ఈయన పేరు శివరాజ్ పాటిల్. కర్నాటకలోని రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే. ఇక ఈయన.. రాజేందర్‌రెడ్డి. తెలంగాణలోని నారాయణపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇద్దరిదీ వేర్వేరు రాష్ట్రాలైనా.. సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో నారాయణపేటలో రాజేందర్‌రెడ్డిని ఓడించడానికి ప్రచారం చేస్తానని పాటిల్ అంటే.. అదే విధంగా కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. దీంతో ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది? ఎందుకు శపథాలు చేసుకుంటున్నారు అనేది చర్చగా మారింది.
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని.. ఇదే బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ ప్రశంసలు కురిపించారు. రాయ్‌చూర్‌ను తెలంగాణలో కలిపేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో పాటిల్ కామెంట్స్‌ను కర్నాటక సరిహద్దుల్లోని తెలంగాణ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. ఒకవైపు తెలంగాణలో టీఆర్ఎస్‌పై బీజేపీ ఒంటికాలిపై లేస్తుంటే.. అదే బీజేపీకి చెందిన కర్నాటక ఎమ్మెల్యే పాటిల్ చేసిన కామెంట్స్ పుండుమీద కారం జల్లినట్టు అయ్యింది. అధిష్ఠానం నుంచి అక్షింతలు పడ్డాయో ఏమో.. టీఆర్ఎస్ వైఖరిపై అప్పటి నుంచి గుర్రుగా ఉన్నారట పాటిల్. దీనికంతటికీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డే కారణమని ఆయన అనుమానిస్తున్నారట. దీంతో ఇద్దరి మధ్య వైరం మొదలైందని చెబుతారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న పాటిల్.. రాజేందర్‌రెడ్డపై గురిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో నారాయణపేటలో ప్రచారం చేసి రాజేందర్‌రెడ్డిని ఓడిస్తానని సవాల్ చేశారు.
ఈ కామెంట్స్‌పై ఎమ్మెల్యేతోపాటు సరిహద్దు నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పాటిల్ గతంలో చేసిన కామెంట్స్‌ను సామాజిక మాధ్యమాల్లో మరోసారి సర్క్యులేట్ చేస్తూ.. పాలన బాగుండబట్టే ఓడిస్తారా అని ప్రశ్నలు సంధిస్తున్నాయి. అయితే తెలంగాణలో కంటే.. కర్నాటకలోనే అసెంబ్లీ ఎన్నికలు ముందుగా వస్తాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో పాటిల్ కన్నడ అసెంబ్లీలో ఎలా అడుగు పెడతారో చూస్తానని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సవాల్ చేశారట. అప్పటి నుంచి రెండు శిబిరాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఎమ్మెల్యేల పొలిటికల్ వార్ తెలంగాణ, కర్నాటక సరిహద్దు నియోజకవర్గాల్లో రాజకీయ వేడి రగిలిస్తోంది. వాస్తవానికి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నివాసం ఉండేది కర్నాటకలోని రాయచూర్‌లోనే. ఆయన వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు అన్నీ అక్కడే ఉన్నాయి. నారాయణపేటకు వచ్చి పోతుంటారు రాజేందర్‌రెడ్డి. ఆ ప్రాంతంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు రాజకీయ, ప్రజా, వ్యాపార, వాణిజ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. దీంతో పంతాలకు పోయి.. నిజంగానే ఎన్నికల్లో ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు ప్రచారాలు చేసుకుని ఎవరి కాళ్ల కిందకు నీళ్లు తెచ్చుకుంటారో చూడాల.