MVV సత్యనారాయణ. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు. ఎంపీ అయిన మొదట్లో యాక్టివ్ పాలిటిక్స్‌లో చురుకైన పాత్ర పోషించేందుకు ప్రయత్నించారు ఎంవీవీ. వ్యాపార అనుభవం ఉన్నప్పటికీ… రాజకీయ ఎత్తుగడలను తట్టుకుని నిలబడలేకపోయారు. ఇటీవల కాలంలో ఎంవీవీని ఊహించని వివాదాలు చుట్టుకుంటున్నాయి. వ్యాపారం, రాజకీయం వేరువేరు కాదని.. ఒకదాని ప్రభావం మరోదానిపై ఖచ్చితంగా పడుతుందనే వాస్తవం బాగా తెలిసొచ్చిందట. దీనికి కారణం ఆయన చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులే.
కొద్దినెలల క్రితం ఎంపీ MVV పేరు మొదటిసారి విస్త్రతమైన ప్రచారంలోకి వచ్చింది. హయగ్రీవా ఫార్మ్స్ అండ్ విల్లాస్‌కు సంబంధించిన వివాదాస్పద భూముల్లో ఎంపీ ప్రమేయంపై ఆరోపణలు వినిపించాయి. తనకు అత్యంత ఆప్తుడు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జీవీ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పై వివాదం రాజుకుంది. తనపై ఒత్తిళ్లు తెస్తున్నారని హయగ్రీవా ఎండీ చిలుకూరి జగదీశ్వరుడు ఆరోపణలు చేయడంతో అందరి దృష్టి జీవీ, ఎంవీవీలపై పడింది. వైజాగ్‌లో వైసీపీ ఏదో చేసేస్తోందన్న రేంజ్‌లో ఆ ఎపిసోడ్ నడిచింది. దానికి ఎంపీనే కేంద్రబిందువు అయ్యారు. దీంతో ఆ ప్రాజెక్ట్ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేయడంతో వెనక్కితగ్గారు. అది అలా ముగిసిందని అనుకుంటుండగానే ఎంపీ MVV మీద మరికొన్ని ఆరోపణలు వచ్చాయి.
ఎండాడలోని చెరువులను ఆక్రమించి రహదారి నిర్మాణం చేపట్టారని ఓ సామాజిక కార్యకర్త, తన భూమిలో రహదారి నిర్మించేస్తున్నారని ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీ మధు ఆరోపణలు చేశారు. ఈ రెండు వ్యవహారాల్లోనూ ఎంవీవీ సత్యనారాయణ పేరు విస్త్రతంగా నలిగింది. దీంతో ఎంపీ సంచలన ప్రకటన చేశారు. తాను భవిష్యత్‌లో విశాఖలో వ్యాపారాలు చేయబోనని.. రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. వర్తమాన వ్యవహారాలతో ఒత్తిడికి లోనైన ఎంవీవీ.. ఈ ప్రకటన చేసి ఉంటారనే చర్చ మొదట్లో జరిగింది.
అధికారపార్టీ ఎంపీనే రాష్ట్రం వదిలి పెట్టిపోతానంటే పరిస్ధితులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని ప్రతిపక్షం విమర్శలు ఎక్కుపెట్టింది. ఐతే, ఎంవీవీ చేసిన కామెంట్స్ కేవలం ఒత్తిడికి లోనై చేసినవి కాదని.. దాని వెనుక పెద్ద వ్యూహం ఉందనేది అసలు స్టోరీ. స్ధానిక రాజకీయ పరిస్ధితులు తనకు అనుకూలంగా మలుచుకునే ప్లాన్‌లో భాగంగానే ఈ ప్రయత్నం చేశారనేది విస్పష్టం. ప్రస్తుతం ఎంవీవీ కనస్ట్రక్షన్స్‌కు సంబంధించి 10 వరకు ప్రాజెక్టులు విశాఖలో నడుస్తున్నాయి. ఇవి పూర్తి కావడానికి కనీసం రెండు మూడేళ్లు పడుతుంది. ఇప్పటికిప్పుడు చిన్నచిన్న కనస్ట్రక్షన్స్ చేసే ఆలోచన ఎంపీ కంపెనీకి లేదనేది భోగట్టా. దీంతో ఆయన రెండు మూడు డ్రీమ్ ప్రాజెక్టుల కోసం వర్కవుట్ చేస్తుండగా అంతర్గత శక్తులు అడ్డుపడ్డాయనే ప్రచారం జరిగింది. వీటన్నింటినీ ఒకే దెబ్బతో క్లియర్ చేసుకునే ఎత్తుగడలో భాగంగానే ఎంవీవీ ఊరు వదిలిపోతాననే అస్త్రం సంధించారని వినికిడి.
ఎంపీ ఎంవీవీ గురి తప్పలేదు. అదే సమయంలో పార్టీ సీరియస్ కావడంతో వెనక్కి తగ్గారని టాక్. ఇదే సమయంలో ఆయనకు సంతోషకరమైన సమాచారం అందిందని పార్టీలోని ముఖ్యనేతలు మాట్లాడుకుంటున్నారు. సిటీలో నడిబొడ్డున ఉన్న అత్యంత కీలకమైన ఓ ప్రాజెక్ట్‌ను ఎంపీకి చెందిన సంస్ధ దక్కించుకుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మైనారిటీలకు చెందిన మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ భూమి చుట్టూ చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు రెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రాజెక్ట్ సిద్ధమైంది. క్రీస్టియన్ మైనారిటీలకు చెందిన ఆ భూమిలో కొంత మేర పనులు కూడా జరిగాయి. రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తి పనులు ఆగిపోగా.. వాటికి పరిష్కారం లభించినట్టు సమాచారం. అదే సమయంలో హయగ్రీవా భూములకు సంబంధించిన వివాదం దాదాపు ముగిసింది. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆ సంస్ధకు చెందిన జగదీశ్వరుడిపై కేంద్ర ఆర్ధిక శాఖకు, సీబీఐకి ఫిర్యాదు చేశారు ఎంపీ. నేరుగా ఈ ప్రాజెక్ట్‌తో తనకు సంబంధం లేదని చెబుతున్న ఎంపీ… హాయగ్రీవా మీద ఫిర్యాదులు చేయడం ఆసక్తికరం. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుండటంతో ఎంవీవీ ఇటీవల కాలంలో పార్టీ ముఖ్యులు అందరితోనూ కలివిడిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
Watch Here : https://youtu.be/ThY14G5MU6A