రాజకీయాల్లోకి వచ్చీరాగానే రెండుసార్లు ఎంపీగా గెలిచారు ఆ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి లోక్‌సభ బరిలో ఉంటారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆ యువనేత ఇంట్లో మరో చర్చ జరుగుతోందట. ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు టాక్. నియోజకవర్గాన్నీ ఎంపిక చేసేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి.. ఆ యువనేత కోరికను పార్టీ అధినేత మన్నిస్తారా? క్షేత్రస్థాయిలో పార్టీకి ఎదురయ్యే సవాళ్లేంటి? ఎవరా నాయకుడు?
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కింజరాపు ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. మూడు దశాబ్దాలుగా టీడీపీలో వాళ్లది కీలక పాత్ర. టెక్కలితో విడదీయరాని బంధం ఉంది. అప్పట్లో ఎర్రన్నాయుడు మొదలుకొని.. ప్రస్తుతం అచ్చెన్నాయుడు వరకు ఆ నియోజకవర్గం ఆదరిస్తూ వస్తోంది. ఒక్క టెక్కలే కాదు.. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కింజరాపు కుటుంబానికి అనుచరులు.. మద్దతుదారులు ఉన్నారు. ఆ కారణంగానే ఈ ఫ్యామిలీ నుంచి ఒకరు ఎంపీగా.. ఇంకొకరు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఎర్రన్నాయుడు మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు.. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఈసారి ఎంపీగా కాకుండా.. అసెంబ్లీకి పోటీ చేయాలని రామ్మోహన్ చూస్తున్నారనే చర్చ జిల్లాతోపాటు.. పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందట.
అసెంబ్లీ నియోజకవర్గాన్ని రామ్మోహన్ నాయుడు ఎంపిక చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమ సామాజికవర్గం ఎక్కువగా ఉండే నరసన్నపేట అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారట. రామ్మోహన్‌నాయుడు ఈ ఆలోచనకు రావడానికి కారణం కుటుంబసభ్యుల ఒత్తిడిగా తెలుస్తోంది. ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా ఉంటేనే రాజకీయంగా ఇంకా బలమైన ముద్ర పడుతుందని సూచిస్తున్నారట. ఎమ్మెల్యేగా గెలిస్తే.. రాష్ట్రంలో బలమైన నేతగా ఎదగొచ్చని.. అనుచరులకు ఇంకా సమయం కేటాయించొచ్చని చెబుతున్నారట. సమీకరణాలు కుదిరితే మంత్రి అవ్వొచ్చని చెప్పేస్తున్నారట. 2014 ఎన్నికలకు ముందు వరకు టీడీపీ కేడర్ అంతా రామ్మోహన్ చుట్టూ తిరిగేదని.. ఆ ఎన్నికల్లో గెలిచి అచ్చెన్నాయుడు మంత్రి అయ్యాక అంతా అటు వైపు వెళ్లిపోయారని కుటుంబంలో చర్చ నడుస్తోందట. రెండుసార్లు ఎంపీగా గెలిచినా రామ్మోహన్ నాయుడు సెకండ్ లీడర్‌గా మారిపోయారని ఆవేదన చెందుతున్నారట. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
అప్పట్లో కొంతకాలం టీడీపీలో బాబాయ్ అబ్బాయ్‌కి కోల్డ్ వార్ నడిచింది. ఏ పని కావాలన్నా బాబాయ్ దగ్గరకు పంపాల్సి వచ్చేదని.. ఎంపీగా పరిమితులకు లోబడాల్సి వచ్చేదని రామ్మోహన్ వ్యాఖ్యానించేవారట. ఎంపీగా ఉన్నప్పటికీ అనుకున్న పనులు చేయలేకపోతున్నాననే బాధ ఆయనలో ఉండిపోయిందట. అయితే రామ్మోహన్ నాయుడు కన్నేసిన నరసన్నపేటలో మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన కింజరాపు ఫ్యామిలీకి విధేయుడు. అందువల్ల పెద్దగా ఇబ్బంది ఉండబోదని లెక్కలేస్తున్నారట. జిల్లాలోని రామసైన్యాన్ని నరసన్నపేటలో దించి.. రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తే ఎలా ఉంటుందో క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నట్టు టాక్. టీడీపీ అధిష్ఠానం ఓకే అంటే.. నరసన్నపేటలో పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట.
అయితే టీడీపీలో మరో చర్చ జరుగుతోంది. రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా బరిలో దిగితే పార్టీలో లేనిపోని ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నారట. అచ్చెన్న, రామ్మోహన్ ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిస్తే.. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే విషయంలో రచ్చ అవుతుందని.. ఏరికోరి అలాంటి తలనొప్పులు చంద్రబాబు ఆహ్వానించబోరని కొందరి వాదన. పైగా ఎంపీగా రామ్మోహన్‌నాయుడు మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో.. గతంలో ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు విషయంలో ఎలాంటి సూత్రాన్ని అమలు చేశారో.. అదే ఇప్పుడూ కొనసాగిస్తారని సమాచారం. అన్నీ అనుకూలిస్తే.. రాష్ట్రమంత్రి ఏం కర్మ.. తండ్రిలా రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రి అవ్వొచ్చని సూచిస్తున్నారట. మరి.. రామ్మోహన్ నాయుడు విషయంలో టీడీపీ ఏం చేస్తుందో చూడాలి.