Site icon NTV Telugu

Off The Record: భూమా అఖిల ప్రియా, ఎస్వీ జగన్ మధ్య స్కాం పంచాయితీ ఏంటి?

Ndl

Ndl

Off The Record: కోట్లు మింగేశావ్‌… పెద్ద స్కామ్‌ చేశావంటూ మామ మీదే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారా మాజీ మంత్రి. బస్తీమే సవాల్‌ నేను చేసిన స్కామ్‌ని నిరూపించు… రాజీనామాకు రెడీ. నిరూపించలేకుంటే నువ్వు ఎమ్మెల్యే పదవిని వదిలేస్తావా అంటూ కోడల్ని ఛాలెంజ్‌ చేస్తున్నారు మామ. ఎక్కడ జరుగుతోందా సవాళ్ళ పర్వం? ఎవరా మామా కోడళ్ళు?

Read Also: Off The Record: ప్రకాశం టీడీపీలో అన్నదమ్ముల కోల్డ్ వార్!

భూమా అఖిలప్రియ. ఫైర్‌బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న లీడర్‌. గుక్క తిప్పుకోకుండా ప్రత్యర్థుల మీద సంధించే విమర్శనాస్త్రాలు, అంతకు మించి ఆమె మీద వస్తున్న ఆరోపణలు, వివాదాలు ఇటీవల చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఆమె ఎవర్ని టార్గెట్ చేసినా ఒక పట్టాన వదిలిపెట్టబోరన్న అభిప్రాయం ఉంది. అందుకు సొంత బంధువులు కూడా మినహాయింపు కాదన్నది విస్తృతాభిప్రాయం. కొంతకాలంగా అఖిలప్రియ తనకు మేనమామ వరసయ్యే నాయకుడు, నంద్యాల విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎస్వీ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రస్తావించారామె. ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్వీ జగన్ వైసీపీలో కొనసాగుతూ విజయ మిల్క్ డైరీ చైర్మన్‌ హోదాలో ఉన్నారు. భూమా అఖిల ఆళ్ళగడ్డ టీడీపీ ఎమ్మెల్యే. ఎస్వీ మీద అఖిల ఆరోపణలు, అందుకు ఆయన రియాక్షన్‌ ప్రస్తుతం జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి. నంద్యాలలోని విజయ మిల్క్ డైరీలో పాల పొడి ప్లాంట్ వున్నా… దాన్ని వాడుకోకుండా, కర్ణాటకలోని మరో ప్లాంట్‌కు ఇక్కడి నుంచి పాలు పంపుతున్నారని, ఇందులో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్యే.

Read Also: Off The Record: వైసీపీతో కలిసి కొందరు టీడీపీ నేతలు దోస్త్ మేర దోస్త్ అంటున్నారా?

సొంత ప్లాంట్‌లో ఉన్న పాలపొడి తయారీ యంత్రాలను వినియోగించకుండా కర్ణాటకకు పంపడం వల్ల 25 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందన్నది ఆమె వెర్షన్‌. అయితే… 2018లోనే, తాను ఛైర్మన్ పదవి చేపట్టకకుందే ఇక్కడ మిల్క్ పౌడర్ యూనిట్ పనిచేయక క్లోజ్ చేశారని, దాన్ని రిపేర్‌ చేయించమని సీఎంకు లేఖ రాశానంటున్నారు ఎస్వీ జగన్. కర్ణాటకలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మిల్క్ ఫెడరేషన్‌కే ఇక్కడ మిగిలిన పాలను పంపి పొడి తయారు చేయిస్తున్నామని, ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారాయన. ఇక విజయ డైరీ కోసం కర్ణాటక నుంచి డీజిల్ కొంటున్నారని, అందులో చైర్మన్ కమిషన్ నొక్కేస్తున్నారనేది భూమా అఖిల మరో ఆరోపణ. కర్ణాటకలో డీజిల్ ధర తక్కువగా ఉండడం, మిల్క్ డైరీకి లాభదాయకంగా ఉన్నందునే అక్కడ కొంటున్నాం తప్ప ఇందులో తన వ్యక్తిగత స్వార్ధం ఏదీ లేదంటున్నారు ఛైర్మన్‌. డీజిల్ కొని డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెల్లిస్తే తనకు కమీషన్‌ ఎలా వస్తుందని అడుగుతున్నారు ఎస్వీ. అసలు ఏడాదికి మొత్తం డీజిల్ కొనేదే 4 కోట్ల 80 లక్షలు రూపాయలకైతే… అందులో 4 కోట్ల కమీషన్‌ తనకు ఎలా ముడుతుందని రివర్స్‌ క్వశ్చన్‌ వేస్తున్నారాయన. అఖిలప్రియ స్పృహలో వుండే మాట్లాడుతున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు ఎస్వీ.

Read Also: Stalin: కరూర్‌ను ఒకలా.. మణిపూర్‌ను మరొకలా చూస్తారా? బీజేపీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం

అలాగే, పాలలో తక్కువ కొవ్వు శాతంతో రోజుకు లక్షా 50 వేలు నొక్కేస్తున్నారని, అక్రమాలపై ప్రశ్నించిన వారిని బదిలీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అఖిల. నంద్యాలలోని డైరీ ఆస్తులు 35 ఎకరాలను ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి మనుషుల పేరుతో అడంగల్‌లో రాయించుకున్నారని, ఇది 350 కోట్ల స్కాం అని, ఆధారాలతో సహా నిరూపిస్తామంటున్నారామె. ఈ సవాల్‌ను స్వీకరించిన ఎస్వీ జగన్‌…. ఆరోపణలపై చర్చకు సిద్ధమంటున్నారు. అదే నిజమైతే…నేను రాజీనామాకు సై. మరి నిరూపించపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అంటూ అఖిలప్రియకు సవాల్‌ విసురుతున్నారాయన. ఇదంతా కేవలం విజయ మిల్క్ డైరీ చైర్మన్ కుర్చీని తన తమ్ముడు విఖ్యాత రెడ్డికి కట్టబెట్టేందుకు ఆడుతున్న నాటకం అన్నది ఎస్వీ జగన్‌ మాట. విజయ మిల్క్ డైరీకి జగత్ డైరీ నుంచి పాలు సరఫరా చేస్తామంటూ కోటి 20 లక్షలు తీసుకుని సరఫరా చేయకుండా…డిఫాల్ట్ అయ్యారని, ఆయన అసలు చైర్మన్ పదవికి అనర్హుడన్నది ఎస్వీ వాదన. 70 వేల లీటర్ల పాలసేకరణ నుంచి లక్షా 40 వేలకు పెంచామని, తానే స్కాం చేసి ఉంటే విజయ మిల్క్ డైరీ ఎప్పుడో మూతపడేదంటున్నారాయన. అఖిలప్రియ సొంత ఎజెండాతో మాట్లాడ్డం మానేసి బహిరంగ చర్చకు వస్తే… ఎవరిలో నియాయితీ ఉందో తేలిపోతుందన్నది ఎస్వీ మాట. ఆరోపణల్ని నిరూపించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న బహిరంగ సవాల్‌తో త్వరలో పొలిటికల్ హీట్ పెంచే యోచనలో ఉన్నారట డైరీ ఛైర్మన్‌. మొత్తం మీద మామా కోడళ్ళ సవాళ్ళ పర్వం నంద్యాల జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పెంచబోతోందని, ఈ గొడవను ఇక్కడితో ఆపేస్తారా? లేక ఇంకా ముందుకు తీసుకెళ్తారా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి నంద్యాల పొలిటికల్‌ సర్కిల్స్‌.

Exit mobile version