పొత్తుల దిశగా అడుగులు వేస్తున్న పార్టీలు క్షేత్రస్థాయిలో కత్తులు దూసుకుంటున్నాయా? కయ్యాలకు దిగుతున్నాయా? పొలిటికల్ వాతావరణం ఎందుకు మారిపోయింది? స్నేహం చిగురించగానే.. కలహాలు రావడానికి కారణం ఏంటి? ఇంతకీ ఏంటా పార్టీలు?
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ సీపీఐ
తెలంగాణలో టీఆర్ఎస్, వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నికలో కుదిరిన స్నేహం.. పొత్తుల దిశగా వెళ్తున్నట్టు ఉభయ పార్టీల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. అగ్రనాయకులు.. కీలక నేతలు కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ముఖ్యంగా కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో CPI, TRS వర్గాల మధ్య వాతావరణం భగ్గుమంటోంది. ఉభయ పక్షాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.. కేసులు పెట్టుకుంటున్నాయి. పొత్తులో వెళ్తాయని అనుకుంటున్న పార్టీల మధ్య వైరం.. కేడర్‌ను ఆశ్చర్య పరుస్తోంది.
సీఐ విషయంలో రెండు పార్టీల ఘర్షణ
CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుపైనే పోలీసులు కేసు పెట్టారు. పాలేరులో ఘర్షణలు కలకలం రేపుతున్నాయి. రెండు పార్టీల నేతలు తగ్గేదే లేదన్నట్టుగా గొడవలు పడుతున్నారు. ఈ కయ్యాలలో పోలీసుల ఎంట్రీ పరిస్థితిని మరింత వేడెక్కిస్తోంది. టీఆర్ఎస్, సీపీఐ నాయకులు ఇక్కడ శత్రుభావంతో అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతామధు ఒకవైపు ఉంటే.. సీపీఐ నాయకులు మరోవైపు కయ్ మంటున్నారు. ముఖ్యంగా ఒక సీఐ విషయంలో వివాదం డీజీపీ ఆఫీసు వరకు వెళ్లింది.
వైరం ముదరడంతో రెండు పక్షాలు ఆందోళన
టీఆర్ఎస్‌లో కొన్ని చేరికలు సైతం రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి తీరుపై నిప్పులు చెరుగుతున్నారు కామ్రేడ్లు. రాష్ట్రస్థాయిలో ఉభయ పార్టీల మధ్య అవగాహన ఉన్నప్పటికీ.. అవి గ్రౌండ్ లెవల్‌కు విస్తరించడం లేదు. దాంతో పంతాలకుపోయి.. ఘర్షణలు పడుతున్నారు. ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు బలంగా ఉన్న ప్రాంతంలో వైరం ముదిరితే అది రెండు పక్షాలకు మంచిది కాదనేది టీఆర్ఎస్, సీపీఐ వర్గాల అభిప్రాయంగా ఉంది. మరి.. ఈ సమస్య ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా.. రెండు పార్టీల పెద్దలు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి.
.