఎస్ వర్గాలు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. మరి జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్ పాత్రను కేసీఆర్ ఎలా నిర్దేశిస్తారో వేచి చూడాలి.