పోర్ట్ సిటీ విశాఖపట్నంలో అధికార వైసీపీ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. తూర్పు, దక్షిణ నియోజకవర్గాల కుమ్ములాటలు కొలిక్కి రాకముందే పశ్చిమంలో ముసలం పుట్టింది. మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ విజయప్రసాద్‌కు హైకమాండ్ షాక్ ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్ధానంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌ను నియమించింది. “గడపగడపకు” ప్రభుత్వం కార్యక్రమం సమన్వయం చెయ్యాలని శ్రీధర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా వుండగా ఇప్పుడు నాయకత్వంను మార్చడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుందనే వాదన ఉందట. మళ్ళ విజయప్రసాద్‌ను తిరిగి నియమించే వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుండాలని నియోజకవర్గ పరిధిలోని కార్పోరేటర్లు, వార్డు అధ్యక్షులు నిర్ణయించుకున్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి హాజరుకావడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కో ఆర్డినేటర్ వ్యవస్థ బలమైంది. ఎమ్మెల్యేలతో సమానమైన గౌరవం కోసం నామినేటెడ్ పదవులు ఇచ్చింది ప్రభుత్వం. వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుత కో ఆర్డినేటర్లకే టిక్కెట్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. కానీ, గెలుపు గుర్రాల ఎంపికను వైసీపీ మొదలుపెట్టినట్టుంది.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన మళ్ళ 2014కు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం మాజీమంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్‌కు పశ్చిమ నియోజకవర్గంలో అవకాశం కల్పించింది హైకమాండ్. సిట్టింగ్ స్ధానం అయినప్పటికీ పెద్దల నిర్ణయానికి అనుగుణంగా రత్నాకర్‌తో కలిసి పనిచేశారు విజయప్రసాద్. ఎన్నికల తర్వాత రత్నాకర్ పార్టీని వీడి వెళ్ళిపోవడంతో విజయ్‌ప్రసాద్‌ను సమన్వయకర్తగా నియమించింది. అంతకుముందు నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు వుంది. 2019 ఎన్నికల్లో మళ్ల విజయప్రసాద్ ఓటమిపాలవ్వగా…. APEWIDC చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించింది.
ఐతే, కొద్ది నెలలుగా విజయప్రసాద్‌ను సమస్యలు చుట్టుముట్టాయి. ఆయన నిర్వహిస్తున్న వ్యాపార సంస్ధలు ఆర్ధిక వివాదాల్లో చిక్కుకోగా…..అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. నియోజకవర్గంలో విజయప్రసాద్ నేరుగా పాల్గోవడానికి ఇబ్బందులు ఎదురౌతున్నాయనే ఫీడ్ బ్యాక్ పార్టీ హైకమాండ్‌కు వెళ్ళింది. దీంతో సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించి డిప్యూటీ మేయర్‌ను తెరపైకి తెచ్చింది. ఈ సర్దుబాటుపై ఊహించని వ్యతిరేకత వస్తుండగా….అసలు స్టోరీ మరొకటి వుందనే చర్చ మొదలైంది. వాస్తవానికి డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ నియామకం
తాత్కాలికమేనని….ఎన్నికల నాటికి టిక్కెట్ ఆశిస్తున్న వారి కోసం ఇప్పటి నుంచే ప్లాట్ ఫాం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. విశాఖజిల్లాలో గవర సామాజిక వర్గానికి ఎన్నికలను ప్రభావితం చేసే సత్తా వుంది. పెద్దల దగ్గర తీర్మానం జరిగితే గంపగుత్తగా వ్యవహరించే కట్టుబాటు ఆ కులంలో కనిపిస్తుంది. ప్రధానంగా యలమంచిలి, అనకాపల్లి,గాజువాక, పశ్చిమ, పెందుర్తి.,ఉత్తర నియోజకవర్గాల్లో ఈ సామాజిక వర్గం గట్టిగా పనిచేస్తుంది. అందుకే పశ్చిమ నియోజకవర్గంలో టిక్కెట్లను టీడీపీ,వైసీపీలు గవర సామాజిక వర్గానికే కేటాయిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి మళ్ళకు అవకాశం దక్కుతుందని భావించగా….ఇక్కడ పార్టీ విజయంను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. రెండు సార్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబుకు హ్యాట్రిక్ అవకాశం రాకుండా కట్టడిచేసే ఎత్తుగడలను చాలా కాలం క్రితమే ప్రారంభించింది. ఫలితంగా జీవీఎంసీ ఎన్నికల్లో 10 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది.
ఈనేపథ్యంలో ఎన్నికల నాటికి మళ్ళ శక్తిసామర్ధ్యాలను అంచనా వేసి మార్పుపై నిర్ణయం తీసుకుందనే ప్రచారం మరో వర్గం చేస్తోంది. ఇక్కడ నుంచి విశాఖ డైరీ వైస్ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్‌ను పోటీకి దించేందుకు ఎక్కువ అవకాశాలు వున్నాయనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆనంద్ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన సోదరి రమాకుమారి ప్రస్తుతం యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్. ఇందుకు తొలి ప్రయత్నంగానే మళ్ళ విజయప్రసాద్ మార్పు జరిగిందనేది సమాచారం. పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులను సమన్వయం చేయడానికి నాయకుడు లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారిందని అధిష్ఠానం భా
వించింది. ఈ నేపథ్యంలో సమన్వయకర్తగా మళ్లను తొలగించి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌ను నియమించాలని నిర్ణయించింది.
ఐతే, హైకమాండ్ మౌఖిల ఆదేశాల వెనుక అసలు ఉద్దేశాలను మళ్ళ వర్గం పసిగట్టి జాగ్రత్తపడే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.