Site icon NTV Telugu

CPI : తెలంగాణలో వామపక్షాలకు ఏమైంది..? రోడ్డెక్కడం మర్చిపోయారా..?

New Project (1)

New Project (1)

తెలంగాణలో కామ్రేడ్లు సైలెంట్‌ అయ్యారు. సమస్యలున్నా కనిపించడం లేదు. ఒకప్పుడు విద్యుత్‌ పోరాటంలో కాల్పుల వరకు లెఫ్ట్‌ పార్టీల ఉద్యమం ఎగిసిపడింది. అలాంటి వామపక్ష నేతలకు ఏమైంది అన్నదే ప్రస్తుతం ప్రశ్న. నిత్యావసరాల ధరాలు భారీగా పెరిగాయి. పెట్రోధరలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీలో ఛార్జీల మోత మోగుతోంది. విద్యుత్ ఛార్జీలు షాక్‌ కొడుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎర్ర జెండాలతో రోడ్డెక్కి ధర్నాలు.. రాస్తారోకోలు.. ప్రభుత్వ ఆఫీసుల ముట్టడితో హోరెత్తించేవి.. CPI, CPM ఇతర వామపక్ష పార్టీలు. ఇప్పుడు అలికిడే లేదు. ప్రెస్‌మీట్‌ పెట్టి మమ అనిపిస్తున్నారు. రోడ్డెక్కడం మర్చిపోయారో? పెరిగిన ధరలకు ప్రజల అలవాటు పడిపోయారని అనుకుంటున్నారో ఏమో కామ్రేడ్ల ఊసు లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ధరలు పెరిగినా.. ఛార్జీలను పెంచినా, హత్యలు, అత్యాచారాలు జరిగినా, పబ్బులు గబ్బు పుట్టించినా ఉద్యమాలతో హోరెత్తించేవి ఈ రెండు పార్టీలు. ఎర్రసైన్యం కవాతులతో హైదరాబాద్‌ రోడ్లు ఎర్ర తివాచీ పరిచినట్టుగా కనిపించేవి. ఆ సమయంలో సీపీఎం కార్యదర్శిగా బీవీ రాఘవులు, సీపీఐ కార్యదర్శిగా నారాయణ ఉండేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త కమిటీలు వచ్చాయి. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఉన్నప్పటికీ.. ఆ స్థాయి పోరాటాలు.. ఉద్యమాలు.. నిరసనలు లేవు.

వామపక్ష నేతలు చల్లబడ్డారో.. కాలం కలిసిరానప్పుడు ఎందుకు పంచాయితీలు అనుకున్నారో లెఫ్ట్ పార్టీలు పూర్వ వైభవం కోల్పోతున్నాయి. ఉనికి కాపాడుకోవడానికైనా రోడ్డెక్కే సాహసం చేయడం లేదు నాయకులు. ఒకప్పుడు రాజకీయంగా లాభ నష్టాలను చూసుకునేవారు కాదు. కేవలం ఉద్యమాల్నే నమ్ముకొనేవారు. ప్రస్తుతం లెఫ్ట్ పార్టీలకు రాజకీయ వ్యూహం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు మా నేతలకు ఏమైంది అని సొంత పార్టీ కామ్రేడ్సే ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు వామపక్ష నేతలు అనుకూలంగా ఉంటున్నారనే టాక్‌ ఉంది. సమస్యలపై పోరాటం అని చెప్పినా.. ఎన్నికలప్పుడు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహారం నడిపేస్తున్నారు. ఈ వైఖరితో లెఫ్ట్‌ పార్టీలు రాజకీయంగా దెబ్బతిన్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. చేతి నిండా పని వస్తుందని అనుకున్నారట. కానీ.. వారి వైఖరి చూస్తే జేబులో చేతులు పెట్టుకుని విగ్రహాలుగా మారిపోయారనే విమర్శ వినిపిస్తోంది. పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరాలు పెరుగిపోతున్నా ఒక్క మాట లేదు. రాష్ట్ర మహాసభలో తీర్మానాలు కేవలం పేపరుపై రాతలకే పరిమితం అవుతున్నాయి.

ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు సారధ్యం వహిస్తున్న నాయకులు.. గతంలో సీరియస్‌గా ఉద్యమాలు చేసిన వారే. మొండిగా కొట్లాడి.. సమస్యల పరిష్కారానికి చక్రం తిప్పిన అనుభవం ఉన్నవారే. అప్పట్లో ప్రభుత్వ వైఖరిని చాడ వెంకటరెడ్డి సభలో ఏకి పడేసేవారు. ధరణి పోర్టల్‌ వ్యవహారంలో చాడాను అసెంబ్లీకి పిలిచి మాట్లాడారు సీఎం కేసీఆర్‌. ఆ తర్వాత కూడా ధరణిలో ఎన్నో సమస్యలు వచ్చినా చాడా వాయిస్‌ లేదనే విమర్శ ఉంది. మొత్తానికి సమస్యలపై కామ్రేడ్లు పోరాటాలను మర్చిపోయారనే వాదన బలపడుతోంది.

 

Exit mobile version