Site icon NTV Telugu

OTR: టీడీపీ, వైసీపీ రాజకీయాల మధ్య తిరుమల దర్శనాల వివాదం!

TDP vs YSRCP TTD

TDP vs YSRCP TTD

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ్ముళ్ళే తక్కువ చేసి చూపిస్తున్నారా? ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగిన వైకుంఠ ఏకాదశి దర్శనాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారా? పనిగట్టుకుని మరీ… పాజిటివ్‌ వైబ్స్‌ను నెగెటివ్‌ మోడ్‌లోకి తీసుకెళ్ళడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అదీకూడా అధికార పార్టీ వాళ్ళే సోషల్‌ రాతలతో చెలరేగిపోవడానికి కారణాలేంటి? టీడీపీ వాళ్ళమని చెప్పుకునే కొందరు తమ చర్యలతో అసలు ఎవరి పరువు తీస్తున్నారో అర్ధమవుతోందా?

అంతటి ప్రాముఖ్యత, ప్రాశస్త్యం ఉన్న వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అసలు ఆ రోజున క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ అన్నది టీటీడీ సిబ్బందికి చాలా పెద్ద టాస్క్‌. చిన్న తేడా జరిగినా… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాలా రోజుల ముందు నుంచే ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తు జరుగుతూ ఉంటుంది. అయితే… ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంతలా ఏర్పాట్లు చేసినా… ఏదో ఒక చిన్న లోపాన్నో, వేరే ఘటననో బేస్‌ చేసుకుని, కొందరు పనిగట్టుకుని మరీ సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం కామెంట్స్‌ చేయడం, టీడీపీ అభాసుపాలవడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. ప్రభుత్వాలు ఏవైనా, అధికారంలో ఉన్న పార్టీ ఏదైనాసరే…. ఈ తిప్పలు మాత్రం తప్పడం లేదు. అక్కడ జరుగుతున్నదేంటి, లక్షల మంది భక్తుల్ని నియంత్రించడానికి ఏ స్థాయిలో అప్రమత్తంగా ఉంటే… దర్శనాలు సాఫీగా జరిగిపోతున్నాయన్నదాంతో సంబంధం లేకుండా… ఎవడికి వాడు సోషల్‌ మీడియాలో విచ్చలవిడి రాతలు రాసేస్తూ… స్వామి వైభవోత్సవంలో మచ్చలు వెదుక్కుంటున్నారు.

విమర్శలకు వెరవకుండా… ఎప్పటికప్పుడు వైకుంఠ ఏకాదశి నిర్వహణలో పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేసుకుంటూ వస్తోంది టీటీడీ. గతంలో ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే తెరిచే వైకుంఠ ద్వారాలను 2020 నుంచి పది రోజులకు పెంచడం కూడా అందులో భాగమే. అయినా కూడా నిరుడు జనవరి 8న వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుపతిలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఈసారి ఇంకా జాగ్రత్తపడ్డారు. స్వయంగా సీఎం చంద్రబాబే టీటీడీ అధికారులతో సమావేశమై దీనికి సంబంధించిన దిశా నిర్దేశం చేశారు. దాంతో… అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మొదటి మూడు రోజులకు ఆన్‌లైన్‌ విధానంలో దర్శన టోకెన్స్‌ జారీ చేశారు. మిగిలిన ఏడు రోజులకు గతంలోని విధానంలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా మూడు రోజులకు లక్షా 89 వేల చొప్పున టోకెన్లు జారీ చేసింది టీటీడీ. ఇక ఈసారి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించింది. వేకువజాము నుంచే శ్రీవారిని దర్శించుకొని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు టీటీడీ అనుసరించిన విధానాన్ని ప్రశంసించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సులభతరంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించారంటూ ప్రభుత్వాన్ని, టీటీడీని అభినందించారు.

