పార్టీ ఏదైనా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ల గ్యారెంటీ ఉండదు. అదే మాజీలకైతే ఆ టెన్షన్ మరీ ఎక్కువ. ఇప్పుడు ఆ జిల్లాలో నాయకులు ఇదే మథనంలో పడ్డారట. బ్యాక్ డోర్ ప్రయత్నాలు ప్రారంభించారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇంతకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఆ మాజీ ఎమ్మెల్యేలు ఎవరు…? టీడీపీ హైకమాండ్ దగ్గర ఉన్న లెక్కలేంటి…?.
ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీదే అధికారపీఠం అనేది ఓ అంచనా. చాలాసార్లు ఈ లెక్కలే నిజం అవుతూ వస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో మొత్తం 34 స్ధానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నాడిని గట్టిగా పట్టేసింది వైసీపీ. టీడీపీ కంచుకోటలు బద్ధలయ్యాయి. సీనియర్ నాయకులకూ ఓటమి తప్పలేదు. కేవలం ఆరంటే ఆరు చోట్లే టీడీపీ గెలిచింది. పార్టీని నడిపించే నాయకత్వ లోపం ప్రతిపక్షానికి పెద్ద సమస్యగా మారింది. దీంతో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి గెలిచే వాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమైంది హైకమాండ్. ఎన్నికలకు ముందుగానే టికెట్లపై ఓ అంచనాకు వస్తున్నారట.
గాజువాక, అనకాపల్లి అభ్యర్ధులకు దాదాపు టికెట్లు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, పీలా గోవింద్‌లకు క్లారిటీ ఇచ్చేశారని సమాచారం. దీంతో టికెట్స్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు టెన్షన్ పట్టుకుందట. తమకు అవకాశం వస్తుందో రాదోననే లెక్కలు వేసుకుని లోపాయికారీ ప్రయత్నాలు ప్రారంభించారట. 2019 ఎన్నికల తర్వాత చాలా మంది పార్టీ ఫిరాయించారు. అయ్యన్న, బండారు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే పోరాడుతున్నా.. ఆశించిన మైలేజ్ రావడం లేదనే వాదన ఉంది. ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకోవడంతో.. సమాంతరంగా పొత్తులపైనా పార్టీలో చర్చ నడుస్తోంది. జనసేనతో పొత్తు కుదిరితే ఎవరి సీటుకు ఎసరొస్తుందో అని లెక్కలేసుకుంటున్నారు నేతలు.
విశాఖ జిల్లాకు చెందిన కొందరు మాజీలు.. పార్టీ ముఖ్యులను గుడులు, గోపురాలకు తీసుకెళ్లి తమ మనసులో మాట బయట పెడుతున్నారట. గ్రేటర్ విశాఖ పరిధిలోని తూర్పు, ఉత్తరం, పశ్చిమ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. గంటా శ్రీనివాస్ ఈసారి భీమిలి వెళ్తారనే ప్రచారం ఉంది. నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట సీట్లపై క్లారిటీ రావాల్సి ఉంది. మాడుగుల, యలమంచిలి, చోడవరంలోని టీడీపీ ఇంఛార్జుల్లో ఒకరిద్దరికి టికెట్స్ ఇచ్చినా బలంగా పోరాడగలరా అనే అనుమానాలు ఉన్నాయట. చోడవరం మాజీ ఎమ్మెల్యే KSNS రాజు, మాడుగుల నుంచి గవిరెడ్డి రామానాయుడు, అరకు నుంచి మాజీ మంత్రి శ్రవణ్ కుమార్, యలమంచిలి, విశాఖ నార్త్, అనకాపల్లి నియోజకవర్గాల్లో పోటీకోసం సీనియర్లు ప్రయత్నాలు ప్రారంభించారట.
జనసేనతో పొత్తులు ఆధారంగా ఇప్పుడు పార్టీలో ఉన్న ముఖ్య నేతలు కొందరు తమ రాజకీయ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. రెండు పార్టీల ఓటు బ్యాంక్ ఆధారంగా పోటీకి సిద్ధం అయ్యేందుకు ప్రయత్నాల్లో స్పీడ్ పెంచారట. టీడీపీ హైకమాండ్ మాత్రం మాజీ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించేందుకు ఒకటి రెండుసార్లు సర్వేలు చేయించాకే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందట. అందుకే ఆశాహవుల్లో ఎంత మందికి అవకాశం దక్కుతుందో అనే చర్చ నడుస్తోంది.