పార్టీలో వర్గపోరుపై నేరుగా అధినేతకే ఫిర్యాదు చేశారట ఆ ఇంఛార్జ్. ఇప్పుడేం జరుగుతుంది? తాడేపల్లికి పిలుస్తారా? మందలిస్తారా.. మార్గం చూపుతారా? ఆ నియోజకవర్గం వైసీపీలో టెన్షన్ పీక్స్‌కు చేరుకుంటోందా? లెట్స్ వాచ్..!
ఉమ్మడి విశాఖజిల్లాలో వైసీపీకి అంతర్గత రాజకీయాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. పాయకరావుపేట, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో కుమ్ములాటలు కొలిక్కి వచ్చాయని ఊపిరిపీల్చుకుంటే ఇప్పుడు “ఈస్ట్”లో హైఓల్టేజ్ మొదలైంది. కొన్ని సంఘటనలపై ఇంఛార్జ్ విజయనిర్మల నేరుగా సీఎంగాకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. రెండు పేజీల లేఖలో ముఖ్య నాయకులు, వార్డు కార్పొరేటర్ల పనితీరు, అవినీతిని ప్రస్తావించినట్టు భోగట్టా. దీంతో హైకమాండ్ నుంచి ఎటువంటి రియాక్షన్ వుంటుందో అని అంతా కలవర పడుతున్నారట.
ఇటీవల వాహనమిత్ర పంపిణీ కోసం భారీ సభ నిర్వహించారు. ఇంఛార్జ్‌గా విజయనిర్మల పెట్టిన అన్ని ప్రతిపాదనలకు సీఎం సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ఈస్ట్ రాజకీయాల్లో పరిణామాలు మరింత వేగంగా మారాయి. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబును తూర్పులో ఎదుర్కోవాలంటే వైసీపీ నేతలు ఐక్యంగా కదలాలన్నది అధినాయకత్వం ఆలోచన. కానీ.. గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. విజయనిర్మల కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యంపై మిగిలిన గ్రూపులు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇంఛార్జ్‌గా ఆమెను తొలగించాలనే డిమాండ్‌తో తెరచాటు వ్యవహారాలు ఊపందుకున్నాయట. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, మేయర్ హరివెంకట కుమారి, విజయనిర్మల గ్రూపులు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నాయి.
పార్టీ పెద్దలకు పితూరీలు పెరగడంతోపాటు వైసీపీ కార్పొరేటర్లలో సైతం చీలిక వచ్చింది. పరిస్థితి చెయ్యి దాటకుండా ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి.. మూడు వర్గాలను వేర్వేరుగా పిలిపించి మాట్లాడారు. కలిసి పనిచేయకపోతే కఠిన వైఖరి తప్పదని హెచ్చరించారు కూడా. ఈ క్రమంలోనే విజయనిర్మల నేరుగా సీఎంకు ఫిర్యాదు చెయ్యడం చర్చగా మారింది. దీనికంటే ముందు ఆసక్తికరమైన పరిణామాలు జరిగినట్టు భోగట్టా. ఇటీవల విశాఖకు వచ్చిన ఇంఛార్జ్ మంత్రి విడదల రజనీతో తూర్పు ఇంఛార్జ్ విజయనిర్మల సమావేశం అయ్యారు. అంతర్గత కుమ్ములాటలు, టికెట్ రాకుండా అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయట. ఈ విషయంలో తనకు ఎదురైన అనుభవాలను మంత్రి రజనీ విజయనిర్మలతో షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. చిలకలూరిపేటలో వాటిని ఎలా ఎదుర్కోన్నదీ చెప్పారట. ఆ మీటింగ్ తర్వాత విజయనిర్మల వ్యూహం మార్చినట్టు సమాచారం. నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారనే చర్చ జరుగుతోంది. కీలకమైన నియోజకవర్గం విషయంలో గ్రూప్ రాజకీయాలను హైకమాండ్ సీరియస్‌గా తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. నేరుగా అధినేత దగ్గరకే పంచాయితీ వెళ్లడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. అందరి లెక్కలూ తేలే సమయం దగ్గర పడిందని అనుకుంటున్నారట.