కానీ… దేవస్థానం అధికారులకు ఈ ఆనందం ఎక్కువసేపు నిలవనీయకుండా చెలరేగిపోయారు సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు. అదీకూడా… అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల పేరుతో ఇష్టానుసారం రాతలు రాసేయడం ఇటు టీటీడీ, అటు టీడీపీ వర్గాలను కలవరపెడుతోంది. టీటీడీ అధికారులు వైసీపీ వాళ్ళకేదో పెద్దపీట వేశారంటూ ఫోటోలు సర్క్యులేట్‌ చేస్తూ…. చేసిన విమర్శలు దేవస్థానం అధికారుల స్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న వాదన బలంగా ఉంది.
వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉదయాన్నే వీఐపీలను దర్శనానికి అనుమతిస్తుంది టీటీడీ. రాజ్యాంగ పదవిలో వున్నవారు స్వయంగా దర్శనానికి వస్తే…ఆలయ ప్రోటోకాల్‌ నిబంధనల ప్రకారం వారితో పాటు హోదాను బట్టి ఐదు లేదా తొమ్మిది మందిని దర్శనానికి అనుమతిస్తారు. అందుకు రాజకీయాలు, పార్టీలు, అధికార, ప్రతిపక్ష హోదాలతో సంబంధం లేదు. వైసీపీ ప్రజా ప్రతినిధులకు కూడా ఆ రూల్స్‌ ప్రకారమే ఈసారి కూడా దర్శనం చేయించారు అధికారులు. వాళ్ళతో పాటు వచ్చిన వారిని అనుమతించారు. కానీ…. మాజీ మంత్రి రోజా, దేవినేని అవినాష్ బ్రేక్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లడాన్ని తెలుగు తమ్ముళ్లు సోషల్‌ మీడియాలో ట్రోల్ చేశారు. అసలు వీళ్ళకు దగ్గరుండి వీఐపీ దర్శనాలు ఎలా చేయిస్తారంటూ…ప్రశ్నాస్త్రాలు సంధించారు. కేవలం ప్రశ్నలకు పరిమితమైతే ఫర్లేదుగానీ… సొంత టీడీపీ వాళ్ళే ఒకలాంటి దుష్ర్పచారం చేయడం ఇటు ప్రభుత్వ వర్గాలకు కూడా మింగుడు పడ్డం లేదట. ఇక వైసీపీ వాళ్ళ దర్శనాల విషయానికొస్తే… మాజీ మంత్రి రోజా … పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కళ్యాణి సిఫార్సు లేఖ మీద, దేవినేని అవినాష్ దంపతులు మరో ఎమ్మెల్సీ తలశిల రఘురాం సిఫార్సు లేఖ మీద దర్శనానికి వెళ్లారు. ఆ ప్రకారం చూస్తే… వాళ్ళని అడ్డుకునే అధికారం టీటీడీకి లేదు. కానీ… తమ్ముళ్ల ట్రోలింగ్‌ తట్టుకోలేక అధికారులు ఆ విషయాన్నే వివరణ రూపంలో ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో… నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కనివ్వబోనన్న ఓ సినిమా డైలాగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు చాలామంది.

టీడీపీ నేతలు కూడా చాలామంది వీఐపీ ప్రోటోకాల్‌ దర్శనాలు చేసుకున్నారు. అలాగని అధికార పార్టీలో ఉన్న అందరికీ అవి దక్కాలంటే ఎలాగన్నది బిగ్‌ క్వశ్చన్‌. అధికార, ప్రతిపక్షాలు, రాజకీయంతో సంబంధం లేకుండా రూల్స్‌ ప్రకారం ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకు బ్రేక్‌ దర్శనం ఉంటుందన్న వాస్తవం తెలిసి కూడా సొంతోళ్ళే ఇలా చేయడం కరెక్ట్‌ కాదని, దానివల్ల వాళ్ళు టీడీపీ ప్రభుత్వాన్నే ఇరుకున పెడుతున్నారన్న చర్చలు పార్టీలోనే జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారు అధికార పార్టీకి మాత్రమే పరిమితం కాదుకదా… ఆ దేవదేవుడి దర్శనాలను వివాదం చేసి టీడీపీ వాళ్ళే సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఈ అనవసరమైన వివాదంతో… ఈసారి అద్భుతమైన ఏర్పాట్లు చేశారన్న మైలేజ్‌ దక్కకుండా పోయిందన్న బాధ కూడా ఉందట టీడీపీలోని ఓ వర్గంలో.

Exit mobile version