NTV Telugu Site icon

PJR :కాంగ్రెస్ లో చేరుతున్న విజయారెడ్డి.. టీఆర్ఎస్ ను వీడడానికి ఆ ఎమ్మెల్యే కారణమా?

New Project (42)

New Project (42)

విజయారెడ్డి. కాంగ్రెస్‌ దివంగత నేత PJR కుమార్తె. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌. రాజకీయ ప్రయాణాన్ని వైసీపీ నుంచి మొదలుపెట్టిన ఆమె.. 2014లో ఖైరతాబాద్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారామె. ఖైరతాబాద్‌ డివిజన్‌ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2018లో మరోసారి ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి పోటీచేయాలని విజయారెడ్డి ఆశించినా.. టీఆర్ఎస్‌ మాత్రం దానం నాగేందర్‌కు ఛాన్స్‌ ఇచ్చింది.

తనకు రావాల్సిన సీటును దానం తన్నుకుపోయారని ఆవేదనో ఏమో.. ఎమ్మెల్యేతో విజయారెడ్డికి పెద్దగా సఖ్యత లేదు. ఇద్దరూ అధికారపార్టీ నేతలే అయినప్పటికీ ఎవరికి వారుగా ఉంటున్నారు. ఆ గ్యాప్‌ బయట పడకపోయినా.. అంతర్గత పోరు మాత్రం కేడర్‌కు అర్ధమయ్యేది. మొన్నటి GHMC ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచినా తర్వాత విజయారెడ్డి గ్రేటర్‌ హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌ పీఠం ఆశించారు. అధికారపార్టీ మరొకరికి అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి టీఆర్‌ఎస్‌లో తనకు గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తితో విజయారెడ్డి ఉన్నట్టు సమాచారం. రాజకీయంగా తన ఎదుగుదలకు ఎమ్మెల్యే దానం అడ్డుపడుతున్నారో లేక.. పార్టీ తనను గుర్తించడం లేదని అనుమానిస్తున్నారో కానీ.. కారు దిగడానికే మొగ్గు చూపినట్టు ప్రచారం జరుగుతోంది.

విజయారెడ్డి సోదరుడు విష్ణువర్దన్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 2009లో జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణు.. 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో మూడో స్థానానికి పడిపోయినా.. 2018లో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచారు. విజయారెడ్డి ఖైరతాబాద్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో ఆ అవకాశం దక్కదనే ఆలోచనతోనే కండువా మార్చేస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. విజయారెడ్డితో మాట్లాడారట. తాను టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని వారికి చెప్పారట. ఇంతలోనే ఏమైందో ఏమో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితోపాటు మీడియా సమావేశంలో కనిపించారు విజయారెడ్డి. మరి.. కాంగ్రెస్‌లో విజయారెడ్డికి ఖైరతాబాద్‌ టికెట్‌ ఇస్తారా? ఆ మేరకు హామీ లభించిందో లేదో తెలియదు. విష్ణువర్ధన్‌రెడ్డి, విజయారెడ్డి ఇద్దరికీ కాంగ్రెస్‌ టికెట్స్‌ ఇస్తుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.